కాంట్రాక్టు కాలాన్నీ సర్వీసుగా పరిగణించాల్సిందే
గిరిజన గురుకులాల్లో 2000-2003 వరకు నియమితులై, 2008లో క్రమబద్ధీకరణకు నోచుకున్న బోధన సిబ్బంది సర్వీసును నియామక తేదీ నుంచే పరిగణనలోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
పింఛను ప్రయోజనాలూ కల్పించాలి
సీపీఎస్ ఉత్తర్వులు వారికి వర్తించవు
గిరిజన గురుకులాల బోధనా సిబ్బంది పిటిషన్‌పై హైకోర్టు తీర్పు
ఈనాడు, హైదరాబాద్: గిరిజన గురుకులాల్లో 2000-2003 వరకు నియమితులై, 2008లో క్రమబద్ధీకరణకు నోచుకున్న బోధన సిబ్బంది సర్వీసును నియామక తేదీ నుంచే పరిగణనలోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వీరిని కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం(సీపీఎస్) పరిధిలోకి తీసుకువస్తూ 2018 డిసెంబరులో జారీచేసిన సర్క్యులర్ చెల్లదంటూ తీర్పు వెలువరించింది. వీరికి రెగ్యులర్ పింఛను ప్రయోజనాలు కల్పించాలని ఆదేశాలిచ్చింది. నియామక తేదీ నుంచి సర్వీసును లెక్కించకపోవడంతోపాటు.. సీపీఎస్ అమలు నిమిత్తం 2018 డిసెంబరు 19న జారీచేసిన సర్క్యులర్‌ను సవాలు చేస్తూ గిరిజన గురుకులాల బోధన సిబ్బంది పి.రుషికేష్ కుమార్ మరో 120 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ ఇ.వి.వేణుగోపాల్ విచారణ చేపట్టి ఇటీవల తీర్పు వెలువరించారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది గుర్రం శ్రీనివాస్ వాదనలు వినిపించారు. ‘పిటిషనర్లు 2000-2003 వరకు కాంట్రాక్టు పద్ధతిన నియమితులయ్యారు. వీరిని క్రమబద్ధీకరిస్తూ 2008లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. సర్వీసును మాత్రం నియామక తేదీ నుంచి పరిగణనలోకి తీసుకోలేదు. 2018లో వారికి సీపీఎస్ వర్తింపజేస్తూ సర్క్యులర్ జారీ అయింది’ అని తెలిపారు. 2008లో నియమితులైన వీరంతా రెగ్యులర్ పింఛను పరిధిలోకి రారని గురుకులాల తరఫు న్యాయవాది వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి సర్వీసు లెక్కింపునకు సంబంధించి దేవరకొండ శ్రీలక్ష్మి వర్సెస్ ఏపీ కేసులో ఇదే హైకోర్టు తీర్పు వెలువరించిందని, ఆ ప్రకారం కాంట్రాక్టు పద్ధతిన పనిచేసిన సర్వీసును మినహాయించడానికి వీల్లేదన్నారు. రెగ్యులర్ పింఛను వర్తింపజేయకపోవడం ఏకపక్షమని పేర్కొన్నారు. ‘పింఛను నిబంధన-13 పే స్కేలు సర్వీసును లెక్కించడానికి ఆధారం కాదు. పిటిషనర్లు 2002 నుంచి దాదాపు రెండు దశాబ్దాలపాటు సేవలందించారు. 2004 సెప్టెంబరు తరువాత నియమితులైనందున..వారికి గురుకుల సొసైటీ పింఛను వర్తించదని చెప్పడం సరికాదు. పిటిషనర్ల వేతనాలు, విధులు అన్నీ ప్రభుత్వ పరిధిలోనే ఉన్నాయి. వేతనాలు ప్రభుత్వ సంఘటిత నిధి నుంచి పొందుతున్నారనడంలోనూ ఎలాంటి సందేహంలేదు. అందువల్ల కాంట్రాక్టు కింద కొనసాగిన సర్వీసును కూడా నిబంధనల ప్రకారం పింఛను ప్రయోజనాలకు అర్హతగా పరిగణించాల్సి ఉంటుంది. రాజ్యాంగపరంగా దక్కిన పింఛను ప్రయోజనాలను పొందడం పిటిషనర్ల హక్కు’ అని పేర్కొన్నారు.