*🔊విద్యార్థులకు వేసవి సెలవులు అవసరమే*
*🔶ఆ సమయంలో తరగతుల నిషేధం సబబే
*🔷తేల్చిచెప్పిన కేరళ హైకోర్టు*
*🍥కొచ్చిన్: విద్యార్థులకు వేసవి సెలవులు అవసరమేనని, ఏడాది అంతా ఉక్కిరిబిక్కిరి అయ్యే చదువులతో గడిపేవారికి ఇవి విరామాన్ని ఇస్తాయని కేరళ హైకోర్టు పేర్కొంది. తదుపరి విద్యా సంవత్సరానికి ఉత్సాహంగా సన్నద్ధమయ్యే శక్తిసామర్థ్యాలను వేసవి సెలవులు అందించి సాయపడతాయని సమర్థించింది. ఈ సెలవుల్లోనూ తరగతులు నిర్వహించడాన్ని కేరళ ప్రభుత్వం నిషేధించడం సబబేనంది. సంప్రదాయ చదువుల నుంచి ఇతర కార్యకలాపాలవైపు విద్యార్థుల దృష్టి మళ్లించడానికి, మానసిక ఉల్లాసం కోసం బంధువుల ఇళ్లలో సరదాగా గడిపేందుకు ఈ సెలవులు వీలు కల్పిస్తాయని న్యాయమూర్తి జస్టిస్ పి.వి.కున్హికృష్ణన్ అభిప్రాయపడ్డారు. వేసవి సెలవుల్లో ఎలాంటి తరగతులు నిర్వహించకూడదని విద్యాశాఖ డైరెక్టర్ జనరల్ (డీజీఈ) ఈ నెల 3న ఇచ్చిన ఆదేశాలు సవాల్ చేస్తూ సీబీఎస్‌ఈ పాఠశాలలు దాఖలు చేసిన వివిధ రిట్ పిటిషన్లపై హైకోర్టు వాదనలు ఆలకించింది. ‘విద్యార్థులకు వేసవి సెలవులు ఇవ్వడం వెనుక ఒక ఉద్దేశం ఉంది. సెలవుల్లో వారు ఆహ్లాదంగా గడపాలి. ఇష్టమైన క్రికెట్, ఫుట్‌బాల్ వంటివి ఆడాలి. పాడాలి. హోంవర్క్ కోసం భయపడాల్సిన అవసరం లేకుండా తమకు నచ్చింది తీరిగ్గా తినాలి. ఇష్టమైన టీవీ కార్యక్రమాలు చూడాలి. కుటుంబ సభ్యులతో కలిసి యాత్రలను ఆస్వాదించాలి. కొత్త విద్యా సంవత్సరానికి వెళ్లేముందు విరామం అవసరం. ముఖ్యంగా పదో తరగతి విద్యార్థులకు అవశ్యం’ అని న్యాయమూర్తి స్పష్టంచేశారు. తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయులకు అభ్యంతరం లేకపోతే ప్రత్యేక తరగతులు నిర్వహించుకోవచ్చని 2018లో హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ఏకీభవించలేనని, దానిని పునఃపరిశీలించాల్సిన అవసరం ఉందని చెప్పారు.*