క్రెడిట్ లిమిట్ పెంపుపై పరిమితులు ఇలా
క్రెడిట్ స్కోర్, ఆదాయం, క్రెడిట్ కార్డ్ బిల్లుల చెల్లింపుల ఆధారంగా సంబంధిత క్రెడిట్ కార్డ్ జారీ సంస్థలు తమ కస్టమర్ల క్రెడిట్ లిమిట్ పెంచుతామని చెబుతాయి. కార్డు మోడల్‌తోపాటు ఖర్చు చేసే మొత్తం లిమిట్ పెంపు తదితర అంశాలు ఉంటాయి. గతంలో బ్యాంకులే లిమిట్ పెంచేసేవి. లిమిట్ పెంచడంతోపాటు కొత్త క్రెడిట్ కార్డులను కస్టమర్లకు పంపేవి. కానీ, ఇక నుంచి కస్టమర్ల అనుమతి లేకుండా లిమిట్ పెంచడానికి వీల్లేదు. కస్టమర్ అనుమతి లేకుండా లిమిట్ పెంచినందుకు కొత్త క్రెడిట్ కార్డు జారీ చేసి, బిల్లు వసూలు చేయడానికి కుదరదని ఆర్బీఐ తెలిపింది. అలా చేస్తే సంబంధిత క్రెడిట్ కార్డు యజమాని ఆర్బీఐ అంబుడ్స్‌మెన్‌ను ఆశ్రయించి ఫిర్యాదు చేయొచ్చు. అనుమతి లేకుండా క్రెడిట్ కార్డు లిమిట్ పెంచి చార్జీలు వసూలు చేసినందుకు సంబంధిత క్రెడిట్ కార్డుల జారీ సంస్థలు రెట్టింపు చెల్లించాల్సి ఉంటుంది.
బిల్లింగ్.. పేమెంట్ తేదీ మార్చుకునే వీలు ఇలా
సాధారణంగా క్రెడిట్ కార్డు సంస్థలు తమ నిబంధనల అన్ని క్రెడిట్ కార్డుల బిల్లుల చెల్లింపు తేదీ ఒక్కటే ఉండేందుకు అంగీకరించవు. ఫలితంగా వివిధ క్రెడిట్ కార్డుల బిల్లుల చెల్లింపు తేదీలు వేర్వేరుగా ఉంటాయి. కానీ మారిన నిబంధన ప్రకారం కస్టమర్లు తమ వెసులుబాటును బట్టి తమ క్రెడిట్ కార్డ్ బిల్లు సైకిల్, చెల్లింపు తేదీని ఒకసారి మార్చుకునేందుకు అనుమతించాలని క్రెడిట్ కార్డు జారీ సంస్థలను ఆదేశించింది.
సత్వరం క్రెడిట్ బిల్లులు జారీ చేయాలి
క్రెడిట్ కార్డు బిల్లుల ఇన్‌వాయిస్‌లు ఆలస్యంగా వస్తున్నాయని కస్టమర్ల నుంచి ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో ఇక నుంచి క్రెడిట్ కార్డు బిల్లులను సత్వరం జారీ చేయాలని ఆయా సంస్థలకు ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. క్రెడిట్ కార్డు ఏడాది లోపు వినియోగించకుంటే, దాన్ని రద్దు చేసే అధికారం బ్యాంకులకు, ఎన్బీఎఫ్‌సీలకు ఉంటుంది. అయితే, 30 రోజుల ముందు సంబంధిత కస్టమర్‌కు నోటీసులు జారీ చేయాలి. అప్పటికీ కస్టమర్ స్పందించకపోతే ఆ క్రెడిట్ కార్డు రద్దవుతుంది.
వారంలోగా క్రెడిట్ కార్డు యాక్టివేషన్
క్రెడిట్ కార్డు కస్టమర్ చేతికి అందిన వారం లోగా యాక్టివేట్ చేసుకోవాలి. అలా చేసుకోకపోతే ఓటీపీ ద్వారా యాక్టివేట్ చేసుకోవాలని సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. అప్పటికీ యాక్టివేట్ చేసుకోకపోతే, నోటీసు జారీ చేసిన తర్వాత వారం రోజులకు సంబంధిత క్రెడిట్ కార్డును రద్దు చేసే అధికారం బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు, క్రెడిట్ కార్డు జారీ సంస్థలకు ఉంటుంది.
కనీస బిల్లు చెల్లింపుతో ఇదీ సమస్య
క్రెడిట్ కార్డు యూజర్లలో చాలా మంది కనీస మొత్తం బిల్లు మాత్రమే చెల్లిస్తుంటారు. అది క్రెడిట్ కార్డు బాకీలో ఐదు శాతమే. కానీ కనీస మొత్తం బిల్లు మాత్రమే చెల్లిస్తుండటం వల్ల మిగతా మొత్తం బాకీపై అధిక వడ్డీ పడుతూ ఉంటుంది. ఇలా ప్రతి నెలా కనీసమొత్తం బిల్లు చెల్లించడం వల్ల వారు తమ బకాయి మొత్తం చెల్లించడానికి కొన్నేండ్లు పడుతుంది. కనుక ఈ విషయమై కస్టమర్లకు క్రెడిట్ కార్డుల తయారీ సంస్థలు ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలని ఆర్బీఐ సూచించింది.
క్రెడిట్ కార్డుపై బీమాతో ఇలా బెనిఫిట్
ఒక్కోసారి మన జేబులో ఉన్న క్రెడిట్ కార్డు ఎక్కడో పడిపోతుంది. ఇటువంటప్పుడు అనధికారిక లావాదేవీలు జరిగినప్పుడు నష్టాల పాలయ్యే అవకాశాలే ఎక్కువ. ఈ భారాన్ని తట్టుకోవడానికి బీమా పాలసీ చేయించడం ఉత్తమం అని ఆర్బీఐ సూచిస్తున్నది. ఒక క్రెడిట్ కార్డుపై జరిగే మోసపూరిత.. ఫ్రాడ్ లావాదేవీలకు సంబంధిత కస్టమర్ గానీ, ఆ క్రెడిట్ కార్డు జారీ సంస్థ గానీ బాధ్యత వహించవు. దీనికి బీమా సంస్థలు బాధ్యత వహిస్తాయి. అయితే, క్రెడిట్ కార్డు పడిపోయిన మూడు రోజుల్లో బ్యాంకులో రిపోర్ట్ చేస్తేనే, క్రెడిట్ కార్డు కస్టమర్లు తమకు జరిగే నష్టం నుంచి బయటపడతారు. అప్పుడే ఫ్రాడ్ లేదా మోసాల నుంచి బీమా పరిహారం కోరే హక్కు లభిస్తుంది.
వారంలోపే క్రెడిట్ కార్డు రద్దు చేసుకోవాలి
ఒక్కోసారి క్రెడిట్ కార్డు వాడకం దారులు తమ క్రెడిట్ కార్డులను రద్దు చేసుకోవాలని నిర్ణయానికి వస్తారు. ఆ ప్రక్రియను వారంలోగా పూర్తి చేయాలి. అలా చేయకుంటే ఎనిమిదో రోజు నుంచి రూ.500 ఫైన్ చెల్లించాలి. కార్డు యజమాని పూర్తిగా బకాయి ప్లస్ ఫైన్ చెల్లించినప్పుడే సదరు క్రెడిట్ కార్డు రద్దవుతుంది.
క్రెడిట్ కార్డు వివరాలిలా.
ఇక క్రెడిట్ కార్డు వివరాలన్నీ ఒక్క పేజీలోనే ఇవ్వాలని ఆర్బీఐ ఆదేశించింది. క్రెడిట్ కార్డుల వాడకంపై చార్జీలు, బిల్లింగ్, బిల్లుల బదిలీ తదితర వివరాలన్నీ తెలియజేయాలి. వాటి వినియోగంపై చార్జీలు పెరిగితే 30 రోజుల ముందు కస్టమర్లకు సమాచారం ఇవ్వాలి. కొత్త చార్జీలు భారం అనుకుంటే సంబంధిత యూజర్ తన క్రెడిట్ కార్డు రద్దు చేసుకోవచ్చు. అందుకు కారణాలు వివరిస్తూ క్రెడిట్ కార్డును రద్దు చేయాలని కోరాలి. ఒక్కోసారి వారి సిబిల్ స్కోర్ తక్కువగా ఉండొచ్చు. అటువంటి సందర్భాల్లో క్రెడిట్ స్కోర్ పెంచుకోవడానికి చర్యలు తీసుకునే వీలుంది