Integrated Gurukul schools: 2,560 మంది విద్యార్థులు.. 120 మంది టీచర్లు
ప్రభుత్వం నిర్మించనున్న యంగ్ ఇండియా సమీకృత గురుకులాల్లో ఒక్కో దాంట్లో 2,560 మంది విద్యార్థులు ఐదో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుకోనున్నారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పాఠశాలలకు వేర్వేరు బ్లాక్‌లు
వాతావరణ అనుకూలంగా భవనాల నిర్మాణం
సాంస్కృతిక, విద్యా కార్యక్రమాలకు ప్రత్యేకంగా ఆడిటోరియం
సమీకృత గురుకులాల ప్రత్యేకతలు
ఈనాడు, హైదరాబాద్: ప్రభుత్వం నిర్మించనున్న యంగ్ ఇండియా సమీకృత గురుకులాల్లో ఒక్కో దాంట్లో 2,560 మంది విద్యార్థులు ఐదో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుకోనున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకుల సొసైటీలకు చెందిన నాలుగు పాఠశాలలు ఈ భవనంలో ఉంటాయి. ఒక్కో పాఠశాలలో 640 మంది విద్యార్థుల చొప్పున ఉంటారు. ఈ పాఠశాలలకు వేర్వేరు బ్లాక్‌లు ఉంటాయి. ప్రతి పాఠశాలలో 30 మంది చొప్పున 120 మంది టీచర్లు పనిచేస్తారు. సమీకృత గురుకులానికి పరిపాలన భవనం ప్రత్యేకంగా ఉంటుంది. లైబ్రరీలో 5 వేల పుస్తకాలు, కంప్యూటర్ కేంద్రంలో 60 కంప్యూటర్లు ఉంటాయి. అన్ని తరగతి గదుల్లో డిజిటల్ బోర్డులు ఉంటాయి. 900 మంది ఒకేసారి కూర్చుని భోజనం చేసేలా డైనింగ్ హాలు నిర్మించనున్నారు. సమీకృత గురుకులాల నమూనా ఆవిష్కరణ సందర్భంగా ఆర్కిటెక్ నిపుణులు గురుకులాల్లో కల్పించే సౌకర్యాలను పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా కొడంగల్‌లో నిర్మించే సమీకృత భవనం వివరాలను వెల్లడించారు. ప్రస్తుతం అక్కడున్న గురుకుల భవనాన్ని ఉపయోగించుకుంటూనే.. అదనపు భవనాలు, మౌలిక సదుపాయాలు అందుబాటులోకి తీసుకురానున్నారు. సమీకృత గురుకుల భవనాలు నిర్మించే ప్రాంతాల్లో 25 ఏళ్ల క్రితం నుంచి అక్కడి ఉష్ణోగ్రతలు, వర్షపాతం, చలి, వేడిగాలుల తీవ్రత తదితర వాతావరణ అంశాల్ని ఆర్కిటెక్ సంస్థ పరిగణనలోకి తీసుకుంది. వాతావరణ అనుకూల భవనాలను డిజైన్ చేసింది. ప్రతి డార్మిటరీ గదిలో పది బెడ్‌లు, రెండు బాత్‌రూములు ఉండేలా ప్రణాళిక చేసింది.
తొలి విడత పైలట్ ప్రాజెక్టులో భవనాలు నిర్మించే ప్రాంతాలు..
కొడంగల్, హుస్నాబాద్, హుజూర్‌నగర్, ములుగు, ఖమ్మం, కొల్లాపూర్, చాంద్రాయణగుట్ట, మంచిర్యాల, అచ్చంపేట, తిరుమలగిరి, మధిర, నల్గొండ, మంథని, పాలేరు, వరంగల్, అందోలు, భూపాలపల్లి, స్టేషన్ ఘన్‌పూర్, తుంగతుర్తి.
సమీకృత గురుకుల భవనం నమూనా
గురుకులాల్లో కల్పించే సదుపాయాల్లో కొన్ని..
క్యాంపస్‌లో ఉండే సౌకర్యాలివీ...
తరగతి గదులు, ల్యాబొరేటరీలు, కంప్యూటర్ సెంటర్, లైబ్రరీ, ఆడిటోరియం, వసతిగృహాలు, డైనింగ్, కిచెన్, బహుళ వినియోగ హాళ్లు, సిబ్బందికి నివాసగృహాలు, క్లబ్‌లు; వైద్యశాల, ఇండోర్ స్పోర్ట్స్, క్రికెట్, ఫుట్‌బాల్ మైదానాలు, బాస్కెట్‌బాల్, వాలీబాల్, టెన్నిస్ కోర్టులు, ఔట్‌డోర్ జిమ్, థియేటర్, ల్యాండ్‌స్కేప్ కోర్టులు.