రోజూ మెంతులను ఇలా తీసుకున్నారంటే - షుగర్ కంట్రోల్, వెయిట్ లాస్‌తో పాటు మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు!
Health Benefits of Fenugreek Seeds : ప్రస్తుత రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా ఎక్కువ మంది ఎదుర్కొంటున్న సమస్య డయాబెటిస్. ఇది వచ్చిందంటే ఆహారం, జీవనశైలి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. లేదంటే రక్తంలో షుగర్ లెవల్స్ పెరిగి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీసే ఛాన్స్ ఉంటుంది. కానీ, కొన్నిసార్లు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా రక్తంలో షుగర్ లెవల్స్ అదుపులో ఉండవు! అయితే, మధుమేహులు రోజువారీ ఆహారంలో మెంతులను భాగం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుందంటున్నారు ఆయుర్వేద నిపుణురాలు డాక్టర్ గాయత్రీదేవి. వాటిలో ఉండే పోషకాలు, ఔషధ గుణాలు షుగర్‌ని అదుపులో ఉంచడానికి చాలా బాగా తోడ్పడతాయంటున్నారు. పలు పరిశోధనల్లోనూ ఈ విషయం వెల్లడైంది. ఇంతకీ, మెంతులు డయాబెటిస్ నియంత్రణకు ఎలా తోడ్పడతాయి? వీటిని ఏవిధంగా తీసుకోవాలి? తద్వారా కలిగే ఇతర ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం.
మెంతులు వంటకాల రుచిని పెంచడంలోనే కాదు ఆరోగ్యాన్ని కాపాడడంలోనూ అద్భుతంగా పనిచేస్తాయంటున్నారు డాక్టర్ గాయత్రీదేవి. ముఖ్యంగా మెంతులలో ఉండే పీచు, ఆల్కలాయిడ్స్, ఇన్సులిన్‌ను ప్రేరేపించే గుణం గల 2-ఆక్సోగ్లుటేట్ అణువులు గ్లూకోజు లెవల్స్ అదుపులో ఉండటానికి తోడ్పడతాయి. కాబట్టి, మధుమేహం రిస్కు ఎక్కువగా ఉన్నవాళ్లు, టైప్-2 డయాబెటిస్ బాధితులు డైలీ డైట్లో మెంతులను భాగం చేసుకోవడం ద్వారా షుగర్‌ని కంట్రోల్లో ఉంచుకోవచ్చంటున్నారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సభ్యుల బృందం జరిపిన ఒక రిసెర్చ్‌లో కూడా మెంతుల్లో ఉండే పోషకాలు, ఔషధ గుణాలు డయాబెటిస్‌ని అదుపులో ఉంచడానికి తోడ్పడతాయని వెల్లడైంది. అందుకు సంబంధించిన రిపోర్టు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇంకెన్నో ఆరోగ్య ప్రయోజనాలు!
మెంతులు ఒక్క డయాబెటిస్‌కి మాత్రమే కాదు అధిక బరువు, అధిక కొలెస్ట్రాల్ వంటి సమస్యలకు చక్కటి పరిష్కారంగా చెబుతున్నారు. జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలోనూ ఇవి చాలా బాగా సహాయపడతాయి. ముఖ్యంగా వీటిల్లోని పీచు పొట్ట ఆరోగ్యానికి మేలు చేసే బ్యాక్టీరియా పెరగడానికి తోడ్పడుతుంది. అంతేకాకుండా, శరీరంలోని చెడు కొలస్ట్రాల్ అయిన ఎల్‌డీఎల్‌ను నియంత్రించి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. పాలిచ్చే తల్లులకు ఈ గింజలు ఎంతో మేలు చేస్తాయి. అలాగే, ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలనూ ప్రోత్సహిస్తాయి. అదనంగా పీసీఓడీ(PCOD) ప్రాబ్లమ్‌తో ఇబ్బంది పడే మహిళలకూ మెంతులు చాలా బాగా ఉపయోగపడతాయంటున్నారు డాక్టర్ గాయత్రీదేవి.
వీటిని ఎలా తీసుకోవచ్చంటే?
మెంతుల పొడిని నేరుగా కూరల్లో వాడుకోవచ్చు. పిండిలో కలిపి రొట్టెలు చేసుకోవచ్చు. లేదంటే రాత్రిపూట నానబెట్టి తెల్లారి వాటిని వడగట్టి, నీళ్లు తాగొచ్చు. వేడి నీటిలో 10 నిమిషాల సేపు మెంతులను వేసి మూతపెట్టి, తర్వాత వడగట్టి సేవించవచ్చు. కావాలంటే మెంతులతో టీ కూడా కాచుకొని వేడివేడిగా తీసుకోవచ్చు. లేదంటే రోజూ రెండు చెంచాల మెంతుల పొడిని నీటిలో లేదా పాలలో వేసుకొని తీసుకోవచ్చు. ఇలా రోజువారీ డైట్లో మెంతులను భాగం చేసుకోవడం ద్వారా మధుమేహంతో పాటు ఎన్నో ఆరోగ్య సమస్యల నుంచి మంచి రక్షణ పొందవచ్చంటున్నారు ఆయుర్వేద నిపుణురాలు డాక్టర్ గాయత్రీదేవి.