motivation: జీవితంలో ప్రశాంతత లేకపోవడం వల్ల ఎంతో తీవ్ర డిప్రెషన్ కు గురవుతున్నారు. మనశ్శాంతి కోసం ఏవేవో పనులు చేస్తూ ఉంటారు. నిజానికి లైఫ్ లో ప్రశాంతత కావాలంటే మీరు జీవితంలో కొన్ని విషయాలను నియంత్రణలో ఉంచుకోవాలి.
మోటివేషనల్ స్టోరీ:
జీవితం సున్నితమైనది. మన ఆలోచనలు, చేతల వల్లే జీవితం మలుపులు తిరుగుతుంది. కొన్ని సందర్భాల్లో ఆ జీవితం ఒక్కోసారి మన చేతుల్లోంచి జారిపోతుంది. దానికి కారణం కూడా మనమే. మనం చేసే కొన్ని పనులే జీవితాన్ని కష్టాల్లోకి నెట్టేస్తాయి. జీవితం ప్రశాంతంగా ఉండాలంటే మీరు కొన్ని విషయాలను మీ నియంత్రణలో ఉండేలా చూసుకోవాలి.
మీ ఆలోచనలు, అభిప్రాయాలు మీ అదుపులో ఉంటే మీకు ప్రశాంతమైన జీవితం వస్తుంది. ప్రతి మనిషి మనశ్శాంతిగా జీవించాలని కోరుకుంటాడు. అలా జీవించాలంటే మీరు కచ్చితంగా మీ నియంత్రణలో పెట్టుకోవాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. వాటిని మీరు ఎలా ఉపయోగిస్తారన్న దానిపైనే మీ లైఫ్ ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీరు మీ అదుపులో ఉంచుకోవాల్సిన అంశాలేంటో తెలుసుకోండి.
1. మీ శరీరం
2. మీ ఆరోగ్యం
3. మీ ఆలోచనలు
4. మీ భావోద్వేగాలు
5. మీ చర్యలు
6. మీ నిర్ణయాలు
7. మీ అభిప్రాయాలు
8. మీ ప్రతిస్పందనలు
9. మీ మాటలు, ప్రవర్తన
10. మీ ప్రయత్నాలు
11. మీ నమ్మకాలు
12. మీ సమయం
13. మీ కోరికలు, ఆకాంక్షలు, లక్ష్యాలు
14. అభిరుచులు, అలవాట్లు
ఇవన్నీ మీ నియంత్రణలో ఉంటే మీ జీవితం అధ్భుతంగా ఉంటుంది. మీకు మనశ్శాంతి, ప్రశాంతత దక్కుతుంది.
పరిస్థితులకు మీరు ఎలా స్పందిస్తారు, మీ అభిరుచులు ఏమిటి, మీ సమయాన్ని మీరు ఎలా ఉపయోగిస్తారు, మీ నిర్ణయాలు ఏమిటి, సోషల్ మీడియాలో మిమ్మల్ని మీరు ఎలా నిమగ్నం చేస్తారు, ప్రశంసలు, దూషణలు, హేళనలకు మీ ప్రతిస్పందన ఏమిటి?… ఇవన్నీ కూడా మీ జీవితాన్ని నిర్ణయిస్తాయి.
మీ అవసరాలకు అనుగుణంగా వీటిని మెరుగుపరుచుకోవచ్చు, మార్చుకోవచ్చు. వీటిపై ఎంత ఎక్కువ దృష్టి పెడితే అంతగా మీ సామర్థ్యం పెరుగుతుంది. మనశ్శాంతి, వ్యక్తిత్వం అభివృద్ధి చెందుతాయి.
మీరు మీ లోపాలను తెలుసుకుని సరిదిద్దుకుంటూ ఉంటే మీ లైఫ్ హాయిగా సాగిపోతుంది. మీ విధులు, బాధ్యతలపై దృష్టి పెడితే, మీరు మీ లక్ష్యాలను చేరుకునే అవకాశం ఉంది. కష్టకాలం వస్తే పరిస్థితిని అర్థం చేసుకోవాలి కానీ, ఇతరులను నిందించకూడదు.
ఇతరులలో మీకు నచ్చని అంశాలు ఉంటే మీ ఇష్టానుసారం మార్చడానికి ప్రయత్నించవద్దు. మీరు కోరుకున్నట్టు మార్పులు జరగకపోతే సంఘర్షణలు, భేదాభిప్రాయాలు వస్తాయి. మనస్సు విచారంగా మారుతుంది. వాటిని తట్టుకునే శక్తిని మీరు పెంచుకోవాలి. ఇతరుల చర్యలు, మాటలపై మనం ఆధిపత్యం చెలాయించాలని చూడవద్దు. ఇలా చేయడం వల్ల కూడా సమస్యలు వస్తాయి. జీవితం కష్టంగా మారుతుంది. ప్రశాంతత పోతుంది.
కాబట్టి మీ చుట్టూ ఉన్న ప్రతి వ్యక్తిని గౌరవించండి. వారి ఆసక్తులు, ఎంపికలు, అభిప్రాయాలు, నిర్ణయాలు మీ ఇష్టాలకు విరుద్ధంగా ఉన్నప్పటికీ సరే మీరు వారిని గౌరవించాల్సిందే. ఎదుటి వారిని మీకు నచ్చినట్టు మారమని వారిని బలవంతం చేయకండి. వారు మారకపోయినా బాధపడకండి. ప్రతిదీ మీకు నచ్చినట్టే జరగాలని కోరుకుంటేనే సమస్యలు మొదలవుతాయి. కాబట్టి ఎదుటి వారి జీవితంలోకి తొంగి చూడకుండా ప్రశాంతంగా జీవించేందుకు ప్రయత్నించండి.