Search This Blog

Saturday, February 1, 2025

Bad breath: లివర్​ డ్యామేజీకి, నోటి దుర్వాసనకు లింకేమిటో తెలుసా?

 

లివర్​ డ్యామేజీకి, నోటి దుర్వాసనకు లింకేమిటో తెలుసా?

liver damage to diabetes 5 common causes of bad breath
    ఇటీవలి కాలంలో చాలా మంది నోటి దుర్వాసన సమస్యతో బాధపడుతున్నారు. జంక్ ఫుడ్, షుగర్ అత్యధికంగా ఉండే ఆహారం, పానీయాలు ఎక్కువగా తీసుకోవడం, నోటి శుభ్రతను సరిగా పాటించకపోవడం వంటివి దీనికి కారణం అవుతూ ఉంటాయి. అయితే కొందరిలో ఈ అలవాట్లు లేకపోయినా, రోజూ రెండు సార్లు నోరు బాగా బ్రష్ చేసుకున్నా కూడా నోటి దుర్వాసన సమస్య వెంటాడుతూ ఉంటుంది. దీనికి పలు రకాల అనారోగ్యాలు కారణం కావొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

    కాలేయం దెబ్బతినడం...
    కాలేయం దెబ్బతిన్నవారిలో, ఫ్యాటీ లివర్ సమస్య ఉన్నవారిలో నోటి దుర్వాసన సమస్య ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. లివర్ దెబ్బతిన్న సమయంలో శరీరంలోని విష పదార్థాలను సరిగా వడగట్టలేకపోతుందని.. దీనితో శరీరంలో పేరుకుపోయే వ్యర్థాలతో నోటి దుర్వాసన సమస్య వస్తుందని వివరిస్తున్నారు. వీలైతే చెక్ చేయించుకోవడం మంచిదని స్పష్టం చేస్తున్నారు.

    కిడ్నీ సమస్యలు...
    శరీరంలో కిడ్నీల పనితీరు దెబ్బతిన్నవారిలో కూడా శరీరంలో వ్యర్థాలు, విష పదార్థాలు పేరుకుపోతాయి. అవి రక్తంలో కలసి ఊపిరితిత్తులకు చేరుతాయి. ఊపిరితిత్తులు ఆక్సిజన్ ను సంగ్రహించి, కార్బన్ డయాక్సైడ్ ను వదిలేసే క్రమంలో ఈ వ్యర్థాలతో కూడిన రక్తం నుంచి దుర్వాసన వెలువడుతుందని నిపుణులు చెబుతున్నారు. దీనిని ‘యురెమిక్ బ్రీత్’గా పిలుస్తారని వివరిస్తున్నారు. 

    మధుమేహంతో బాధపడుతుంటే...
    షుగర్ తో బాధపడుతున్నవారిలోనూ నోటి దుర్వాసన ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే షుగర్ స్థాయులు అత్యధికంగా ఉన్నప్పుడు ఈ దుర్వాసన ఇబ్బందికర స్థాయిలో ఉంటుందని వివరిస్తున్నారు. ఇది కాస్త కుళ్లిపోతున్న పండ్ల వంటి వాసన వస్తుందని... దీనిని ‘అసెటోన్ బ్రీత్’ అంటారని వివరిస్తున్నారు. ఇలాంటి సమస్య ఉంటే షుగర్ స్థాయులు బాగా ఎక్కువగా ఉన్నట్టు గుర్తించవచ్చని స్పష్టం చేస్తున్నారు.

    శ్వాస వ్యవస్థకు సంబంధించిన వ్యాధులు...
    శ్వాస వ్యవస్థకు సంబంధించి బ్రాంకైటిస్, సైనసైటిస్, న్యూమోనియా వంటి వ్యాధులు ఉన్నప్పుడు కూడా శ్వాసలో దుర్వాసన వస్తుందని నిపుణులు చెబుతున్నారు. శ్వాస నాళంలో చేరే బ్యాక్టీరియా కారణంగా ఈ వాసన వస్తుందని వివరిస్తున్నారు.

    జీర్ణ సంబంధిత సమస్యలు...
    ఏసిడిటీ, గ్యాస్ట్రో ఎసోఫేగల్ రిఫ్లక్స్ డిసీజ్ (గెర్డ్), కడుపులో అల్సర్లు వంటి సమస్యలు ఉన్నవారిలోనూ శ్వాసలో దుర్వాసన వస్తుందని నిపుణులు చెబుతున్నారు.

    ఈ అంశాలు గుర్తుంచుకోండి
    నోటి దుర్వాసనకు ఎన్నో రకాల కారణాలు ఉంటాయన్నది గుర్తుంచుకోవాలని నిపుణుల స్పష్టం చేస్తున్నారు. కేవలం కిడ్నీ, లివర్, మధుమేహం సమస్యలు కావొచ్చని భావించవద్దని... వైద్యులను కలసి తగిన పరీక్షలు చేయించుకోవాలని స్పష్టం చేస్తున్నారు. తగిన నోటి పరిశుభ్రత పాటిస్తున్నా కూడా శ్వాసలో దుర్వాసన వస్తుంటే మాత్రం కచ్చితంగా ఏదో అనారోగ్య సమస్య ఉన్నట్టేనని... వీలైనంత త్వరగా వైద్యులను సంప్రదించడం మేలు అని పేర్కొంటున్నారు

    TSWREIS

    TGARIEA ONLINE MEMBERSHIP

    MATHS VIDEOS

    EAMCET/IIT JEE /NEET CLASSES

    Top