Exercise: వ్యాయామం చేస్తే..ఆరోగ్యం మీ సొంతం
సకల రోగ నివారిణి వ్యాయామమే.. మధుమేహం, అధిక రక్తపోటు ఇలా శరీరానికి ఏ అనారోగ్యం వచ్చినా నడక, వ్యాయామం చేస్తే నయమవుతుందని నిపుణులు చెబుతారు. ఇది కూడా వయసును బట్టి చేస్తే ఎంతో మేలు కలుగుతుంది. 30 ఏళ్ల లోపుంటే పరుగు, జిమ్‌కు వెళ్లవచ్చు..ఆపై వయసు వారు నడక, ఎరోబిక్స్, యోగా లాంటివి చేస్తే ఆరోగ్యం బాగుంటుంది. రోజులో కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేస్తే చాలని వైద్యులు సూచిస్తున్నారు.
నడక: ఇది సమతులంగా శరీరానికి మేలు కలిగిస్తుంది. అన్ని భాగాలకు ఫిట్‌నెస్ సమకూరుతుంది. గ్లూకోజ్ శాతాన్ని అవసరమయినంత విడుదల చేస్తుంది. మధుమేహం అదుపులో ఉంచుతుంది. అధిక రక్తపోటు నుంచి రక్షణ కల్పిస్తుంది. జాగింగ్, సైకిల్ తొక్కడం, ఈత, టెన్నిస్ ఆడటం గుండె, ఊపిరితిత్తులను బలోపేతం చేస్తాయి.
బరువులెత్తడం: జిమ్‌లో చేసే కఠిన పద్ధతులు శరీరంలో ఉన్న అదనపు కొవ్వును కరిగిస్తాయి. కండరాలకు శక్తిని అందిస్తుంది. ఎముకలకు బలం చేకూరుతుంది. ఎక్కువ కేలరీలు ఖర్చు కావడంతో మధుమేహం వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అవయవాల సమన్వయం సాధ్యమవుతుంది. మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉంటారు.
యోగా: యోగా అన్ని రకాల జబ్బులను పారదోలుతుందని నిపుణులు చెబుతారు. ప్రాచీన పద్ధతులు, ఆచరణతో మెదడు నుంచి అరికాలు దాకా అన్నింటిని మెరుగ్గా ఉంచడం, అనారోగ్యం దరిదాపుల్లోకి రాకుండా చేస్తుంది. జ్ఞాపకశక్తిని పెంచుతుంది. నరాల బలహీనతలను, శారీరక రుగ్మతలను దూరం చేస్తుంది. మానసిక ఉల్లాసం సాధ్యమవుతుంది.