Search This Blog

Saturday, May 27, 2023

పలచబడి పోతున్న మానవ సంబంధాలు

 పలచబడి పోతున్న మానవ సంబంధాలు


హద్దులు గీస్తున్న హోదా , డబ్బు, అహం ,ఈర్ష్య నిజమే కదా !

 

   గత ముప్ఫై ఏళ్లుగా కుటుంబ సంబంధాలు మానవ సంబంధాలలో వస్తున్న మార్పులను చాలా దగ్గరగా చూస్తూ వచ్చాము .

          పెద్దగా ఆస్తులు..చెప్పుకోదగ్గ ఆదాయ వనరులు.. సమాజంలో హోదా.. సౌకర్యాలు సౌఖ్యాలు పెద్దగా లేని రోజుల్లోనే మనుషుల మధ్య ఆప్యాయత అనుబంధాలు చక్కగా చిక్కగా ఉండేవి..

               ఒకరికి ఒకరు చేదోడువాదోడుగా.. నిజాయితీగా అరమరికలు లేని సంబంధాలు కొనసాగించారు..

          ఉన్నంతలో తృప్తిగా ఉన్నారు.. కష్టానికి సుఖానికి ఒకరికొకరు కలుసుకోవడం.. అందరం దగ్గర వాళ్ళం అనే అనుభూతి పుష్కలంగా దొరికేది.

               కుటుంబంలో ఎవరి పిల్లలు అయినా ఏదైనా సాధిస్తే అది కుటుంబం మొత్తం ఉమ్మడిగా సంతోషం వ్యక్తం చేసేవారు..

               మా మనవడు లేదా మనవరాలు అని తాతలు, మా మేనకోడలు లేదా మేనల్లుడు అని అమ్మమ్మ ఇంటివారు నానమ్మ ఇంటి వారు అందరూ గర్వంగా చెప్పుకునే వారు.


             కానీ ఎప్పుడైతే 1983-84 నుంచి కార్పొరేట్ కాలేజ్ సంస్కృతి పెరగడం మొదలైందో,ఎప్పుడైతే ఒక్కొక్కరు పిల్లలను చదివించడానికి ప్రాధాన్యత ఇవ్వడం మొదలైందో, ఎప్పుడైతే పిల్లలు కూడా ఒకరికి మించి ఒకరు అవకాశాలు అందిపుచ్చుకుంటూ కెరీర్ సృష్టించుకోవడం మొదలైందో ఈ సంబంధాల్లో  కూడా పోటీ మొదలైంది పిల్లలో ఈర్ష్య, పెద్దల్లో అసూయ అమాంతంగా పెరిగిపోయాయి.


              జీవితంలో విజయం సాధించిన వారు కుటుంబాలలో మిగిలిన వారికి మార్గనిర్దేశనం చేసే వారు, అరమరికలు లేకుండా అండదండలు అందించే వారు. తాము ఎదగడంతో పాటు తమ వారు కూడా ఎదగడం కోసం సహాయ పడేవారు.


             కానీ ఎప్పుడైతే సర్వీస్ సెక్టార్ ప్రాముఖ్యత పెరగడం మొదలైందో,ఎప్పుడైతే వేగంగా కెరీర్ దొరకడం మొదలైందో వేగంగా కుటుంబాల ఆర్థిక స్థితిగతులు మారడం మొదలైందో,  అంతకు ముందు కన్నా జీవితంలో సౌఖ్యాలు విలాసాలు పెరిగాయో ఎందుకో మనుషుల వ్యక్తిత్వం మరింత పరిణతి చెందాల్సిన దగ్గర రివర్స్ లో కుంచించుకు పోవడం మొదలైంది.

 పక్కాగా సంబంధాలు పలుచపడటం మొదలైంది అంతా కమర్షియల్ అయిపోయింది .

              ఏ ఇద్దరు కలిసినా తమ పిల్లలు సాధించిన విజయాలు..  కొన్న ఆస్తులు.. చేయించుకున్న నగలు.. వారు పొందుతున్న సాలరీ ప్యాకేజ్.. వారు పొందుతున్న కంఫర్ట్ గురించి తప్ప..

               వెనుకటి రోజుల్లో లాగా ఆప్యాయంగా నోరారా పలకరించు కోవడమే తగ్గిపోయింది..పలకరించుకున్నా ఏదో మొక్కుబడిగానే...


                ఆ రోజుల్లో ఇంట్లో కీడు జరిగినా ,శుభకార్యం జరిగినా కనీసం 10 మంది చుట్టాలు వారం పది రోజుల ముందు నుంచే వచ్చి వుండేవారు.

              తరువాత కూడా ఇంకో వారం రోజులు వుండేవారు.

            రాత్రి పూట ఆరుబయట మంచాలు వేసుకుని పొద్దుబోయిందాక చక్కగా కబుర్లు చెప్పుకుంటూ పడుకునే వారు..

               ఇప్పుడు ఎంత దగ్గర వారి కార్యక్రమం అయినా.. చేసే వారు కూడా ఆప్పో సొప్పో చేసి పక్క వాడి కన్నా ఘనంగా చేయాలి అని చూపించే శ్రద్ధ మన వాళ్ళను దగ్గరగా నిలుపుకుందాము అని మర్చిపోతున్నారు..


               కార్యక్రమాలకు హాజరయ్యే  వారు కూడా తమ అతిశయం చూపించుకోవడానికి తమ స్థితిలో వచ్చిన మార్పు చూపించుకోవడనికి ఇస్తున్న ప్రయారిటీ,పారదర్శక సంబంధాల కి ఇవ్వడం లేదు. చాలా మొక్కుబడిగా ఆహ్వానాలు ,హజరులు మిగిలిపోతున్నాయి.

           అందరి పిల్లలు కెరీర్ పేరుతో దూరంగా ఉంటున్నా, ఇరుగు పొరుగునే వుంటున్న రక్త సంబంధీకులతో కూడా ఆత్మీయ అనుబంధాలు వుంచుకోవడం లేదు..

            నిష్కారణంగా చిన్న చిన్న కారణాలు తోనే విపరీతమైన అహం అతిశయం తో వ్యవహరిస్తూ అందరికి అందరూ గిరిగీసుకుని బతకడానికి అలవాటు పడుతున్నారు.


   వయసు పెరిగే కొద్దీ ఓర్పు సహనం పెరగాల్సిన దగ్గర అసూయ ద్వేషాలు పెంచుకుంటున్నారు.

        

           కొద్దిపాటి కూడా సర్దుబాటు ధోరణితో వుండడం లేదు.. విపరీతమైన స్వార్థం పక్క వాడి నీడ కూడా సహించడం లేదు..

దగ్గరి వాళ్ళ మధ్య కూడా గొడవలు.. మాట్లాడుకోక పోవడం.. షరా మాములు అయిపోయింది...


 సినిమా లో  రాసిన ఓ చక్కని డైలాగ్‌ గుర్తుకొస్తుంది........

‘"మనం బాగున్నప్పుడు లెక్కలు చూసుకుని... కష్టాల్లో ఉన్నప్పుడు విలువలు మాట్లాడకూడదు" 


వీలైతే  మనం బాగున్నప్పుడు కూడా అందరితో కలిసి ఉండాలి మన వారికీ అవసరమైన సహాయం అందించాలి.

       చాలా కుటుంబాలలో ఇప్పటికే మనుషులు పలచబడ్డారు..

            వలసలు పుణ్యాన.. గత 60-70 సంవత్సరాలుగా అనుసరిస్తూ వచ్చిన ఫ్యామిలీ ప్లానింగ్ వల్ల ఇప్పటికే కుటుంబాల సైజ్ తగ్గిపోయింది.. 

        దానికి తోడు కేవలం కూడూ గుడ్డా కూడా పెట్టని ఈ అడ్డు గోడలు పర్యవసానం..

                బాధాకరమైన విషయం ఏంటంటే ఒక వేళ పిల్లలు కజిన్స్ మన రూట్స్ కాపాడుకుందాం అనుకున్నా..రిలేషన్స్ లో ఎమోషన్ వుంచుకుందాము అనుకున్నా మెజారిటీ కుటుంబాలలో పెద్ద వాళ్ళు దూరిపోయి అగాధం పెంచుతున్నారు..

           చిన్నప్పటి మా రోజులే బంగారపు రోజులు అనిపిస్తున్నాయి..

              నేడు పిల్లలకు అసలు కుటుంబ సంబంధాలు పరిచయం చేయడం ఇన్వాల్వ్ చేయడం ఎప్పుడైతే తగ్గిపోయిందో..

      రేపటి రోజున మన తరువాత మన పిల్లలకు మన అనే వారే లేని..  మిగలని పరిస్థితి సృష్టిస్తున్నాము..

        నీ ఇంటికి వస్తే ఏమి పెడతావు? నా ఇంటికి వస్తె ఏమి తెస్తావు అన్న భావన నుంచి కొద్దిపాటి అయినా మార్పు చెందాలి..

           అందరూ కొద్దిగా ఆలోచించండి మన కుటుంబాల్ని మనమే ఎడం చేసుకుంటూ మనలో మనమే దూరం పెంచుకుంటూ ఇంకా సమాజం నుంచి మనం ఏమి ఆశిస్తాము.

               ఎవరికీ వారు గుండెల మీద చేయి వేసుకుని చెప్పండి.. మన చిన్ననాడు మనం ఏమేమి పొందాము నేడు మన పిల్లలకు ఏమేమి దూరం చేస్తున్నాము? 

           ఇప్పటికే చాలా మంది పెద్దవారు వెళ్ళిపోయారు మనకి ఎంత టైం వుంటుందో తెలియదు........😌

           మనం సక్రమంగా ఆరోగ్యంగా వున్నప్పుడే కనీసం మన వాళ్ళ దగ్గర అయినా పనికిమాలిన అహం, అతిశయం, వదిలేద్దాం ఏమంటారు....

సర్వేజనా సుఖినోభవంతు:


ఇట్లు


🙏🙏🙏

TSWREIS

TGARIEA ONLINE MEMBERSHIP

MATHS VIDEOS

EAMCET/IIT JEE /NEET CLASSES

Top