ఏమైంది ఉపాధ్యాయుడా
చిన్నబోయి కూర్చున్నావు ?
______________________________
జోగు అంజయ్య
ఉపాధ్యాయ కవి మిత్రుడు.
______________________________
మొన్న317 G.O తరిమింది
నిన్నటి నుండి తొలిమెట్టు తొందర పెడుతుంది
నేడు ఉన్నతి ఉరుముతుంది
రేపు ఏమవుతుందోనని
దిగులుగా ఉన్నావా?
పిడుగులే వేస్తుందో
పీకలే నొక్కుతుందోనని..
ఫికర్ పడుచున్నావా?
నిజమే. ఈ మధ్య ఉపాధ్యాయుడు
పరేశానుగా ఉన్నాడు.వత్తిడిలో ఉన్నాడు.తన బోధనకు అగ్నిపరీక్ష
పెడుతారట.సీక్రెట్ యాపులతో మనుషులు వచ్చి మనసుకు మంట పెడుతారంట
బీపీ పెరుగుతుందో... షుగర్ సూర్యుడిని తాకుతుందోనని
ఆందోళన పడుచున్నాడు
తను నలభై యేండ్ల గతంలోకి పోయాడు.ఆరోజుల్లో టీచర్లు
ప్రశాంతవదనంతో ఉండేవారు
పిల్లలు నిశబ్దంగా ఉండేవారు
ఉన్ముకీకరణ చేసేది
పాఠంలో దించేది
పుస్తకం చిన్నగుండేది
సంస్కారం పెద్దగుండేది
బేధాలు తేల్చేది
కారణాలను కాంచేది
జవాబుల జడుసుపోగొట్టి
ఇంటిదగ్గర ఇగురం నేర్పేది
వర్తమానం చెప్పేది
భూత కాలం విప్పేది
భవిష్యత్తును తెరిచేది
ఇప్పటి కంటే ఎక్కువే చెప్పేది
ప్రజలకు ప్రభుత్వ బడి అంటే ప్రాణం
ఉండేది
మాష్టారికి గౌరవం ఇచ్చేది
కానీ ఇప్పుడు రికార్డెడ్ వీడియోలు చూపెట్టి
మీరు ఇట్లా చెప్పాలే
మీరు అట్లా చెప్పాలే అంటూ
ప్రైవేటోన్ని సంకన జేరి పంతుళ్లు మారాలే మారు వేషం కట్టాలే అంటున్నారు
తను చెప్పే చదువుకు వంకబెడుతు
వంకర టింకర స్టెప్పులు వేయిస్తున్నారు
చెప్పేదంతా రాయాలంట
రాసేదంతా చెప్పాలంట
అందుకే ఇప్పుడు రందీ పడు చున్నాడు
ఇంట్లోఇంటి పనుల మోత
బడిలో బోధనల నివేదికల మోత
ఎవరికి చెప్పుకోవాలో తెలువక
తెల్లారు జాముదాక మానిటరింగ్ టీముల గురుంచి కలవరిస్తున్నాడు
గంటకొక మెసేజ్ పంపుతూ
గవర్నమెంటు చదువును గంగలో కలుపుచున్నారు
సైకాలజిస్టులు చెబుతున్నది ఒకటి
ప్రభుత్వాలు చేస్తున్నవి మరొకటి
వైయక్తిక బేధాలు ఉంటవి కావున
చదువు అందరికీ ఒక్క తీరుగా రాదని
వందల యేండ్ల సాక్ష్యం ఉంది
ఆడుతూ నేర్చుకుంటారు
ఎదుగుతూ నేర్చుకుంటారు
కానీ వత్తిడి మాత్రం పెంచొద్దని
మాష్టార్లకు తెలుసు
అందుకే అపెప్ డి పెప్ క్లాప్స్ క్లిప్స్ పేర్లతో ఎన్ని వచ్చినా టీచర్ చెప్పేదే పైనల్
తన కళ్ళ ముందున్న విద్యార్థిని
కనిపెడుతూ పాఠం చెబుతాడు
అవసరం ఉన్నప్పుడు టిఎల్ యం
వాడుతాడు.ముచ్చట్లు చెబుతూ అన్నిటినీ దర్శింప జేస్తాడు.
అంతే గానీ యాభై మంది పిల్లలుంటే
యాభై తీర్లుగా పాఠం చెప్పటం సాధ్యం కాదు.
ఇప్పుడున్న పాఠ్య పుస్తకాలు సమగ్రంగానే ఉన్నవి.మంచిగానే ఉన్నవి
నెల వారీగా యూనిట్లు ఉన్నవి.
పీరియడ్స్ విభజన కూడా ఉంది
సిలబస్ రిజిస్టర్ లో పెద్దసారు సంతకం తీసుకుంటూనే ఉంటారు
ఇంకేమి అయింది మరి
ఉన్నదల్లా ఆత్రమే
సిలబస్ కాడ ఆత్రమే
రిపోర్టుల కాడ ఆత్రమే
రాసుడు ఎక్కువాయే
సదువు చెప్పుడు తక్కువాయే
చివరికి ఫలితం గుండు సున్న
కంప్యూటర్ల కాలం వచ్చి కష్టం పెరిగింది తప్ప ఏమీ తగ్గలేదు
అప్పటి కప్పుడే రిపోర్టులు కావాలి
కూర్చున్నోల్లు ఎందరు
నిలబడ్డో ళ్లు ఎందరు
తిన్నవాళ్లు ఎందరు
తినని వాళ్ళు ఎందరు
పెద్దసారుకు పరేశాను
చిన్నసారుకు చికాకులు
రోజూ ఇదే కథ.
గవర్నమెంటు బడిలో చేరిన పిల్లవాడికి గంటసేపట్లోనే అర్థం అయితది అక్కడ జరిగేది ఏమిటో
జూన్ వచ్చిందంటే చాలు తిరుగుడు వారం పండుగలు మొద లైతవి
పిల్లలందరూ బడిలో
సార్లేమో బయట బాటలో ...
జూలై వచ్చేదాంక జట్లవారిగా తిరుగుతూ జుట్ల లెక్క చెప్పాలే
చేరేది తక్కువ చె రిగేది ఎక్కువ
గుడికిపోయే అలవాటు ఉంటే గుడికి పోతారు
బడి ఈడు వయసు వస్తే బడికి పంపుతారు
ఎనకటి కాలమా ఇది ఏమీ నేర్పకుంట ఉట్టిగనే ఉంచటానికి
ఎదురుంగనే ఉండబట్టే రంగురంగుల బడులు
రెండు తీర్ల బడి ఉంటే రెండింట్లో
చేరుతారు మూడు తీర్ల బడి ఉంటే మూడింటిలో చేరుతారు
మాసిపోయిన తీరుగా ఉంటే వెనుక లైను కడుతారు
ఒక్కతీర్గ బడి ఉంటే అందరూ ఒక్క దాంట్లోనే ఉంటారు
గీ లాజిక్ తెలువనట్లు నటిస్తూ
సార్లు పాఠాలు చెబుతలేరు అందుకే
ప్రైవేట్ కు పిల్లలు పోతున్నారని
డబ్బా ప్రచారం ఒకటి నేర్చుకున్నారు
ఒక్క తీరు బడి పెట్టు ఉన్నోని పిల్లలు
లేనోని పిల్లలు సార్ల పిల్లలు అందరూ అక్కడి కే వస్తారు
అమెరికా లాంటి దేశంలో సెకండరీ స్థాయి వరకు అందరూ ఒక దగ్గరే చదువుతారంట
ప్రభుత్వమే బాధ్యత తీసుకుంది అని
అక్కడికి పోయివచ్చిన వాళ్ళను అడిగితే చెబుతున్నారు
మరి ఇక్కడ చూడు ఎన్ని వేశాలో
కులానికి ఒక బడి
మతానికి ఒక బడి
కొంచెం డబ్బులు ఉంటే చాలు ప్రైవేటు పైత్యం పెరిగిపోతది
సమైక్యత చెప్పరు సంతోషం నేర్పరు
ఇగ కోతుల బెడద లాగే బేసులైన్ల గొడవ ఒకటి
టెస్టుల మీద టెస్టులు పెట్టి తెలివికల్లోడు ఏ గ్రేడ్ అని
తక్కువ వచ్చినవాడు బి అని
ఇంకా తకువ వస్తె సి అని వేరు చేసి
సామర్థ్యాల సాధనకు చిందులు వేస్తూ చెప్పాలట
సాధ్యమేనా ఇది
టీచర్ ను అడిగితే రాసిస్తాడు
ఏ పిల్ల వాడు ఎలా చదువుతాడు
ఎవరు తట్టుకుంటూ చదువుతరో..
కానీ ఇప్పుడు కొత్తొక వింత
పాతొక రోగం
పరీక్షల వత్తిడి పెంచి పిల్లలు వణికి పోయేటట్లు చేస్తున్నారు
ఏదో సోపతి గాళ్ళతోని కొద్దిగ నన్న నేర్చుకుంటడు అని తల్లి తండ్రులు బడికి పంపితే బడి అంటే భయపడేలా అయింది వ్యవహారం
పాఠశాలకు పోయి
చక్కగ పాఠాలు చెబుదాము అనుకుంటే టీచర్ల కాళ్ళు చేతులు కట్టేసినట్లు చేస్తున్నారు.
సారే సతోషంగా లేకపోతే పిల్లలకు చదువు యెట్ల చెబుతడు
బడిలో జరిగే గమ్మత్తులు ఇంకా చాలానే ఉంటవి
బువ్వ పెట్టే పని కాడ ఒకరు చూడాలి
పుస్తకాల కోసం పాటికి పది సార్లు ఒకరు ఇద్దరు తిరగాలి
ఎస్సే రాసే వాళ్లకు ఎస్కార్ట్ గా కొందరు పోవాలి
డాన్సులు గీన్సులు డ్రాయింగు పోటీలు ఇంకా యాపులు మ్యాపులు
ఒకటేమిటి ఎన్నో ఎన్నెన్నో...
టీచర్ల కొరత కొత్తరకం సమస్య
పేరుకే పది పోస్టులు
ఉండే వాళ్ళు సగం
రోజుకు ఆరు పీరియడ్స్ తక్కువ కాకుండా తరగతుల తండ్లాట
ఒకప్పుడు బడికి సెలవంటే పిల్లలు ఎగిరి గంతులు వేసే వారు
ఇప్పుడు సీన్ రివర్స్ అయింది
క్యాలెండర్ కళ్ళ ముందు పెట్టుకొని
ఈరోజు మా బడికి సెలవన్న ఇప్పించుండ్రి లేదా మానిటరింగ్ టీములు మా బడికి రాకుండా చూడండి స్వామి అని ఏడుకొండల వైపు మొక్కుచున్నారు
మొదలు పెట్టేటప్పుడు సపోర్టింగ్ టీములు అంటారుగానీ తర్వాత తర్వాత వాతలు పెట్టే తీరు ఉన్నతి లో కనబడుతూనే ఉంది.జర సొయాంచితే సినిమా కనిపిస్తది
పాఠం చెప్పుటకు షరతులు వర్తిస్తాయని చెప్పకనే చెబుచున్నారు
ఎందుకొచ్చిన గోల అంటూ
యాభై దాటిన వాళ్ళు వాలంటరీ రిటైర్మెంట్ స్కీము పెడితే వెంటనే రాసిస్తా అని చెవులు కొరుకుచున్నారు
ఊరిలో ఉన్న ఎకరం జాగల కూరగాయల పంటో ఫలమో పండించుకొని హాయిగా ఉంటా అని
మాష్టారు కోరుకుంటున్న విషయం
వ్యవస్థలోని అవస్థలపై తన మనసులో మందుపాతరలు పేలుచున్నాయని అర్టం అవుతుంది
టీచర్ కొలువుకు రా బిడ్డా మంచిగుంటదని అని మన పిల్లలనే అడిగితే చేతులెత్తి దండం పెడుతూ
నేను రాను తండ్రో నాకు వద్దు నాన్నో
అంటూ దూరం జరుగుచున్నారు
ఉపాధ్యాయ రంగంలోకి ప్రతిభావంతులైన యువత రాకపోతే
భవిష్యత్తు తరాలు తీవ్రంగా నష్టపోతరని గుర్తించే వారు లేరైరి
ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. టీచర్లు మరియు సంఘాలు దృష్టి పెట్టాలి
మంచి చెడులను బేరీజు వేయాలి
ఇంట్లో ఎలుకలున్నాయని ఇల్లును తగల బెట్టే పనులు చేయవద్దని చెప్పాలి. టీచర్ ను భయపెట్టి ఏదో
సాధిస్తామనే భ్రమలు తొలగాలి
బోధన సమయంలో బడిలో ఆకర్షణీయమైన వాతావరణంతో పాటు టీచర్ మదిలో ప్రశాంతత నెలకొనాలి. తన నెవరో వెంటాడుచున్నారు అన్నట్లు ఉండకూడదు
వినేవాడి ముందు చెప్పేవాడు లోకువ అన్న నానుడి మరువకూడదు
రాండ్రి ప్యానల్ ఇన్స్పెక్షన్ కు రండి
ఎవరూ వద్దు అనడం లేదు
సంవత్సరానికి ఒక సారో రెండు సార్లో
అంతేగానీ దినాముకు రెండు సార్లు వస్తం టీముల మీద టీములు వేస్తం
ముచ్చెముటలు పట్టిస్తం నీడలా వెంటాడుతం అని అనకండి
ఉపాధ్యా యుడిలో ఒత్తిడి పెరిగితే
సామర్థ్యాల స్థాయి తగ్గుతుంది
సహజత్వం లోపించి కృత్రిమత్వం పెరుగుతుంది అది విద్యార్థికి నష్టం చేస్తుంది
నవ్వించలేడు మెప్పించలేడు
ఇప్పుడు ఉపాధ్యాయుడు నిరాయుధుడు
బెత్తం చేతిలో లేదు
ఎవరినీ బెదిరించడు ఎవరినీ అదిరించడు పైగా విద్యార్థి మనసులోనే తయారైంది అటపట్టించుడు
పక్కవాడి చేయి తగిలినా సారు నన్ను వీడు కొడుచుండు చూడు అనే కంప్లెయింట్
వెనుక వాని చేయి తగిలినా సారు వీడు నన్ను పెన్నుతో గిచ్చుతిండు అనే కంప్లెయింట్
వాడి ఉద్దేశ్యం క్లాస్ సైలెన్స్ ఉంచుడు కాదు అది వాడికొక ఆటవిడుపు
టీచర్ సహనాన్ని పరీక్షించే కొత్త ఆట
చదువుపై శ్రద్ధ ఉన్న పిల్లవాడు కడిగిన ముత్యంలా ఉంటే
శ్రద్ధ లేని ఆసక్తి లేని పిల్లవాడిది
అందరినీ అశాంతిగా ఉంచే నైజం
ఇగ చదువు రమ్మంటే ఎట్లా వస్తది
కొడితే కొట్లాట మందలిస్తే మంకు ఆట
మన కెందుకు ఈ గొడవలు అని మాష్టార్లు అనుకోవాలి
పరిస్థితులు అలా ఉన్నప్పుడు
చదువు వచ్చినోనికి వస్తది
రానోనికి రాదు .బంగారం ఇచ్చినా భాహుముఖ ప్రజ్ఞాశాలి చెప్పినా రాదు
మారిపోయింది కాలం
పెరిగిపోతుంది జాడ్యం
సారే చదువు చెప్పుకోవాలి గోడలకు
సారే రాసుకోవాలి పరీక్షలు రిపోర్ట్ కోసం
విద్యార్థులు మార్కుల కోసం కష్టపడుడు తగ్గింది
కాపీలు పెట్టినంక కాపీ కొట్టుడు ఎక్కువైంది
పేపర్ల మీద పరీక్షలు ఉన్నప్పుడు
పకడ్బందీగా ఉండేది దిద్దుడు ఈజీగా ఉండేది
పరీక్షలకు ఒక డేట్ ఉండేది
రాసిన వాళ్లకు మార్కులు
రాయని వాళ్లకు ఆబ్సెంట్ వేసేది
ఇప్పుడు టీచర్లకు స్వేచ్చ ఎక్కడిది?
హాజరు ఉంటే చాలు అందలం ఎక్కించాలి పేరుంటే చాలు పెద్ద తరగతికి పంపాలి
ప్రమాణాలు పెరిగినాయి అని పచ్చి అబద్ధాలు చెప్పాలి
చతుర్విధ ప్రక్రియల పేరుతో
చాంతాడంత చాదస్తం కనబరుస్తున్నారు
చివరి పీరియడ్ లు కేటాయించి
అందరు ఉపాధ్యాయులు నిరంతరంగా ప్రయత్నం చేస్తే
చదివినవి
గుర్తుండి పోయేలా కొంత కాలం
బట్టీ పట్టిస్తే అన్నీ గుర్తుంచుకొన్న తీరు మన చిన్నతనం రుజువు చేసింది.
ఇప్పటికీ ఏమీ మించుకపోలేదు
ఉపాధ్యాయులు కలవాలి
మాట్లాడుకోవాలి
సంఘ చైతన్యంతో మెలగాలి
రాష్ట్ర శాఖలు పోయి ఆఫీసర్ల ముందు వినిపించాలి
కొత్త ప్రభుత్వానికి చెప్పాలి
ప్రజాస్వామ్యంలో ముందు చేయాల్సింది లిఖితపూర్వక అభ్యర్థన
దానికి స్పందన లేకపోతే
పోరాట రూపాలు. ఉండనే ఉంటవి కదా
గిలాంటప్పుడే సంఘాలు aబాధ్యులు పెద్దరికం చూపాలి
ఐక్యవేదిక ద్వారా ముక్త కంఠంతో ఖండించాలి
మార్పు తీసుకురావాలి
టీచర్లు పడుచున్న మనోవేదనకు
ముగింపు పలకాలి
మన శరీరానికి కుడిచేయి ఎడమ చేయి ఎంత అవసరమో
రైటిస్ట్ సంఘాలు లెఫ్టిస్ట్ సంఘాలు కూడా అంతే అవసరం
ఆయన పిలిస్తే నేను రాను
నివ్వు పిలిస్తే మేము రాము అనకండి
ఉమ్మడి సమస్యలపై భేషజాలు వదిలి
మెరుగైన దీటైన పోరాటం చేయాలి
తొలిమెట్టు కాడ తొందర పెట్టొద్దని
ఉన్నతి తెచ్చి టీచర్ల మతి పోగొట్టద్దని
317 తిప్పలు తప్పించాలని చెబుదాం
జోగు అంజయ్య
ఉపాధ్యాయ కవి మిత్రులు
వరంగల్. (జనగామ)
______________________________
(నచ్చితే మీ మీ సంఘ గ్రూప్ లలో షేర్ చేయండి. నేను రాసిన దాంట్లో అవాస్తవాలు ఉంటే poem ను ఉపసంవరించుకుంటాను.)
____________________________