*🌸🌷పితృదినోత్సవం🌸🌷*
*ప్రతి సంవత్సరం జూన్ మూడో ఆదివారంనాడు ఫాదర్స్ డే (పితృదినోత్సవం) జరుపుకోవడం పాశ్చాత్యుల సంప్రదాయం. ఆ సంప్రదాయానుసారం జూన్ 17న (ఇవాళ) ఆ వేడుక జరుపుకొంటున్నారు. భారతీయ సనాతన ధర్మం దీన్ని వేడుకగా భావించదు. ధర్మంగా సంభావిస్తుంది. అందుకే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని సర్వదా స్మరించమంటుంది. ఆరాధించమంటుంది.*
*జన్మనిచ్చిన తొలిదైవం తల్లి, మలిదైవం తండ్రి. ఆయన- మనల్ని వేలుపట్టి నడిపించే వేలుపు. మన బరువును మోసే గురువు. తెరువు చూపే కల్పతరువు. దిశను, దశను బోధించే దేశికుడు. ఇంటి యజమాని తండ్రే. ఆయనే కుటుంబానికీ పెద్దదిక్కు. ‘ఆత్మావై పుత్రనామాసి’ అని వేదం చెబుతోంది. ఆత్మే పుత్రుడి రూపంలో తండ్రికి కనిపిస్తుంది. తండ్రే కొడుకుగా జన్మిస్తాడని, కొడుక్కి తండ్రి తనతండ్రి పేరు అందుకే పెడతాడని చెబుతారు. కొడుకు భవిష్యత్తు కోసం బాధల పరిష్వంగంలో, బాధ్యతల ముళ్లమధ్యలో జీవితం గడుపుతాడు నాన్న.*
*తండ్రి త్యాగయాగ సోమయాజి. హవిస్సు వల్ల లభించే ఫలితమంతా తన సంతతి సంపద కోసం ధారబోస్తాడు. ఎవరివల్ల ఈ భౌతిక శరీరం జన్మించిందో, అలాంటి భగవత్ స్వరూపుడు అయిన తండ్రికి వినయ విధేయతలు కనబరుస్తూ నమస్సులు సమర్పిస్తే సరిపోదు. శ్రవణ కుమారుడు వయోవృద్ధులైన తల్లిదండ్రుల చేత తీర్థయాత్రా సందర్శనం చేయించి, సేవించాడు.*
*తండ్రే దైవం’ అని వాల్మీకి రామాయణం చెబుతోంది. ‘పితృదేవోభవ’ అని ఉపనిషత్తు చెబుతోంది. క్రమశిక్షణ, సమయపాలన నేర్పి బిడ్డల బతుకును పర్యవేక్షించేవాడే తండ్రి. బిడ్డల సంస్కారానికైనా, కుసంస్కారానికైనా తండ్రే బాధ్యుడు. దుర్యోధనుడి దుష్టబుద్ధికి ధృతరాష్ట్రుడు నిస్సహాయుడైనా, పశ్చాత్తాపాగ్నిలో దహించుకు పోయినట్లు భారతం చెబుతోంది. రావణుడు, హిరణ్యకశిపుడు శివభక్తులైనా మంచి తండ్రులు కాలేకపోయారు.* *యుగయుగాలుగా వారికి ఆ మచ్చ అలాగే ఉండిపోయింది.ఏ దుష్టపుత్రుడి దుశ్చర్యలవల్ల తండ్రి మనోక్లేశాన్ని పొందుతాడో, వాడి పాపానికి ఏ జన్మలోనూ నిష్కృతి లభించదని దైవజ్ఞులు చెబుతున్నారు. అలాగే సుపుత్రుల పుత్రధర్మం వల్ల తండ్రులూ పుణ్యాత్ములవుతున్నారు.* *గణపతి, కుమారస్వామి తమ పితృభక్తి వల్ల పరమశివుడి కృపావాత్సల్యాలకు పాత్రులై ఆదర్శ పుత్రులనిపించుకున్నారు. పరశురాముడు తండ్రి జమదగ్ని ఆజ్ఞను శిరసా వహించి, తల్లి శిరస్సును ఖండించాడు. అందుకు మెచ్చి జమదగ్ని పుత్రుణ్ని వరం కోరుకొమ్మన్నాడు. పరశురాముడు తన తల్లిని బతికించమని కోరుకున్నాడు. తల్లిదండ్రుల్ని తన నయనాలుగా భావించి, సేవించిన పరశురాముడి జీవితం ప్రాతఃస్మరణీయమైనది. భీష్మాచార్యుడు శంతనుడి కోసం ఆజన్మ బ్రహ్మచర్యం స్వీకరించాడు. ద్రోణాచార్యుడు తన పుత్రుడు అశ్వత్థామను దీర్ఘాయుష్కుడిగా చేసి తన పుత్రవాత్సల్యం నిరూపించుకున్నాడు.*
*కన్నతండ్రి, అన్నదాత, భయం పోగొట్టేవాడు, గురువు, ఉపనయనం చేసినవాడు- ఈ అయిదుగురూ తండ్రులేనని శాస్త్రకథనం. వీరిని సేవించడమంటే నూరుయజ్ఞాలు చేసిపొందే ఫలాన్ని మించినంత పుణ్యమని మనుధర్మశాస్త్ర వచనం. జీవించి ఉండగా సేవించడమే కాక, గతించిన పితృదేవతలకు శ్రాద్ధ కర్మలు చేసి తర్పణాలు వదిలి వారి ఆత్మకు శాంతి కలగజేయాలని తైత్తిరీయోపనిషత్తు చెబుతోంది.*
*సమష్టి వ్యవస్థనుంచి, వ్యష్టికుటుంబ వ్యవస్థ దిశగా ప్రయాణిస్తున్న కుటుంబాల్లో తండ్రుల్ని చిన్నచూపు చూస్తూ, వృద్ధాశ్రమాలకు వారిని పంపే దుష్ట సంప్రదాయం ఇవాళ వేళ్లుతన్నుకోవడం ఎంతో శోచనీయం. కొడుకు నాన్న అయితేగాని, తండ్రి విలువ తెలియడంలేదు. పితృదేవుల వాత్సల్యానికి, అనురాగాభిమానాలకూ ఎవ్వరూ వెలకట్టలేరు. రుణమూ తీర్చుకోలేరు. ప్రతి పుత్రుడూ ప్రతి రోజూ తన తండ్రిని సేవించవలసిందేనన్న కనీస ధర్మాన్ని గుర్తుచేయడమే ఈ పితృదినోత్సవంలోని ఆంతర్యం!*