ఆగస్టు 21 భారత జాతీయ వృద్ధుల దినోత్సవం
వృద్ధుల పట్ల నిరాదరణ తగ్గించేందుకు, వారి సంరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 21ని ‘జాతీయ వృద్ధుల దినోత్సవం’గా ప్రకటించింది. 2007లో తల్లిదండ్రులు, పెద్దల పోషణకు సంక్షేమ చట్టం చేసింది. అమెరికా ,భారత్ మొదలగు దేశాలలో జాతీయ వృద్ధుల దినోత్సవం ఆగష్టు 21న నిర్వహిస్తున్నారు.ప్రపంచంలో అధికదేశాలు ప్రపంచ వృద్ధుల దినోత్సవంను అక్టోబర్ 1న నిర్వహిస్తున్నారు.
జీవిత చక్రంలో బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం సహజం.మానవులు ప్రతి దశలోనూ ఆనందంగా గడపాలని అభిలషిస్తారు. పుట్టి, పెరిగి, బాధ్యతలు మోస్తూ చివరి దశకు చేరుకుంటారు. వారసులకు ఓ బాట చూపించి.. మనవళ్లు, మనవరాళ్లతో కబుర్లు చెబుతూ గడిపే సమయం వృద్దాప్యం.
మనం మనసమాజం 60 ఏళ్ళ దాటినవారిని సీనియర్ సిటిజన్ల ముద్రవేసి వారిని పట్టించు కోవడంలేదు. మనం పనికి మాలిన వాళ్ళలాగా మారిపోతున్నాం. ముసలాళ్ళు ఒక బరువు అనుకుంటున్నాము. ఎంతో విలువైన అనుభవసారాన్ని కోల్పోతున్నాము.
కానీ చాలా దేశాల్లో వృద్ధుల నుంచీ ఎన్నో రహస్యాలు తెలుసు కుంటున్నారు. జీవితంలో వారు గడించిన అనుభవాలను సేకరించి వారివారి రంగాలకు మెరుగులు దిద్దుకుంటున్నారు.
ప్రతీ వృద్ధుని దగ్గరా తాను పనిచేసిన రంగంలో విశేషమైన అనుభవజ్ఞానం ఉంటుంది. దాన్ని సేకరించే విభాగం ఒకటి రావాలి. నిజానికి దీనివల్ల వృద్ధులకు కూడా తమను సమాజం నిర్లక్ష్యం చేస్తోంది అనే భావన పోతుంది. మనకు దాని వల్ల వివిధరంగాలకు కావలసిన అనుభవజ్ఞానం వస్తుంది. ఈ విజ్ఞానం ఎన్ని కోట్ల రూపాయల పరిశోధనలు చేసినా దొరకదు. కేవలం వృద్ధుల దగ్గర మాత్రమే ఉంటుంది.
మహాభారత కురుక్షేత్ర యుద్ధంలో భీష్ముడు 10 రోజులు పోరాడి ఒళ్ళు అంతా బాణాలు గుచ్చుకోగా నేలకు ఒరిగాడు. ఆయన వెంటనే చనిపోకుండా 58 రోజులు అంపశయ్య మీద బ్రతికారు. ఆ 58 రోజుల్లో భీష్ముడిని పాండవులు చూసుకున్న తీరు ఆధునికులు కూడా నేర్చుకోవాల్సిన అంశాలు ఎన్నింటినో తెలుపుతోంది.18 రోజుల యుద్ధంలో 18 అక్షౌహిణుల సైన్యం నాశనం అయ్యాక, దుర్యోధనుడు కూడా చనిపోయాక, ధర్మరాజు పట్టాభిషేకం ద్వారా చక్రవర్తి అయ్యాడు.ఆ సమయంలో వ్యాసుడు, కృష్ణుడు ధర్మరాజుకు అద్భుతమైన సలహా ఇస్తారు. అంపశయ్యపై ఉన్న కురు వృద్ధుడు భీష్ముడు వద్ద అపారమైన జ్ఞాన సంపద ఉందని ఆయన గతిస్తే ఆయనతో పాటే ఆ మహావిజ్ఞానం అంతరిస్తుందని, కనుక వెళ్ళి తాతను సేవించి ఆ మహాజ్ఞానవిషయాలు సలహా ఇస్తారు.వారి సలహా వల్ల భారతంలోనే అతి పెద్ద పర్వం శాంతి పర్వం పుట్టింది. అందులో భీష్ముడు చెప్పిన సకల శాస్త్ర సారాలు, విష్ణుసహస్ర నామం వంటివి మహాధ్భుతాలున్నాయి. కనుక వృద్ధులను సేవించడం వలన సమాజానికి ఎంతో ప్రయోజనం.
వృద్ధాప్య దశలో ఉన్న తల్లిదండ్రుల సలహాలు చాలా మంది పిల్లలకు నచ్చవు. వారిని ఇంట్లో నిరుపయోగంగా ఉన్న ఒక వస్తువులా భావిస్తుంటారు. ఇది వృద్ధులకు శాపం లాంటిది. పిల్లలు తమను పలకరించాలని, తమతో కొంత సమయం గడపాలని వృద్ధులు కోరుకుంటారు. కానీ మారుతున్న కాలం, వేగవంతమైన జీవన విధానం వారిని తెరచాటుకు నెట్టేస్తున్నాయి. వారి త్యాగాలపై నిర్మించుకున్న జీవితాల్లో వారికే చోటు దొరకడం లేదు. ఊతకర్రల సాయంతో నడివీధుల్లోకి ఉన్న అభాగ్యులు ఎందరో..! ఒక్కపూట అన్నం పెట్టలేక, ఆలనా పాలన చూడలేక కొందరిని ఆశ్రమాల్లో వదిలేస్తున్నారు.
వృద్ధాప్యం శరీరానికే గానీ మనస్సుకు కాదు. 60దాటితే మనం వృద్ధులయ్యామనే ఆలోచన మన మనస్సులోకీ రానీయకుండా నిత్యం ఆరోగ్య సూత్రాలు పాటించాలి. ఉదయం నడక, తేలికపాటి వ్యాయామాలు చేయాలి. దైనందిన కార్యకలాపాలలో సమాజసేవ, దైవచింతన భాగంగా చేసుకోవాలి.నిత్యం ఉషారుగా ఉండేడందుకు వ్యాయామంతో పాటు సంగీతం వినడం,మంచి పుస్తకాలు చదవడం చేయాలి.
తమ పిల్లలు తమంత అయ్యారని గ్రహించాలి. వారికి ఆలోచించే శక్తి ఉందని గమనించాలి. వారికి స్వేచ్ఛ ఇవ్వాలి.పిల్లలు స్థిరపడ్డాక కొన్ని విషయాల్లో తలదూర్చ కూడదు. తమ మాటే చెల్లుబాటు కావాలన్న పట్టింపులు వదిలేయాలి. వారు దారి తప్పుతుంటే తగిన సూచనలు ఇవ్వాలి.
పిల్లలు పెద్దలను పెద్దవారుగానే చూడాలిగానీ రోగులుగా చూడరాదు. ప్రస్తుతం 60-70 మధ్య వయస్సు వారిని Young Old అని 70 దాటిన వారిని Old Old గా కేటగిరైజ్ చేసారు.
ప్రభుత్వాలు వృధ్ధులకు ఉపయుక్తంగా ఉండే సంస్కరణలు చేపట్టాలి. వృధ్ధులకు ఉచిత వైద్యం,ఉచిత ప్రయాణ సౌకర్యాలు కల్పించాలి. సూపర్ సీనియర్ సిటిజన్స్ కు గౌరవప్రధమైన జీవనం గడిపే అవకాశాలను కల్పించాలి.
మనదేశంలో పలురాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలలో చాలామంది వృధ్ధులు, వయోవృధ్ధులు పాలకులుగా ఉన్నప్పటికీ వృధ్ధులవిషయంలో సరయిన విధివిధానాలను అమలు చేయాలనే ఆలోచన లేకపోవడం శోచనీయం.
జాతీయ వృద్ధుల దినోత్సవం సందర్భంగా మనదేశంలో ఉన్న 15కోట్లకు పైబడి ఉన్న సీనియర్ సిటిజన్స్ అందరికీ నమస్సులు.