Integrated gurukul schools: సమీకృత గురుకులాలకు 11న శంకుస్థాపన
యంగ్ ఇండియా సమీకృత గురుకులాలకు ఈనెల 11న భూమి పూజ చేయనున్నట్లు ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
విలేకరులతో మాట్లాడుతున్న ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పక్కన మంత్రులు పొన్నం, కోమటిరెడ్డి
ఈనాడు, హైదరాబాద్: యంగ్ ఇండియా సమీకృత గురుకులాలకు ఈనెల 11న భూమి పూజ చేయనున్నట్లు ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. బడుగు, బలహీన, వెనుకబడిన వర్గాల వారిని, పేదలను ప్రపంచస్థాయి మానవ వనరులతో పోటీపడేలా తీర్చిదిద్దేందుకు వీలుగా వీటికి రూపకల్పన చేశామన్నారు. రాష్ట్రంలో కుల, మతాలకు అతీతంగా విద్యార్థులందరూ ఒకేచోట విద్యను అభ్యసించాలన్నది లక్ష్యమన్నారు. సమీకృత గురుకులాలపై ఆదివారమిక్కడ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, సంక్షేమశాఖల ముఖ్యకార్యదర్శులు, గురుకుల సొసైటీల కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు. నమూనా నిర్మాణాలను మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌లతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ‘‘తొలివిడతలో 22 నియోజకవర్గాల పరిధిలో వీటిని చేపడుతున్నాం. ఒక్కోటి 20-25 ఎకరాల్లో ఉంటుంది. వచ్చే ఏడాది దసరా నాటికి నిర్మాణాలను పూర్తిచేస్తాం. ఆర్కిటెక్ సంస్థ గత 25 ఏళ్ల వాతావరణ పరిస్థితుల వివరాలు, ఇతర గణాంకాలను అధ్యయనం చేసి డిజైన్లు రూపొందించింది. అన్ని నియోజకవర్గాల్లో వీటిని నిర్మిస్తాం. అవసరమైతే సంఖ్యను పెంచుతాం. ఇందుకోసం రూ.5,000 కోట్లు ఖర్చు చేస్తాం. ఈ గురుకులాల్లో ఐదు నుంచి 12వ తరగతి వరకు ఆంగ్లమాధ్యమంలో బోధన ఉంటుంది. ప్రవేశాలకు ప్రస్తుతమున్న విధానం కొనసాగుతుంది. దరఖాస్తులో కులం, మతం కాలమ్స్ కొనసాగుతాయి. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల ప్రకారం విద్యార్థుల వినోదం కోసం కాంప్లెక్సులో థియేటర్ నిర్మించి, వారానికి లేదా నెలకో సినిమాను శాటిలైట్ ద్వారా ప్రదర్శిస్తాం’’ అని భట్టి తెలిపారు.
అద్దె భవనాల్లో 662 గురుకులాలు...
ప్రస్తుతం రాష్ట్రంలోని గురుకులాల్లో సరైన వసతుల్లేవని, సంక్షేమశాఖల పరిధిలో 1,023 ఉంటే.. ఇందులో 662 అద్దెభవనాల్లో, సరైన వసతులు లేని పరిస్థితుల్లో కొనసాగుతున్నాయని డిప్యూటీ సీఎం విక్రమార్క తెలిపారు. ‘‘గత ప్రభుత్వం భవన నిర్మాణాలకు కేవలం రూ.73కోట్లు మాత్రమే ఖర్చుచేసింది. సరైన వసతులు లేకుండా విద్యార్థులకు మెరుగైన చదువు సాధ్యం కాదని మా ప్రభుత్వం భావించింది. ఈ మేరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు అత్యుత్తమ కార్పొరేట్‌స్థాయి వసతులతో సమీకృత గురుకుల భవనాలు నిర్మించాలన్న చారిత్రక నిర్ణయాన్ని తీసుకుంది’’ అని ఆయన తెలిపారు.
అప్పులుచేశారు.. సౌకర్యాలు కల్పించలేదు: కోమటిరెడ్డి
గత ప్రభుత్వం రూ.7లక్షల కోట్ల అప్పులు చేసింది కానీ పేదలు చదువుకునే విద్యాలయాలకు మౌలిక సదుపాయాలు కల్పించలేదని మంత్రి కోమటిరెడ్డి ధ్వజమెత్తారు. ‘‘సమీకృత గురుకులాల నిర్మాణం.. దసరా సందర్భంగా ప్రజలకు ప్రభుత్వమిస్తున్న కానుక. దీన్ని ప్రజలు, ప్రతిపక్షాలు స్వాగతించాలి. ఎల్‌బీనగర్‌లోని ఒక గురుకులంలో 20 గదుల్లో 700 మంది విద్యార్థులున్నారని అక్కడి సిబ్బంది తెలిపారు. సోమవారం ఆ పాఠశాలను సందర్శిస్తా. అవసరమైతే మరో భవనం తీసుకుని విద్యార్థులకు అన్ని సదుపాయాలు కల్పిస్తాం. మూసీ మురికికూపం నుంచి కోటిమందిని బయటపడేయాలని ప్రభుత్వం భావిస్తే, ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి’’ అని విమర్శించారు.
పదేళ్లుగా విద్యావ్యవస్థను పట్టించుకోలేదు: పొన్నం
సమీకృత గురుకులాల నిర్మాణం విప్లవాత్మకమైన నిర్ణయమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ‘‘అమ్మ ఆదర్శ పాఠశాలల పేరిట 22వేల పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కోసం రూ.1,100 కోట్లు ఖర్చుచేశాం. పదేళ్లుగా విద్యావ్యవస్థను పట్టించుకోలేదు. మా ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ వేసి ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసింది. గురుకులాల్లో పోస్టింగులు ఇచ్చింది. గత ప్రభుత్వం నాలుగేళ్లుగా అద్దె భవనాలకు అద్దెలు చెల్లించలేదు. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వివరాలు తెప్పించుకుని అద్దె సమస్యలు పరిష్కరించి, ఆయా భవనాల్లో మౌలిక సదుపాయాలు కల్పించేలా చర్యలు తీసుకున్నాం’’ అని మంత్రి పొన్నం తెలిపారు. ఈ ప్రభుత్వం తీసుకునే చర్యలతో గురుకుల విద్యావ్యవస్థ మరింత ఉన్నతస్థాయికి వెళ్లనుందని సీఎస్ శాంతికుమారి అన్నారు. సమీకృత గురుకుల నమూనా చూస్తుంటే అమెరికాలో ఎంబీఏ చదువుకున్న రోజులు గుర్తుకు వస్తున్నాయన్నారు.