ఆశలు...ఆకాంక్షలు...వాస్తవాల నడుమ ఉక్కిరిబిక్కిరవుతున్న చిన్నారులు కఠిన నిర్ణయాలను తీసుకుంటున్నారు. ఒత్తిడికి గురై అర్ధంతరంగా జీవితాలను ముగిస్తూ కన్నవారికి కడుపుకోత మిగులుస్తున్నారు.
ఆశలు...ఆకాంక్షలు...వాస్తవాల నడుమ ఉక్కిరిబిక్కిరవుతున్న చిన్నారులు కఠిన నిర్ణయాలను తీసుకుంటున్నారు. ఒత్తిడికి గురై అర్ధంతరంగా జీవితాలను ముగిస్తూ కన్నవారికి కడుపుకోత మిగులుస్తున్నారు. ఇంటర్ ఫలితాల నేపథ్యంలో రాష్ట్రంలో పన్నెండుమంది విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. ఏటికేడాది ఇలా విద్యార్థుల ఆత్మహత్యలు పెరుగుతుండటం ఆందోళనకర పరిణామం. పోటీతత్వం, మెరుగైన ప్రతిభ చూపాలనే ఒత్తిడి, తల్లిదండ్రుల ఆకాంక్షలను నెరవేర్చలేకపోతున్నామనే ఆందోళన, భవిష్యత్తు లేదనే భయంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పరీక్షల్లో తప్పామని కొందరు.. మార్కులు తక్కువ వచ్చాయని ఇంకొందరు.. తక్కువ మార్కులు వస్తాయేమోనని మరికొందరు తనువుచాలిస్తున్నారు. పదోతరగతిలో మంచి మార్కులు వచ్చినా ఇంటర్‌లో అదేస్థాయిలో మార్కులు సాధించలేకపోతున్నామనే నిరాశతో కొందరు ఆత్మహత్యలు చేసుకుంటున్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు. దూరప్రాంతాల నుంచి పట్టణాలు, నగరాలకు చదువుల కోసమే వచ్చిన పిల్లలు తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ పూర్తి స్థాయిలో విద్యాసంస్థలకే పరిమితం అవుతుండటం కూడా ఒత్తిడికి కారణంగా పేర్కొంటున్నారు. ఆత్మహత్యకు పాల్పడటం అనేది అప్పటికప్పుడు హఠాత్తుగా తీసుకునే నిర్ణయం కాదని సైకాలజిస్టులు అంటున్నారు. గెలుపు, ఓటములను సమానంగా స్వీకరించేలా వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందించాలని సూచిస్తున్నారు.చదువు ఒక్కటే భవిష్యత్తుకు మార్గం కాదనే భావనను పిల్లల్లో పెంపొందించాలంటున్నారు.
మొక్కుబడిగా కౌన్సెలింగ్ వ్యవస్థ
ఆత్మహత్యలను నివారించడానికి, ఆ ఆలోచనల నుంచి పిల్లలను దూరం చేయడానికి కళాశాలల్లో కౌన్సెలింగ్ విధానాన్ని తీసుకువచ్చినా ఆచరణలో మొక్కుబడిగా మారింది. సమస్య ఉందని ఎవరైనా వస్తే తప్ప పట్టించుకోవడంలేదు. పిల్లల్లో మార్పులు, భిన్న ఆలోచనలు, నిరాశ, నిస్పృహ వంటి అంశాలను గుర్తించకపోవడంతో సమస్య తీవ్రత పెరుగుతోంది.
![Students Suicides: బతికి సాధిద్దాం బిడ్డా!](https://assets.eenadu.net/article_img/100523gh-main1b.jpg)
ఏటేటా పెరుగుతూ..
విద్యార్థుల ఆత్మహత్యలు ఏటా పెరుగుతున్నట్లు జాతీయ నేర రికార్డుల బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. దేశంలో భారీ సంఖ్యలో విద్యార్థుల ఆత్మహత్యలు కొనసాగుతుండగా రాష్ట్రంలో 2017-21 మధ్య రెండేళ్లు కాస్త తగ్గాయి. అయితే అత్యధికంగా 2021లో పిల్లలు ఆత్మహత్యలు చేసుకోవడం గమనార్హం. 2021లో రాష్ట్రంలో 10,171 మంది బలవన్మరణాలకు పాల్పడగా వారిలో విద్యార్థులు 567 మంది ఉన్నట్లు ఎన్‌సీఆర్‌బీ తాజా నివేదికలో పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా మొత్తం ఆత్మహత్య చేసుకున్న వారిలో పరీక్షల్లో ఫెయిల్ అయ్యామనే కారణంతో చేసుకున్నవారు ఒక శాతంగా ఉన్నారు.
![Students Suicides: బతికి సాధిద్దాం బిడ్డా!](https://assets.eenadu.net/article_img/100523gh-main1c.jpg)
పరీక్ష తప్పినందుకు స్నేహితుల ముందు తక్కువ అవుతామని, వారు ముందుకెళ్లిపోతారని.. తమకు భవిష్యత్తు ఉండదని... తల్లిదండ్రులు తిడతారనే ఆలోచనలు విద్యార్థులను కుంగుబాటుకు గురిచేస్తున్నాయి. పరీక్షల్లో బాగా రాశామని భావించే వారు ఫలితాలు వచ్చినప్పుడు కుంగిపోతుంటారు. తల్లిదండ్రులు పిల్లలతో స్నేహంగా ఉంటే తమలోని భయాలు, ఆందోళనను వారితో పంచుకునే ప్రయత్నం చేస్తారు. పిల్లల ప్రవర్తనలో మార్పులు గుర్తించి తల్లిదండ్రులు భరోసా ఇవ్వగలిగితే తొందరపాటు నిర్ణయాలు ఉండవు. వాస్తవానికి ఆత్మహత్య అప్పటికప్పుడు తీసుకునే నిర్ణయం కాదు. నాలుగు దశలు దాటి అయిదో దశలో ఆత్మహత్యాయత్నం చేస్తారు. మొదట్లో చనిపోవాలనే ఆలోచనలు చుట్టుముడతాయి. ఆ తర్వాత ఎలా చనిపోవాలనే ప్లానింగ్‌లో ఉంటారు. ఆ నిర్ణయానికి వచ్చాక వారి ప్రవర్తనలో హఠాత్తుగా మార్పులు కన్పిస్తాయి. మాటల్లోనూ వాటిని వ్యక్తపరుస్తుంటారు. నాలుగో దశలో అనువైన సమయం కోసం ఎదురుచూస్తుంటారు. సాధారణంగా ఇంట్లో ఎవరూలేని సమయంలో ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు. పరిస్థితులు అనువుగా లేకపోతే వెనక్కి తగ్గుతుంటారు.ఇవన్నీ దాటుకుని అయిదోదశలో ఆత్మహత్యకు పాల్పడతారు. ఏ దశలో గుర్తించగలిగినా బలవన్మరణానికి పాల్పడకుండా నివారించవచ్చు.
పిల్లల ఆత్మహత్యలను తీవ్రంగా పరిగణించాలి. పిల్లలకు భరోసా కల్పించేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రాధాన్యం ఇవ్వాలి. మానవ సంబంధాలు అనేవి అత్యంత కీలకం. ఒంటరి వారమనే భావన నుంచి పిల్లలు బయటపడాలి. వారికి స్వేచ్ఛగా సమస్యలను, ఇబ్బందులను చెప్పుకొనే అవకాశముండాలి. తల్లిదండ్రుల ఆకాంక్షలను నెరవేర్చలేకపోతున్నామనే అభిప్రాయంతో ప్రాణాలు తీసుకుంటున్నారు. పిల్లల నేపథ్యం కీలకమైన అంశం. గ్రామాల నుంచి పట్టణాలు, నగరాలకు రావడం కూడా పిల్లలపై ప్రభావం చూపుతున్నాయి. భయం, బాధ, కోపం, అపనమ్మకం, ఆత్మన్యూనత, అంచనాలను అందుకోలేకపోతున్నామనే ఆవేదనతో విద్యార్థులు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నారు. భావోద్వేగాలను నియంత్రించుకోలేక ఆత్మహత్య మినహా మరో పరిష్కారం లేదనే నిర్ణయానికి వస్తున్నారు. పిల్లలకు అండగా ఉండాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, ఉపాధ్యాయులదే. కుటుంబం తర్వాత అత్యధికసమయం విద్యార్థులు ఉండేది విద్యా సంస్థల్లోనే. ఉపాధ్యాయులు పిల్లలను దగ్గరగా పరిశీలించాలి. వారి వైఖరిలో మార్పు ఉంటే గుర్తించాలి. అందుకు కారణాలను విశ్లేషించి భరోసా కల్పించడం ద్వారా ఈ సమస్యలను చాలా వరకు అధిగమించవచ్చు.