TSPSC Group-2 exam postponed to November : తెలంగాణలో టీఎస్‌పీఎస్సీ(TSPSC) నిర్వహించే గ్రూప్-2 పరీక్షలు నవంబర్‌కు వాయిదా పడ్డాయి. ఈ నెల 29, 30 తేదీల్లో జరగాల్సిన పరీక్షలను వాయిదా వేయాలని కొద్ది రోజులుగా అభ్యర్థులు ఆందోళనలు చేపట్టారు. దీంతో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్, కార్యదర్శితో చర్చించిన సీఎస్ శాంతికుమారి.. నవంబర్‌కు గ్రూప్-2(Telangana Group 2) పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అన్ని అంశాలపై సమగ్రంగా చర్చించి గ్రూప్-2 వాయిదాపై నిర్ణయం అధికారులు నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే కొత్త పరీక్ష తేదీల షెడ్యూల్‌ను టీఎస్‌పీఎస్సీ విడుదల చేయనుంది.
గ్రూప్ 2 వాయిదా వేయాలని సీఎం కేసీఆర్ ఆదేశం : గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. టీఎస్‌పీఎస్సీని సంప్రదించి గ్రూప్ 2 రీషెడ్యూల్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని ఆదేశించారు. లక్షలాది మంది అభ్యర్ధులకు ఇబ్బంది కలగకుండా చూడాలన్నారు. భవిష్యత్తులో కూడా నియామక ప్రకటనల జారీలో ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని సీఎం కేసీఆర్ సీఎస్‌కు సూచించినట్లు మంత్రి కేటీఆర్ ట్విటర్లో వెల్లడించారు.
ప్రతి అభ్యర్ధి అర్హత ఉన్న అన్నీ పరీక్షలు రాసే విధంగా తగిన సమయం ఉండాలని సీఎం చెప్పినట్లు కేటీఆర్ తెలిపారు. గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేయాలని కొద్ది రోజులుగా అభ్యర్ధులు ఆందోళన కొనసాగిస్తున్నారు. వారికి వివిధ రాజకీయ పార్టీలు, విద్యార్ధి సంఘాలు మద్దతు తెలిపాయి. ఈ నెల 29, 30 తేదీల్లో గ్రూప్ 2 పరీక్షలు జరగాల్సి ఉంది. అయితే దీనిపై సోమవారం హైకోర్టులో కూడా విచారణ జరగనుంది.
గ్రూప్-2 పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ.. గురువారం అభ్యర్థులు భారీ ఎత్తున ఆందోళన నిర్వహించారు. టీఎస్‌పీఎస్సీ కార్యాలయం (TSPSC Office) ముందు భారీ ధర్నా నిర్వహించారు. ఓ దశలో కార్యాలయ ముట్టడికి అభ్యర్థులు యత్నించారు. నాంపల్లిలోని టీజేఎస్ కార్యాలయం నుంచి సుమారు 2,000 మంది అభ్యర్థులు పెద్దఎత్తున ర్యాలీగా బయలుదేరి వచ్చారు. వీరికి టీజేఎస్ పార్టీ అధ్యక్షుడు కోదండరాం, కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్ వంటి నేతలు మద్దతు ప్రకటించారు. అయితే పోలీసులు వీరిని కార్యాలయం సమీపంలోకి రాగానే అడ్డుకున్నారు. అయినా కొందరు ఆభ్యర్థులు కార్యాలయం ముందు నిరసనకు దిగారు. కాసేపటి తరువాత పోలీసులు వారందరిని అదుపులోకి తీసుకున్నారు. గ్రూప్-2 పరీక్ష వాయిదా వేసేవరకు తమ పోరాటం కొనసాగుతుందని విద్యార్థిసంఘాల నేతలు ప్రకటించారు. అదేరోజు కొందరు అభ్యర్థులు హైకోర్టులో పరీక్ష వాయిదా కోరుతూ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై సోమవారం విచారణ జరగనుంది.