Search This Blog

Tuesday, January 3, 2023

Savitribai Phule: మహిళా విద్యా ప్రదాత







విద్య ద్వారా సమాజంలో ఉన్న అసమానతలను చదును చేయాలని... 18వ శతాబ్దంలోనే మహాత్మ జ్యోతిబాఫూలే, సావిత్రీబాయి ఫూలే దంపతులు ప్రయత్నించారు. మొక్కవోని వారి దీక్ష వల్ల అప్పటి సమాజంలో హీన స్థితిలో ఉన్న స్త్రీల జీవితాలకు అండ దొరికింది. భర్త జ్యోతిబా ఫూలే ప్రోత్సాహంతో స్వయంగా చదువుకున్న సావిత్రీబాయి దేశంలో మహిళా విద్యకు దారిదీపం అయింది. 

1840లో 9 ఏళ్ల సావిత్రీబాయి వివాహం 13 ఏళ్ల జ్యోతిబా ఫూలేతో జరిగింది. స్త్రీలకు విద్య చాలా అవసరం అని గ్రహించి ముందు తన భార్య సావిత్రీబాయికి చదువు నేర్పాడు జ్యోతిబా. భారతదేశ చరిత్రలోనే స్త్రీ విద్యను మొట్ట మొదట ప్రవేశపెట్టిన వాడు జ్యోతిబాఫూలే. తన పొలం దగ్గర మామిడి చెట్టు నీడలో మొట్ట మొదటి పాఠశాల పెట్టాడు. ఆ పాఠశాలలో ఆయన అక్క సుగుణబాయి, భార్య సావిత్రీ బాయి విద్యార్థులు! స్త్రీ విద్యా ప్రయోగశాలగా ఆ పాఠశాల చరిత్రలో మిగిలిపోయింది. 

1848లో ఓ భవంతిలో స్త్రీల కోసం పాఠశాలను ఏర్పాటు చేశాడు ఫూలే. చదువు నేర్చుకునే క్రమంలో సావిత్రీబాయి ఎన్నో పుస్తకాలు చదివి స్త్రీ ఎంత దారుణ స్థితిలో ఉందో అర్థం చేసుకుంది. అదే సమయంలో అమెరికా నల్లజాతి వివక్ష వ్యతిరేక పోరాట నాయకులు థామస్‌ క్లార్క్‌ జీవిత చరిత్ర చదివి స్ఫూర్తి పొందింది. బ్రాహ్మణ స్త్రీలతోపాటూ బహు జన స్త్రీ జనోద్ధరణకు భర్తతో పాటూ నడుం బిగించింది. స్త్రీ జనోద్ధరణకు సంబంధించిన అన్ని కార్యక్రమాలకూ ఆమే ఇన్‌చార్జ్‌గా వ్యవహరించింది. 

1851లో పూణేలో అమ్మాయిల కోసం మరో స్కూలు ప్రారంభించారు. మెల్లమెల్లగా పూలే దంప తులు 18 పాఠశాలలను స్థాపించారు. అయితే నాటి ఛాందసవాదులు సావిత్రీబాయి మామగారిని... ఆయన కొడుకూ, కోడలూ శ్రాస్త విరుద్ధంగా వ్యవహ రిస్తున్నారని రెచ్చగొట్టారు. దీంతో ఫూలే దంపతులను మామగారు ఇంటి నుండి వెళ్లగొట్టారు. అయినా ఆ దంప తులు తమ మార్గాన్ని మార్చు కోలేదు. ఆత్మహత్య చేసుకోబోతున్న కాశీ బాయి అనే గర్భవతి అయిన బ్రాహ్మణ వితంతు మహిళను కాపాడి ఆమె కన్న పిల్లవాడిని దత్తత తీసుకుని ‘యశ్వంతరావు’ అని పేరు పెట్టుకొని పెంచి పెద్ద చేశారు.

1876–77లో మహా రాష్ట్రలో భయంకరమైన కరువు వచ్చి జనాలు ఆకలితో అలమటిస్తుంటే తమ ‘సత్య శోధక సమాజ్‌’ ద్వారా ఆహార సేకరణ చేసి ఆదుకున్నారు. ఆమె మంచి ఉపాధ్యాయురాలే కాదు,  కవయిత్రి కూడా. ఆమె రచించినటువంటి ‘కావ్య  పుష్పాలు’ అనే  సంపుటి చాలా గొప్పది. ప్లేగు వ్యాధి గ్రస్థులకు సేవ చేస్తూ ఆ వ్యాధికే బలై 1897 మార్చి 10వ తేదీన తుది శ్వాసవిడిచి ఎందరికో స్ఫూర్తిప్రదాతగా నిలిచిన మహనీయురాలు సావిత్రీబాయి.

TSWREIS

TGARIEA ONLINE MEMBERSHIP

MATHS VIDEOS

EAMCET/IIT JEE /NEET CLASSES

Top