ఈ ధ్రువపత్రాలు ఉంటేనే గురుకులంలో ప్రవేశం
రాబోయే(2025-26) విద్యా సంవత్సరంలో గురుకుల పాఠశాలల్లో చేపట్టే ప్రవేశాలకు ప్రభుత్వం దరఖాస్తుల స్వీకరణ చేపట్టింది. ఈ ఏడాది చేరికల్లో కొన్ని మార్పులు చేసింది.
రాబోయే విద్యా సంవత్సరంలో గురుకుల పాఠశాలల్లో చేపట్టే ప్రవేశాలకు ప్రభుత్వం దరఖాస్తుల స్వీకరణ చేపట్టింది. ఈ ఏడాది చేరికల్లో కొన్ని మార్పులు చేసింది. గతంలో ఆధార్ కార్డు, చరవాణి సంఖ్య ఉంటే దరఖాస్తు చేసుకొనే అవకాశం ఉండేది. ఈ ఏడాది నుంచి కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలను ముందే సమర్పించి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో ఐదో తరగతికి ఒక సారి, ఆరు నుంచి తొమ్మిదో తరగతుల్లో ప్రవేశాలకు మరో విడత దరఖాస్తుల స్వీకరణ ఉండేది. అర్హత పరీక్షల్లో సైతం వేర్వేరు తేదీల్లో నిర్వహించే వారు. ఈ ఏడాది ఐదు నుంచి తొమ్మిది తరగతులకు ఒకే సారి దరఖాస్తుల స్వీకరణ, అర్హత పరీక్ష నిర్వహించే ఏర్పాట్లను చేస్తుంది.
గడువు
గత నెల డిసెంబరు 21వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. అంతర్జాలంలో గడువు ముగింపు తేదీ 01-02-2025 వరకు ఉంది. 23 ఫిబ్రవరి 2025న అర్హత పరీక్ష నిర్వహిస్తారు.
సద్వినియోగం చేసుకోవాలి
గురుకుల పాఠశాలల్లో ప్రవేశం పొందాలనుకునే విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. తగిన పత్రాలతో మీ-సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలి. ఒక్కో చరవాణికి ఒక దరఖాస్తు మాత్రమే స్వీకరిస్తారు.