- వివాదానికి తెరదించి భూములపై పూర్తి స్థాయి హక్కులు
- నామమాత్రపు ఫీజుతో క్రమబద్ధీకరణ
- ఆరు నెలల్లో నాలుగు వాయిదాల్లో చార్జీల చెల్లించేలా వెసులుబాటు
- ఆరు నియోజకవర్గాల్లోని 44 కాలనీవాసులకు లబ్ధి
భూ రిజిస్ట్రేషన్లపై ఆంక్షల కత్తి వేలాడుతున్న ఆరు నియోజకవర్గాల్లోని 44 కాలనీలకు విముక్తి కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం చారిత్రక ఉత్తర్వులు జారీ చేసింది. ఆంక్షలను ఎత్తివేస్తూ విడుదల చేసిన జీవో 118 ఆయా కాలనీల్లో వెలుగులు నింపనున్నది. ఇప్పటికే ఉన్న ఇండ్లను క్రమబద్ధీకరించి పూర్తిస్థాయి హక్కులను కల్పిస్తుండడంతో పేద, మధ్య ప్రజలకు ప్రభుత్వ నిర్ణయం బాసటగా నిలవనున్నది. ఆంక్షల తొలగింపుతో ఇండ్ల నిర్మాణాలు ఊపందుకుని భారీ అభివృద్ధికి ఆస్కారం కలుగడంతోపాటు..భూముల ధరలు సైతం భారీగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. నామమాత్రపు ఫీజుతో మీసేవల్లో దరఖాస్తు చేసుకుంటే జిల్లా కలెక్టర్లు పరిష్కరించి రిజిస్ట్రేషన్ డీడ్‌లు చేయనున్నారు. ఈ ప్రక్రియ అంతా ఆరు నెలల్లోనే పూర్తిచేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది.
ఎల్బీనగర్, మేడ్చల్, రాజేంద్ర నగర్, కార్వాన్, నాంపల్లి, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల్లోని 44 కాలనీల్లో భూములకు సంబంధించి వివాదాలున్నాయి. ఆయా చోట్ల ప్రైవేటు వ్యక్తులు వెంచర్లు చేసి ప్లాట్లను విక్రయించారు. కొందరు ఇండ్లను కూడా నిర్మించుకున్నారు. అయితే 1998 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం 22ఏ(నిషేధిత భూముల) జాబితాలో కొన్ని సర్వే నంబర్లను చేర్చింది. దీంతో రిజిస్ట్రేషన్ల శాఖ ఆయా సర్వే నంబర్లలోని భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియను నిలిపివేసింది. అప్పటికే కొన్నింటికి రిజిస్ట్రేషన్లు జరిగినప్పటికీ వాటిపై హక్కులేకుండా పోయింది. ఈ కారణంగా నిర్మాణాలు జరగక, అభివృద్ధికి అధికారుల నుంచి అనుమతులు లేక సౌకర్యాలు కరువయ్యాయి. ఎన్నో ఏండ్లుగా అక్కడి ప్రజలు నివాసాలు ఏర్పాటు చేసుకుని జీవనం చేసుకుంటున్నప్పటికీ బిడ్డల వివాహాలకు, కొడుకుల చదువులకు బ్యాంకుల్లో తాకట్టు పెట్టుకునే పరిస్థితి లేక ఇంటి యజమానులు ఇబ్బందులు పడుతూ వస్తున్నారు. పదిహేను ఏండ్లుగా పోరాటం చేస్తున్నప్పటికీ ఏ ప్రభుత్వం కూడా పరిష్కారం దిశగా చర్యలు తీసుకోలేదు. సీఎం కేసీఆర్ మానవతా దృక్పథంతో భూ క్రమబద్ధీకరణకు జీవో 118ను విడుదల చేసి పేదలపై ఉన్న మమకారాన్ని మరోసారి చాటుకున్నారు. జీవో 118తో మొత్తంగా 44 కాలనీల్లో వెలుగులు నిండనున్నాయి.
గురుద్వారాలో ప్రత్యేకప్రార్థనలు
అమీర్‌పేట్, నవంబర్ 3: పేదలు నివాసముంటున్న స్థలాలను వారికే రెగ్యులరైజ్ చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని జీవో 118 రూపంలో వెలువరించడంతో అమీర్‌పేట్‌లోని గురుద్వారాలో సిక్కులు గురువారం ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో అత్తాపూర్ సిఖ్‌చావ్‌నీలో దశాబ్దాల తరబడిగా నివాసముంటున్న దాదాపు 1200 సిక్కు కుటుంబాలకు మేలు చేకూరింది. కేవలం రూ.250ల నామమాత్రపు రుసుముతో తాము నివాసముంటున్న స్థలాలను క్రమబద్ధీకరించుకునే అవకాశాన్ని కల్పించినందుకు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుకుంటూ కేసీఆర్, కేటీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మైనార్టీ కమిషన్ మాజీ సభ్యులు సర్దార్ సురిందర్‌సింగ్, గురుద్వారా సాహెబ్ (అమీర్‌పేట్) అధ్యక్షులు సర్దార్ బాగిందర్‌సింగ్, మాజీ అధ్యక్షులు నరేందర్‌సింగ్, టీఆర్‌ఎస్ నాయకులు జోగీందర్‌సింగ్, సిఖ్ ప్రముఖులు బల్విందర్‌సింగ్, చరణ్‌జిత్‌సింగ్, హర్మిక్‌సింగ్, పర్విందర్‌సింగ్, స్వరణ్‌సింగ్, సుమిత్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు.
కన్వీయన్స్ డీడ్‌తో పూర్తి హక్కులు
జీవో 118 క్రమబద్ధీకరణ పథకం ఆరు నియోజకవర్గాల్లో అమలు కానుండగా ఒక్కొక్కరికి గరిష్టంగా వెయ్యి గజాల వరకు నిర్మాణాలతో కూడిన స్థలాన్ని క్రమబద్ధీకరించనున్నారు. గజానికి రూ.250 లెక్కన నివాసితులు ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. సంబంధిత ఫీజును ఆరు నెలల వ్యవధిలో నాలుగు విడతలుగా చెల్లించేందుకు ప్రభుత్వం వెసులుబాటును కల్పించింది. నిర్దేశిత పత్రాలతో మీ సేవల్లో దరఖాస్తు చేసుకుంటే క్షేత్రస్థాయిలో రెవెన్యూ అధికారులు పరిశీలిస్తారు. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో రిజిస్ట్రేషన్ డీడ్(కన్వీయన్స్ డీడ్) చేసి సదరు స్థలాలపై పూర్తిస్థాయి హక్కులను యజమానులకు ప్రభుత్వం కల్పించనుంది. ఈ ప్రక్రియను ఆరు నెలల వ్యవధిలో పూర్తి చేయనున్నారు. గతంలో నిర్మాణాలు పూర్తి చేసుకుని రిజిస్ట్రేషన్ అయిన స్థలాలతో పాటు, రిజిస్ట్రేషన్ కాని స్థలాలకు క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని, ఇందుకు రెండు, మూడు రోజుల్లో మార్గదర్శకాలు ప్రభుత్వం నుంచి విడుదల కానున్నట్లు వారు చెబుతున్నారు.
జీవోతో లబ్ధిపొందే కాలనీలు
1. ఎల్బీనగర్ నియోజకవర్గం: శ్రీనిధి కాలనీ, మల్లికార్జున హిల్స్, మారుతీనగర్ కాలనీ, శ్రీనిధి కాలనీ, జనార్దన్‌రెడ్డి నగర్, మారుతీనగర్, ఈస్ట్ మారుతినగర్, అవంతి కాలనీ, మాధవనగర్ కాలనీ, మల్లారెడ్డి కాలనీ, రాజిరెడ్డి నగర్, ఎస్‌వి కాలనీ, వినాయకనగర్, బాలాజీనగర్, శ్రీరామహిల్స్, వివేకానందనగర్, రాగాల ఎన్‌క్లేవ్, పద్మావతి నగర్, కమలానగర్, సీఆర్ ఎన్‌క్లేవ్, గణేశ్‌నగర్, లలితానగర్ నార్త్ కాలనీ, ఈశ్వరిపురం కాలనీ, జైపూర్ కాలనీ, కో ఆపరేటివ్ బ్యాంక్ కాలనీ, సాయినగర్, ఎస్‌కేడీ నగర్, శ్రీరామ్ నగర్, బీఎన్ రెడ్డి నగర్, వైదేహినగర్, శ్రీపురం కాలనీ, సాగర్ కాంప్లెక్స్, విజయ్‌నగర్ కాలనీ, సీబీఐ కాలనీ, సామనగర్ కాలనీ, కాస్మోపాలిటన్ కాలనీ, బ్యాంకు కాలనీ.
2. మేడ్చల్ నియోజకవర్గం: సత్యనారాయణ పురంకాలనీ, సాయిప్రియ నగర్
3. రాజేంద్రనగర్ నియోజకవర్గం: సిఖ్‌చావునీ
4. కార్వాన్ నియోజకవర్గం: విశ్రాంత సైనికులక్వార్టర్స్, గోల్కొండ మండలంలోని బంజార దర్వాజ
5. నాంపల్లి నియోజకవర్గం: నాంపల్లి మండలంలోని బ్యాండ్ లైన్స్, ఆసిఫ్‌నగర్ మండలంలోని మాసబ్ లైన్స్, ఏసీ గార్డ్స్
6. జూబ్లీహిల్స్ నియోజకవర్గం: షేక్‌పేట మండలంలోని మహమ్మది లైన్స్
ప్రభుత్వ నిర్ణయం అభినందనీయం
తెలంగాణ ప్రభుత్వం ఇండ్ల స్థలాల క్రమబద్ధీకరణకు 118 జీవోను తేవడం అభినందనీయం. ఈ నిర్ణయంతో ప్రజలు కన్న కలలు నిజం అవుతున్నాయి. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో ఈ జీవో రావడం ఎంతో సంతోషంగా ఉంది.
– కౌసర్‌మొహినుద్దీన్, ఎమ్మెల్యే కార్వాన్
కల నెరవేరుతున్నది
మా తాతల కాలం నుంచి మిలటరీ క్వార్టర్స్‌లో ఉంటున్నాం. గతంలో ఒకసారి సమైక్య పాలనలో డబ్బులు కూడా కట్టాం. అప్పటి అధికారులు
క్రమబద్ధీకరణలో భాగంగా 13 ఇండ్లను మాత్రమే క్రమబద్ధీకరించారు. ఆ తర్వాత మిగతావాటి
ఊసేలేదు. దీంతో మేము ఇది కలగానే మిగిలి పోతుందా? అని అనుకున్నాం. కానీ ఇప్పుడు
మా కల నెరవేరబోతున్నది.
– మీర్జా వసివుల్లా బేగ్, మిలటరీ క్వార్టర్స్ వాసి
ప్రభుత్వానిది గొప్ప నిర్ణయం
రాష్ట్ర ప్రభుత్వం 118 జీవోను విడుదల చేయడం సంతోషకరం. ఎన్నో సంవత్సరాలుగా మా స్థలాలను క్రమబద్ధీకరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ వచ్చాం. ఎట్టకేలకు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రత్యేక చొరవ తీసుకుని 118 జీవోను తీసుకు రావడంతో మా బస్తీ వాసులు అంతా సంతోషంగా ఉన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లకు రుణపడి ఉంటాం.
– సుఖ్‌దేవ్‌సింగ్, సిఖ్‌చావునీ గురుద్వార అధ్యక్షుడు
ఏండ్లనాటి సమస్య తీరింది
దాదాపు 40 సంవత్సరాల కల నెరవేరబోతున్నది. ఇండ్ల పట్టాలు లేక ఇబ్బంది పడుతున్న మాకు రాష్ట ప్రభుత్వం తెచ్చిన జీవోతో మా సమస్య తీరనుంది. ఎప్పటికీ సమస్య పరిష్కారం కాదనుకున్నాం. కానీ రాష్ట ఫ్రభుత్వం మాకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. ఉమ్మడి రాష్ట్రంలో ఎంత ప్రయత్నించినా మాకు పట్టాల సమస్య పరిష్కారం కాలేదు. ప్రస్తుతం తెచ్చిన జీవో వల్ల 1000 కుంటుబాలకు లబ్ది చేకూరుతుంది. మేమంతా ప్రభుత్వానికి అండగా ఉంటాం.
– సర్దార్ హర్బన్ సింగ్, గురుద్వార్ బరంబలా చైర్మన్, సిఖ్‌చౌనీ
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు రుణపడి ఉంటాం
ఎన్నో ఏండ్లుగా ఇబ్బందులు పడుతున్న మా కాలనీ వాసుల సమస్యను 118 జీవోతో పరిష్కారం చేశారు. ఇందుకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డికి ప్రత్యేక ధన్యవాదములు. వారికి రుణపడి ఉంటాం.
– శ్యామల యాదగిరి, అధ్యక్షుడు, జైపురికాలనీ సంక్షేమ సంఘం
14 ఏండ్ల వనవాసం నుంచి బయటపడ్డాం
గతంలో గ్రామపంచాయతీ, మున్సిపాలిటీ, హెచ్‌ఎండీఎ అనుమతులతో ఇండ్లను నిర్మించుకున్నాం. అధికారుల తప్పిదం మూలంగా సమస్యలు వచ్చాయి. గత 14 ఏండ్ల నుంచి సమస్య ఉంది. చేయని తప్పుకు తీవ్ర ఇక్కట్లు పడ్డాం. తెలంగాణ ప్రభుత్వం సహకారంతో సమస్య నుంచి బయటపడ్డాం.
– జోగిపర్తి శ్రీనివాస్‌రావు, సాగర్ కాంప్లెక్స్ ఫేజ్
చారిత్రక నిర్ణయం
ఇండ్ల స్థలాల క్రమబద్ధీకరణ జీవోను తెలంగాణ ప్రభుత్వం తేవడం ఆనందంగా ఉంది. మా తాతల కాలం నాటి ఇండ్లు మాకు సొంతం కాబోతున్నాయి. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం చరిత్రాత్మకం.
– సయ్యద్ షకీల్ హుస్సేన్
సంతోషంగా ఉంది
బ్యాండ్‌లైన్స్ స్థలాలను రెగ్యులరైజ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ప్రాంత ప్రజలమంతా విజ్ఞప్తి చేస్తూ వస్తున్నాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పాలకులు ఏ మాత్రం పట్టించుకోకపోగా టీఆర్‌ఎస్ పార్టీ ప్రజల విజ్ఞప్తిని దృష్టిలో ఉంచుకుని మా ప్రాంతంలోని స్థలాలను క్రమబద్ధీకరించేందుకుగాను 118 జీవోను విడుదల చేసింది. దీంతో బ్యాండ్‌లైన్స్‌వాసుల్లో సంతోషం వెల్లివిరుస్తున్నది.
– మమతా సంతోష్ గుప్తా, గన్‌ఫౌండ్రి డివిజన్ మాజీ కార్పొరేటర్