నూరు - నూరు - నూట ఇరవై అయిదు .
...... సింపుల్ గా చెప్పాలంటే అదీ లెక్క !
సీబీఎస్సీ పాఠశాలంటే ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల్లో క్రేజ్ బాగా పెరిగింది .
పదేళ్ల క్రితం ఐఐటీ ఫౌండేషన్ కోసం చూసిన తల్లితండ్రులు ఇప్పుడు సిబిఎస్సీ పాఠశాలల వైపు చూస్తున్నారు .
ఎస్సెసీ అంటే రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన పాఠశాలలు . సిబిఎస్సీ , ఐసీఎస్సీ కేంద్ర బోర్డు లు గుర్తించిన సంస్థలు .
సిలబస్ పరంగా చూస్తే ...
రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఇంచు మించు అన్ని ప్రైవేట్ ఇంగ్లీష్ మీడియం ఎస్సెసీ పాఠశాలలు ఐదో తరగతి దాకా సిబిఎస్సీ పుస్తకాలనే ఫాలో అవుతున్నాయి . కాబట్టి సిలబస్ పరంగా ఎస్సెస్సీ- సీబీఎస్ పాటశాలలకు ఐదో తరగతి దాకా ఏమీ తేడా ఉండదు .
ఎందుకు ?
రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలలు ఐదో తరగతి దాక సిబిఎస్సీ పుస్తకాలను ఫాలో చేయడం ఎందుకు ?
రాష్ట్ర ప్రభుత్వం లెక్కలో { ఇటీవల మార్పులు వస్తున్నాయి . కానీ ఇప్పటిదాకా } పిల్లల చదువు ఒకటో తరగతి తో ప్రారంభం . కాబట్టి ఒకటో తరగతి పుస్తకాలు ఏ బి సి డి లతో ప్రారంభం . కానీ ప్రైవేట్ బడులు నర్సరీ లేదా ఎల్కేజీ తో ప్రారంభం . అంటే ఒకటో తరగతి కి వచ్చేటప్పటికి విద్యార్ధి వాక్యాలు రాయగలిగే స్థితికి చేరుకొంటారు . అందుకే అనేక ఏళ్లుగా ప్రైవేట్ బడులన్నీ ఐదో తరగతి వరకు సిబిఎస్సీ పుస్తకాలనే ఫాలో అవుతున్నాయి .
అంటే సిలబస్ పరంగా తేడా అంటూ ఉంటే అది ఆరు నుంచి పది దాకే.
అదేంటో చూద్దాము .
కాస్త ఓపిక చేసుకొని ఆరు నుంచి పది దాక ఉన్న స్టేట్ { అంటే ఎస్సెసీ } సీబీఎస్సీ టెక్స్ట్ పుస్తకాలను మీరు చెక్ చేస్తే మీకు ఒక విషయం అర్థమయిపోతుంది . సైన్స్ , మాథ్స్, సోషల్ పుస్తకాలు సిబిఎస్సీ స్టేట్ రెండూ ఒక్కటే . సీబీఎస్సీ పుస్తకాలను తెలుగు లో రాసి, తిరిగి ఇంగ్లీష్ లో అనువాదం చేస్తే వచ్చిందే , స్టేట్ బోర్డు ఇంగ్లీష్ మీడియం టెక్స్ట్ పుస్తకాలు .
ఇంకా లోతుగా పరిశీలిస్తే స్టేట్ మాథ్స్ పుస్తకం ఇంకొంచం లోతుగా, మెరుగ్గా ఉంటుంది . స్టేట్ సోషల్ పుస్తకాల్లో రాష్ట్ర చరిత్ర , రాష్ట్ర స్థానిక భౌగోళిక అంశాలు అదనంగా ఉంటాయి . సైన్స్ మాత్రం డిట్టో
మరి సీబీఎస్సీ పాటశాలలకు ఎందుకంత క్రేజ్ ?
సిలబస్ పరంగా చూస్తే రెండూ ఒక్కటే ..లేదా కచ్చితంగా చెప్పాలంటే స్టేట్ పుస్తకాలే కాస్త బెటర్ . కానీ వసతుల విషయానికి వస్తే సిబిఎస్సీ పాటశాలలు బెటర్ . సిబిఎస్సీ బోర్డు గుర్తింపు పొందాలంటే కనీసం రెండెకరాల స్థలం లో పాఠశాల ఉండాలి . అంటే పాటశాలలోనే ప్లే గ్రౌండ్ ఉంటుంది . అనేక స్టేట్ గుర్తింపు పొందిన ప్రైవేట్ పాటశాలలు ప్లే గ్రౌండ్ లేకుండా బడిని నడుపుతున్న మాట వాస్తవం . సిబిఎస్సీ పాఠశాలల్లో ఫీజు , స్టేట్ గుర్తింపు పొందిన పాఠశాలలతో పోలిస్తే ఫీజు రెండు నుంచి పది రెట్లు ఉంటుంది . దీనితో టీచర్ ల కు ఎక్కువ జీతం ఇచ్చి మంచి టీచర్ ల ను నియమించుకునే వీలు కలుగుతుంది . తరగతి గదులు ఇతరత్రా సౌకర్యాలు సిబిఎస్సీ పాటశాలలో మెరుగా ఉంటాయి .
పిండి కొద్దీ రొట్టె . అంతే .
సిలబస్ పరంగా ఏమీ తేడా ఉండదు . పాఠాల్ని బోధించే విధానం, అంటే టీచింగ్ మెథడాలజీ విషయం లో సిబిఎస్సీ పాటశాలలు మెరుగు. అంటే ఎక్కువ ఉదహారణలు తో పిల్లలకు అర్థం అయ్యేలా బోధిస్తాయి.
పేరుకు రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు పొందినా, సిబిఎస్సీ ని దాటి పిల్లలకు ఆట వసతులు కల్పించే స్టేట్ బోర్డు పాటశాలలు కూడా వున్నాయి . అలాగే పిల్లలందరికీ అర్థం అయ్యేలా పాఠాన్ని కాన్సెప్ట్ బేస్డ్ గా బోధించే, స్టేట్ బోర్డు పాటశాలలు కూడా ఉన్నాయి. కాకపోతే వాటి సంఖ్య తక్కువ .
వెరసి కలిసి చెప్పలంటే ఒక సగటు స్టేట్ బోర్డు పాటశాలకంటే సగటు సిబిఎస్సీ పాటశాల మెరుగు . { సిలబస్ విషయం లో రేండూ ఒకటే అయినప్పటికీ } . అదే సమయం లో గొప్ప పేరున్న సిబిఎస్సీ పాటశాలల తలదన్నే విధంగా పాఠాలు బోధించే పిల్లల అల్ రౌండ్ డెవలప్మెంట్ కోసం కృషి చేసే స్టేట్ బోర్డు పాటశాలలు ఉన్నాయి . ఇందాకే చెప్పినట్టు వాటి సంఖ్య తక్కువ . వెతుక్కోవాలి .
ఇక ఐసీఎస్సీ పాటశాలల విషయానికి వద్దాము . ఐదో తరగతి వరకు ఈ బోర్డు పుస్తకాలు కాస్త అనవసరంగా ఎక్కువ గా ఉన్నాయి . జికె లాంటి అనవసర విషయాలు వీటిలో ఉన్నాయి . అలాగే ఒకటో తరగతిలోనే సోషల్ వేరు సైన్స్ వేరు అని విడగొట్టడం సరి కాదు . న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం ఒకటి రెండు తరగతుల్లో భాష బోధన అంటే ఇంగ్లీష్ , తెలుగు హిందీ ల పై దృష్టి ఉండాలి . EVS అనే సబ్జెక్టు మూడో తరగతి నుంచి ప్రారంభం అయితే చాలు . ఈ సరి కొత్త విధానాన్ని ఇంకా ఐసీఎస్సీ అందిపుచ్చుకోకపోవడం లోపం . బహుశా రానున్న సంవత్సరాల్లో ఈ లోపాన్ని సరి దిద్దుకోవచ్చు .
ఇక ఆరు నుంచి ఉన్న హై స్కూల్ ఐసిఎస్సీ పుస్తకాలు , సిబిఎస్సీ స్టేట్ కన్నా మెరుగు . ఎక్కువ సమాచారం వుంది . సబ్జెక్టు పై బాగా పట్టు వచ్చేలా చేస్తుంది . అదే సమయం లో సిలబస్ భారం దృష్ట్యా ఇది అబోవ్ అవేరేజ్ పిల్లలకే సూట్ అవుతుంది . నూరు- నూరు- నూట ఇరవై అయిదు అని ఈ మెసేజ్ ప్రారంభం లోనే రాసాను .
అంటే ఐసిఎస్సీ సిలబస్ భారం ఎక్కువ . పిల్లలు ఎక్కువ కష్ట పడి చదవాలి . చాల సార్లు స్కూల్ లో మొత్తం సిలబస్ పూర్తి చేయడం తలకు మించి భారమవుతుంది. అందుకే చాలా మాటకు ICSE పాటశాలలో ఈ సిలబస్ ను పైపైగానే బోధిస్తారు . హైదరాబాద్ లాంటి నగరాల్లో చూస్తే ప్రముఖ ఐసిఎస్సీ బడుల్లో చదివే పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన వెంటనే, మరో మూడు- నాలుగు గంటలు ట్యూషన్ కు వెళుతారు . కారణం... బడిలో ఇంత సిలబస్ కవర్ చేసే స్కూల్స్ తక్కువగా ఉండడం .
అదే సమయం లో నీట్, ఐఐటీ - జేఈఈ లాంటి అల్ ఇండియా పరీక్షలకు ఐసిఎస్సీ సిలబస్ అన్నిటికంటే బెస్ట్
ఐబీ వరల్డ్ స్కూల్స్ సంగతి ?
కనీసం వంద కోట్లు ఖర్చుతో పాటశాల భవనం ఉంటుంది . సెవెన్ స్టార్ హోటల్ కు వెళ్లిన ఫీలింగ్ వస్తుంది . ఎంతైనా సరే మన పిల్లల్ని ఇక్కడే చదివించాలనే ఫీలింగ్ లోకి చాలా మంది తల్లితండ్రులు వెళ్లి పోతారు . తమ పిల్లలు కార్పొరేట్ బడిలో ఐఐటీ ఫౌండేషన్ చేస్తున్నారు అని చెప్పుకోవడానికి పదేళ్ల క్రితం పేరెంట్స్ గొప్పగా అంటే తమ స్టేటస్ సింబల్ గా భావించే వారు .
ఇప్పుడు లక్ష లక్షన్నర దాక ఫీజు చెల్లించే అవకాశమున్న తల్లితండ్రులు సీబీఎస్సీ బడికోసం .. అయిదు లక్షలు పది లక్షలు .. ఎంత ఫీజు ఎక్కువుంటే అంత స్టేటస్ సింబల్ అని భవించే అపర కోటీశ్వరులు ఐబి వరల్డ్ స్కూల్ కోసం చూస్తున్నారు .
కేవలం ఫీలింగ్ మాత్రమేనా ?
మొన్న వియవాడ నుంచి హైదరాబాద్ వస్తుంటే ఆరేళ్ళ అబ్బాయి ఒక్కడే విమానం ఎక్కాడు . నా పక్క సీట్ { ఆలా పిల్లల్ని ఒంటరిగా ఎయిర్ లైన్స్ సాయం తో విమానం ఎక్కించొచ్చు . ప్రతి విమాన సంస్థ ఆ భాద్యత తీసుకొంటుంది } . ఎయిర్ హోస్టెస్ "సర్ .. అబ్బాయి ని కాస్త చూసుకోండి "అని అన్ను అడిగింది . ఏ క్లాస్ అంటే ఫస్ట్ గ్రేడ్ అన్నాడు . అంటే ఒకటో తరగతి . అతని ఇంగ్లీష్ చూసి నేను అమెరికా లో పుట్టిన పిల్లాడు అనుకొన్నా. అమెరికా లో ఎక్కడ అంటే" లేదు హైదరాబాద్ "అని స్కూల్ పేరు చెప్పాడు . ఆ స్కూల్ లో ఫీజు పది లకరాల పైనే . బిస్కెట్ తీసుకొన్నాడు . దాన్ని కోక్ లో ముంచి తింటున్నాడు . అమ్మ నాన్న కోట్లు సంపాదించే దాకా ఇలాంటి పిల్లల జీవితాలు బాగానే ఉంటాయి . కాస్త కష్ట కాలం వస్తే?.... పాపం .. గాల్లోనే ఎగిరే ఇలాంటి పిల్లలు భూమి పైకి దిగగలరా ? సమాజం లో మమేకం కాగలరా? అమ్మ నాన్న సంపద పిలల్లకు కు ఎంత చేటు తెస్తోంది? అని విమానం దిగే దాకా నా ఆలోచనలు సాగాయి . పాపం పసివాడు .
ఐబి వరల్డ్ స్కూల్స్ లో క్రిటికల్ థింకింగ్ , లాజికల్ రీసోనింగ్ , అల్ రౌండ్ డెవలప్మెంట్ , మల్టీ లింగ్వల్ అప్రోచ్ ఉంటుంది . ఇంత కంటే పది రెట్లు ఈ విధానాన్ని అమలు చేసే స్టేట్ బోర్డు పాఠశాలలు కొన్ని ఉన్నాయి. హైదరాబాద్ లో విద్యారణ్య, ఉస్మానియా దగ్గర ల్యాబ్ స్కూల్.... ఇలా అక్కడక్కడా ఇరవై ఏళ్ళ క్రితమే ఇలాంటి మెథడాలజీ ని ఫాలో అయ్యి ప్రపంచ స్థాయి బోధనా చేసే స్కూల్స్ ఉన్నాయి .
ఒక జనరిక్ డ్రగ్ . ఒక మాత్ర ఇరవై రూపాయిలు . అదే మాత్ర దేశీ కంపెనీ బాగా ఆకర్షణీయంగా వుండే ప్యాక్ లో నూరు రూపాయలకు అమ్ముతుంది . అదే మాత్ర ఒక విదేశీ కంపెనీ వెయ్యి కి అమ్ముతుంది . సరుకు అదే. సోకు లు వేరు వేరు . వెయ్యి రూపాయిలు ఖర్చు బెడితేనే తుత్తి కొందరికి . అది అంతే .
ఏది మంచి బడి ఏది మంచిది కాదు అని తెలుసుకోవాలంటే కేవలం పైన ఉన్న లేబల్స్ కాదు . లోపల సరుకును చూడాలి .
ఈ పోస్ట్ ను అందరితో పంచుకోండి .