Search This Blog

Saturday, August 6, 2022

ఆలస్యం నిదానం

ఆలస్యం నిదానం   

 మనిషి తన దైనందిన కృత్యాల్లోను, వివిధ కార్యక్రమ ప్రణాళికా రచనలోను రెండు సూత్రాలను ప్రధానంగా గుర్తుకు తెచ్చుకుంటాడు.

‘ఆలస్యం అమృతం విషం’ అని, ‘నిదానమే ప్రధానం’ అని..!

నిజానికి ఈ రెండు సూత్రాలూ కార్యసాఫల్యానికి అవసరమైనవే. ఆయా సందర్భాలు, సన్నివేశాలు, పరిస్థితులను బట్టి ఈ సూత్రాలను ఆచరణలోకి తేవాల్సి ఉంటుంది.

 ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు తన బుద్ధితోనే గాక, తన హితం కోరేవారు, ఆత్మీయుల బుద్ధిని కూడా ఉపయోగించుకోవడం పురోగతి కోరుకునేవాడి  లక్షణం.


తనకు తోచిందే సరైనదని వెనకా ముందూ ఆలోచించకుండా అనుకున్న వెంటనే పని మొదలెట్టడం వైఫల్యానికి, అవమానానికి కారణభూతమవుతుంది. విపరీత ఫలితాలు ఎదుర్కొన్నాక పశ్చాత్తాపం చెందడం చేతులు కాలాక ఆకులు పట్టుకోవడమే అవుతుంది.

ఈ తొందరపాటు ప్రతి మనిషి జీవితంలోనూ కనిపిస్తుంది. అదే శోక కారణమవుతుంది. అనుభవజ్ఞుల సలహాలు, సూచనలను విని విశ్లేషించుకుని అహంకరించక, వివేకంతో ముందడుగేసేవాడు కచ్చితంగా కార్యసాధకుడు కాగలడు.

 తొందరపాటు వల్ల జీవితంలో దిద్దుకోలేని అగచాట్లు ఎదురవుతాయి. నిరంతరం దుఃఖం అనుభవించే సంఘటనలూ జరుగుతుంటాయి.

 ప్రధానంగా కామక్రోధ లోభమోహాది అరిషడ్వర్గాల వల్ల, మానసిక ఒత్తిళ్ల వల్ల, భావోద్వేగాలకు బానిస కావడం వల్ల తొందరపాటుతో తప్పులు దొర్లుతుంటాయి. ఈ బలహీనతలను అధిగమించి, వివేకంతో సంయమనంతో సమయజ్ఞతతో వ్యవహరించే వాడెప్పుడూ విజేతే అవుతాడు.

ఏ పని ముందు, ఏ పని తరవాత అని ప్రశ్నించుకుంటూ ప్రవర్తించడమే రాజనీతి లక్షణమని వాల్మీకి మహర్షి            ఓ సందర్భంలో  ప్రబోధించాడు.                            కైక తొందరపడి అనాలోచితంగా, అసందర్భంగా దశరథుణ్ని కోరిన రెండు వరాల వల్ల ఎంత అపఖ్యాతి పొందిందో తెలిసిందే. 

శకుని పన్నాగాలకు ప్రభావితుడై దుర్యోధనుడు అనేక తొందరపాటు చర్యల వల్ల ఎంతగా ఎన్నిసార్లు భంగపడ్డాడో తెలియనిదెవరికి?

 ధర్మరాజు రాజసూయ యాగం ప్రారంభించిన సందర్భంలో అగ్రపూజకు వాసుదేవుణ్ని ఆహ్వానించినప్పుడు శిశుపాలుడు ఆవేశంతో, అహంకారంతో, పరమాత్మను దుర్భాషలాడి చావును కొనితెచ్చుకున్నాడు. 

తార చెప్పిన హిత వాక్యాలను పెడచెవిన పెట్టి వాలి అహంకారంతో సుగ్రీవుడితో యుద్ధానికి తలపడి ధర్మమూర్తి శ్రీరామచంద్రుడి చేతిలో హతుడయ్యాడు. 

అనాలోచితంగా, భవిష్యత్తును గురించి ఆలోచించకుండా వేసే ఏ అడుగైనా తొందరపాటు చర్యే అవుతుంది.

 చిన్న చిన్న కారణాలకే దంపతులు విడాకులు తీసుకోవడం, యువత ఆత్మహత్యలకు పాల్పడటం తొందరపాటు వల్లనే.     కొన్ని క్షణాలు ఆలోచించి ‘ఇలా చేయడం అవసరమా?’ అని మనసులో నిదానంగా విశ్లేషించుకుంటే ఇటువంటి అనర్థాలే జరగవు.

ప్రతిదానికీ విపరీతమైన స్పందన, అసందర్భమైన ఉద్రేకం మనిషిని వివేకహీనుణ్ని చేసి దుశ్చర్యలకు ప్రేరేపిస్తాయి. 

ఆధ్యాత్మిక శక్తిగల సాధకుడు  తొందరపడి అనుచిత నిర్ణయాలు తీసుకోడు. ‘ఉరకకు, ఉరకకు మనసా, ఉరికితే దొరకదు హంస’ అన్నారు బుధులు.

ఆలోచన లేని ఆచరణ జీను లేని గుర్రంలాంటిది. ప్రణాళిక లేని కార్యం మొదలుపెట్టడమంటే లోతు తెలియని నీళ్లలో దూకడం లాంటిది.

*కొద్దిపాటి తొందరపాటే కొండంత సమస్యకు దారితీస్తుంది. మనిషి వినడంలో తొందరపడవచ్చు. అవగాహన చేసుకోవడంలో తొందరపడకూడదు. తొందరపాటు శత్రువుకంటే ప్రమాదకరం!


 ➖➖➖✍️







TSWREIS

TGARIEA ONLINE MEMBERSHIP

MATHS VIDEOS

EAMCET/IIT JEE /NEET CLASSES

Top