రాష్ట్రంలో మొదలైన ఉద్యోగ జాతరలో భాగంగా 9231 గురుకుల టీచర్ల పోస్టులను విడుదల చేస్తామని ప్రకటించి, నోటిఫికేషన్‌కి వచ్చేసరికి 21 పోస్టులు తగ్గించి 9210 పోస్టులకు గాను 9 రకాల పరీక్షలు నిర్వహిస్తున్నట్టు గురుకుల నియామక బోర్డు నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పుడు ఈ నియామకాలకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుంది. అయితే ఈ గురుకులాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, జనరల్ గురుకుల పేర మొత్తం 5 రకాల సోసైటీలు ఉన్నాయి. అయితే ఈ నియామకాలను రాష్ట్రంలో ఉన్న అన్ని పరీక్షలకు భిన్నంగా బాలికల గురుకుల, బాలుర గురుకుల అని వేర్వేరు కళాశాలలు, పాఠశాలలు ఉండటం వల్ల సర్వీస్ సబార్డినేట్ రూల్స్ 22ఏ ప్రకారం బాలికల గురుకులాల్లో స్పెషల్ కోటాలో కేవలం మహిళా అభ్యర్ధులకు అవకాశం కల్పించారు. దీంతో మొత్తం ఉద్యోగాల్లో 78% అనగా 7150 పోస్టులు మహిళలకు రిజర్వు చేయబడినవి. మిగిలిన 22% అనగా 2060 పోస్టులలో పురుషులు మహిళలు ఇద్దరికి అవకాశం ఉంది. ఇందులో కూడా 33%కి తగ్గకుండా ఓపెన్ పోస్టులు మహిళలకు రిజర్వు చేయబడినవి.
ఎందుకని మహిళలకు ఎక్కువ?
నిజానికి రాష్ట్రంలోని నియామకాలకు ప్రస్తుతం వర్టికల్(నిలువు) రిజర్వేషన్లు అమలు అవుతున్నాయి. ఈ విధానంలో జనరల్ విభాగంతో పాటు ప్రతీ కేటగిరీలో ఓపెన్‌లో 33 శాతానికి తగ్గకుండా మహిళ అభ్యర్థులకు పోస్టులు రిజర్వు చేయబడినవి. అలాగే మహిళ అభ్యర్థులకు స్పెషల్‌గా 33 శాతం కోటా, దీంతో ఈ రెండు విధానాలు కలిసి ప్రతి నోటిఫికేషన్‌లో మహిళలకు 50 నుండి 60 శాతం పోస్టులు మంజూరు చేయబడ్డాయి. ఇక గురుకుల నోటిఫికేషన్‌లో మాత్రం బాలికల క్షేమంకోసం సబార్డినేట్ సర్వీస్ 22ఏ ప్రకారం బాలికల గురుకుల పాఠశాలలో మొత్తం పోస్టులు మహిళలకే రిజర్వ్ చేశారు. బాలుర గురుకులాల్లో ఇద్దరికి అవకాశం ఇచ్చారు. ఇందులో కూడా రోస్టర్ ప్రకారం మహిళా అభ్యర్థులకు ఎక్కువ పోస్టులు రిజర్వు చేసారు. దీంతో మొత్తం పోస్టుల్లో 72% మహిళ అభ్యర్థులకు రిజర్వు చేశారు. అయితే ఈ గురుకుల నోటిఫికేషన్‌లో ప్రకటించిన రోస్టర్ విధానం చూసి కొన్ని సంవత్సరాలుగా ప్రిపేరవుతున్న పురుష అభ్యర్థులు నిరాశ నిస్పృహలకు లోనయ్యారు. అయితే ఇటీవల విడుదల చేసిన హాస్టల్ వెల్ఫేర్ నోటిఫికేషన్‌లో బాలుర హాస్టల్ వెల్ఫేర్‌లో పురుష అభ్యర్థులకి, బాలికల హాస్టల్ వెల్ఫేర్‌లో మహిళ అభ్యర్థులకు పోస్టులు రిజర్వు చేసారు.. జనరల్ హాస్టల్‌లో ఇద్దరికీ అవకాశం కల్పించారు. అందుకే కనీసం బాలుర గురుకులలోనైనా మొత్తం పురుషులకే కేటాయించాలని న్యాయం చేయాలని రోడ్డెక్కుతున్నారు అభ్యర్థులు.
రాష్ట్రంలో గ్రూప్-1తో మొదలైన హారిజాంటల్ రోస్టర్ విధానం ప్రకారం అధిక పోస్టులు మహిళలకే రిజర్వు అవుతుండగా, పురుష అభ్యర్థులు కోర్టులో పిటిషన్ వేశారు. దీంతో కోర్టు విచారణ జరిపి ఉద్యోగాల భర్తీలో సమాంతర( హారిజాంటల్) రోస్టర్ విధానం అమలు చేయాలని, వర్టికల్ విధానం చెల్లదని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై ఇంకా కోర్టు తుదితీర్పు ఇవ్వకపోవడంతో వచ్చిన ప్రతి నోటిఫికేన్‌లో గ్రూప్-1 కోర్టు తీర్పుకి లోబడి రోస్టర్ జాబితా ఉంటుందని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. కానీ గురుకుల బోర్డ్ జారీచేసిన నోటిఫికేషన్‌లో మాత్రం ఈ అంశం పేర్కొనలేదు.
రోస్టర్ వ్యత్యాసాలు...
వర్టికల్ రోస్టర్ ప్రకారం మహిళ అభ్యర్థులకు ప్రతి ఓపెన్‌లో 33% రిజర్వేషన్‌తో పాటు మహిళా కేటగిరీలో మళ్ళీ ప్రత్యేకంగా కోటా ఉంటుంది.. దీనివల్ల మహిళ అభ్యర్థులకు ప్రతి ఉద్యోగ నోటిఫికేషన్‌లో 60% వరకు ఉద్యోగాలు వస్తాయి.. కానీ హారిజాంటల్ విధానంలో ప్రతి జనరల్ కేటగిరీలో మహిళా అభ్యర్ధులకు 33% తప్పని సరిగా ఉండేలా రోస్టర్ ఉంటుంది.. అంతే కానీ మళ్ళీ ప్రత్యేకంగా కోటా ఉండదు.. ఈ విధానంలో ప్రతి నోటిఫికేషన్‌లో పురుష మహిళా అభ్యర్ధులకు సమాన అవకాశాలు ఉంటాయి. ఎవరు మెరిట్‌లో ఉంటే వారు ఉద్యోగాలు పొందవచ్చు.. మహిళ అభ్యర్థులకు 33% లోపు ఉండకుండా 33%కి పైగా కూడా మెరిట్ జాబితా ప్రకారం ఉండవచ్చు.. ఇదే విధానం ఎక్కువ రాష్ట్రాలలో అమలులో ఉంది. కానీ అన్ని రాష్ట్రాలకు భిన్నంగా మన రాష్ట్రంలో వర్టికల్ రోస్టర్ ఎందుకో అర్థం కావడం లేదు.
రావుల రామ్మోహన్ రెడ్డి
రాష్ట్ర డీఎడ్,బీఎడ్ అభ్యర్థుల సంఘం అధ్యక్షులు
93930 59998