భయం అనేది ఆలోచనలకు సంకెల. ప్రజ్ఞకు ప్రతిబంధకం. దారిని మూసివేసే ముళ్ళకంప. మనో దౌర్బల్యానికి మొదటి మెట్టు. అనేక రోగాలకు మూలం. భయాన్ని జయించని వారెవరూ విజేతలుగా నిలబడలేరు. భయం గుప్పిట్లో చిక్కినవారు క్రమంగా నిస్పృహలోకి జారిపోతార
ధర్మపథం
భయం అనేది ఆలోచనలకు సంకెల. ప్రజ్ఞకు ప్రతిబంధకం. దారిని మూసివేసే ముళ్ళకంప. మనో దౌర్బల్యానికి మొదటి మెట్టు. అనేక రోగాలకు మూలం. భయాన్ని జయించని వారెవరూ విజేతలుగా నిలబడలేరు. భయం గుప్పిట్లో చిక్కినవారు క్రమంగా నిస్పృహలోకి జారిపోతారు. దుర్బలచిత్తులై చితికిపోతారు. ఆ భయం శారీరక శక్తినే కాదు, మనో ధైర్యాన్ని కూడా చిదిమేస్తుంది. చింతల వలయంలోకి నెట్టి, చివరకు బతుకును చీకటి చేస్తుంది. జ్ఞానులు మొదటగా జయించాల్సింది భయాన్నే. అలా జయించారు కాబట్టే... ఎందరో జ్ఞానులు భయంకర కీకారణ్యాల్లో జీవించగలిగారు.
మనస్సు నిర్మలంగా, ద్వేషరహితంగా, నిస్వార్థంగా ఉంటే భయం పుట్టదు. స్వార్ధాన్ని జయించేవారికి ఉండే ధైర్యం చెక్కుచెదరదు. మనం చేసే అకుశల, అపరిశుద్ధ కర్మలే భయం పుట్టడానికి కారణం. క్రూర జంతువులు, విష పురుగుల వల్ల కలిగే భయం నిత్యం కాదు... అది తాత్కాలికం. కానీ అకుశల కర్మల వల్ల పుట్టిన భయం మనల్ని నిరంతరం వెంటాడుతూనే ఉంటుంది. అంటే... అటువంటి కర్మలే భయాన్ని మనలోనికి ఆహ్వానిస్తాయి. మన చెడు నడతే మనలోని భయానికి మూలకారణం. దీన్ని ‘నైతిక భయం’ అంటాం.
ఒకనాడు బుద్ధుడు శ్రావస్తిలో... అనాథపిండికుని జేతవనంలో ఉన్నాడు. అప్పుడు జానుస్సోణుడు అనే పండితుడు ఆయన దగ్గరకు వచ్చాడు. ‘భయభీతులు ఎలా కలుగుతాయి? ఎవరికి కలుగుతాయి? ఎప్పుడు కలుగుతాయి?’ అనే విషయంలో వారి మధ్య చర్చ జరిగింది.
అడవిలో, ఏకాంతవాసంలో గడిపేటప్పుడు... ఎటువంటి వ్యక్తులు భయంవల్ల తమ సాధన కొనసాగించలేరో బుద్ధుడు వివరిస్తూ... ‘‘జానుస్సోణా! పరిశుద్ధ జీవనం కొనసాగించేవారు, లోభం, కామం, ద్రోహచింతన లేనివారు, సర్వ జీవుల పట్లా మైత్రీపూర్వకంగా మెలిగేవారు... వీరు జనం మధ్య ఉన్నా, అరణ్యాలలో ఉన్నా భయపడరు. సోమరులు, ఎల్లప్పుడూ అశాంతచిత్తం కలిగినవారు, స్థిరమైన అభిప్రాయం లేనివారు, అనుమానంలో, సంశయాలలో పడి కొట్టుమిట్టాడేవారు... వీరు అడవుల్లో ఉన్నా, మనుషుల మధ్య ఉన్నా శాంతంగా, నిర్భయంగా ఉండలేరు. అలాగే పిరికివారు, సన్మాన, సత్కారాల మీద అతి అభిలాష కలిగినవారు, కీర్తికాంక్షులు, తెలివిహీనులు, నిగ్రహం లేనివారు, చంచలచిత్తులు, బుద్ధిహీనులూ కూడా భయరహితులుగా జీవించలేరు. ఇలాంటి భయకంపితులు ఏకాంతంలోనూ ప్రశాంతంగా జీవించలేరు’’ అని చెప్పాడు.
అప్పుడు జానుస్సోణుడు ‘‘అయితే భగవాన్! ఆ భయం నుంచి బయటపడేదేలా?’’ అని అడిగాడు.
‘‘స్సోణా! మనకు ఎక్కడ, ఎప్పుడు భయం కలిగిందో... ఆ భయాన్ని అక్కడే, అప్పుడే తొలగించుకోవాలి. నీటిలో భయం కలిగితే... ఆ భయాన్ని నీటిలోనే తొలగించుకోవాలి. ఆ విధంగా మాత్రమే ఆ భయాన్ని అధిగమించగలం. అడవిలో భయాన్ని అడవిలోనే తొలగించుకుంటే... భయరహితంగా జీవించగలం. రాత్రివల్ల కలిగే భయాన్ని పగలు తొలగించుకోగలమా? దానివల్ల ఫలితం ఉంటుందా? నేను నా భయాల్ని అలాగే తొలగించుకున్నాను. అలా తొలగించుకోవడమే అవిద్య నుంచి బయటపడడం’’ అని చెప్పాడు.
అప్పుడు జానుస్సోణుడు ‘‘భగవాన్! భయాన్ని గురించి, దాన్ని తొలగించుకోవడం గురించీ ఎంత చక్కగా చెప్పారు? నీటి భయాన్ని నీటిలోనే తొలగించుకోవాలి... నీడలో కాదు కదా!’’ అంటూ శిరస్సు వంచి వినమ్రంగా నమస్కరించాడు.
బొర్రా గోవర్ధన్