Neeraj Chopra: ఇది అతడి
శకం
1 ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో రజతం గెలిచిన తొలి భారత అథ్లెట్ నీరజ్. పతకం నెగ్గిన తొలి పురుష అథ్లెట్ అతనే. గతంలో అంజుబాబి (2003) లాంగ్‌జంప్‌లో కాంస్యం దక్కించుకుంది.
ఈ ఏడాది ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో కచ్చితంగా పతకం వస్తుందనే నమ్మకం.. ఎందుకంటే అతనున్నాడు.
కొన్ని క్రీడాంశాల్లో ఇతర భారత అథ్లెట్లు ఫైనల్ చేరినా పోడియంపై నిలబడలేకపోయారు. అయినా ఆందోళన లేదు.. ఎందుకంటే అతనున్నాడు.
39 ఏళ్ల ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్ చరిత్రలో.. ఈ ఏడాది ముందు వరకూ భారత్ గెలిచింది ఒక్క పతకమే. కానీ ఈ సారి లెక్క మారుతుందనే భరోసా.. ఎందుకంటే అతనున్నాడు.
అవును.. నీరజ్ వచ్చాడు. నమ్మకాన్ని నిలబెట్టాడు. నిట్టూర్పుల్ని దాటి ఆశలు రేకెత్తించాడు. ఆందోళనను పోగొట్టి ఆనందాన్ని పంచాడు. మరోసారి దేశం ఉప్పొంగేలా చేశాడు. టోక్యో ఒలింపిక్స్ జోరును కొనసాగించి ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో దేశానికి తొలి రజతాన్ని అందించాడు. ఇకపై భారత క్రీడా రంగంలో తన పేరే ప్రధాన ఆకర్షణగా నిలవడం ఖాయం.
ఈనాడు క్రీడావిభాగం: ముళ్ల బాటలో ప్రయాణం మొదలుపెట్టి గెలుపు గమ్యాన్ని చేరడం అందరి వల్లా సాధ్యమయ్యే పని కాదు. నీరజ్ చోప్రా లాంటి అతి కొద్ది మందే ఆ పని చేయగలరు. లేదంటే ఒలింపిక్స్‌లో.. అదీ అథ్లెటిక్స్‌లో పతకమా? అవకాశమే లేదు అనే సందేహాలను అతను పటాపంచలు చేయగలడా? ప్రపంచ అథ్లెటిక్స్‌లో మరోసారి నిరాశ తప్పకపోవచ్చు అనే మాటలకు పతకంతో జవాబు చెప్పగలడా? స్వతంత్ర భారతావనికి గతేడాదికి ముందు ఒలింపిక్స్ అథ్లెటిక్స్‌లో ఒక్క పతకమూ లేదు. మొత్తంగా అన్ని క్రీడల్లో కలిపితే వ్యక్తిగత విభాగంలో ఉన్నది ఒక్కటే స్వర్ణం. అలాంటి పతకం ఇంకోటి, అందులోనూ అథ్లెటిక్స్‌లో ఊహించడం కూడా సాహసం అనుకునే దశలో.. టోక్యో ఒలింపిక్స్‌లో సంచలన ప్రదర్శనతో పసిడి పట్టేసిన అతను నవ శకానికి నాంది పలికాడు. ఒలింపిక్స్ కంటే కఠినమైన పోటీ ఉండే ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో ఇప్పుడు వెండి పతకంతో మరోసారి చరిత్ర సృష్టించాడు. ఇప్పటికే భారత క్రీడా రంగంలో ప్రత్యేకంగా నిలిచిపోయిన ఈ హరియాణా అథ్లెట్ పేరు ఇకపై మరింత మార్మోగుతుందనడంలో సందేహం లేదు.
ఇప్పుడు అతనే..: బ్యాడ్మింటన్‌లో సింధు..
ఇప్పుడు అతనే..: బ్యాడ్మింటన్‌లో సింధు.. బాక్సింగ్‌లో మేరీకోమ్.. రెజ్లింగ్‌లో సుశీల్ కుమార్.. కొన్నేళ్లుగా దేశవ్యాప్తంగా క్రీడల్లో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లివి. వీళ్లు అటు ఒలింపిక్స్‌తో పాటు ఇటు ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లోనూ పతకాలతో సత్తాచాటడమే అందుకు కారణం. ఇప్పుడిక నీరజ్ వంతు వచ్చిందనే చెప్పాలి. అథ్లెటిక్స్‌లో అసాధ్యమనుకున్న విజయాలను సాధిస్తున్న అతను ఇప్పుడు సూపర్ స్టార్. అత్యున్నత పోటీల్లో తన అత్యుత్తమ ప్రదర్శనతో జావెలిన్ త్రోకు దేశంలో ఆదరణ పెంచుతున్నాడు. అథ్లెటిక్స్‌కు సరికొత్త మార్గాన్ని చూపిస్తున్నాడు. దివంగత మిల్కాసింగ్, పీటీ ఉష, అంజుబాబీ జార్జ్.. ఇలా అథ్లెటిక్స్‌లో భారత్ నుంచి మహామహులున్నారు. కానీ నీరజ్ మాత్రం వీళ్లందరి కంటే ప్రత్యేకం అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అందుకు ఇప్పటికే అతను సాధించిన విజయాలు నిదర్శనం. అథ్లెటిక్స్‌కే ఆకర్షణగా నిలుస్తున్న అతని ప్రదర్శనే కారణం. 2016 ప్రపంచ జూనియర్ ఛాంపియన్‌షిప్స్‌లో స్వర్ణంతో వెలుగులోకి వచ్చిన అతను.. కామన్వెల్త్, ఆసియా క్రీడల్లోనూ ఛాంపియన్‌గా నిలిచాడు. 2017 ఆసియా ఛాంపియన్‌షిప్స్‌లోనూ పసిడి సొంతం చేసుకున్నాడు.
అదే తపన..: గతేడాది టోక్యో ఒలింపిక్స్‌లో 87.58మీ. ప్రదర్శనతో అతను ఛాంపియన్‌గా నిలిచాడు. ఇప్పుడా విజయం గాలివాటం కాదని చాటుతూ ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో వెండి పతకం పట్టేశాడు. ఒలింపిక్స్ స్వర్ణంతో ఒక్కసారిగా అతనికి పేరు, డబ్బు వచ్చి పడ్డాయి. తన గురించి ప్రపంచానికి తెలిసింది. ఆదరణ పెరిగింది. ఇలా ఒక్కసారిగా వచ్చిన పేరు, ప్రఖ్యాతుల కారణంగా ఆటపై ఏకాగ్రత చెదిరి, ప్రదర్శన దిగజారి విఫలమైన క్రీడాకారులు ఎంతో మంది ఉన్నారు. కానీ నీరజ్ అలా కాదు. ఆటపై తన తపన పెరిగిందే తప్ప తగ్గలేదు. తన ధ్యాస మరల్లేదు. దృష్టి చెదరలేదు. గమ్యం మారలేదు. నిరంతరం మెరుగవడమే లక్ష్యంగా సాగుతున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే రెండు సార్లు జాతీయ రికార్డును మెరుగు పరుచుకున్నాడు. డైమండ్ లీగ్‌లో తన అత్యుత్తమ వ్యక్తిగత ప్రదర్శన (89.94మీ) అందుకున్నాడు. ఇప్పుడు ఒలింపిక్స్‌లో కంటే మెరుగైన ప్రదర్శన చేసినా ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో రెండో స్థానంలో నిలిచాడు. ఈ ఆర్మీ సుబేదార్ విదేశాల్లో ఉత్తమ శిక్షణలో క్రమంగా వృద్ధి సాధిస్తున్నాడు. 90 మీటర్ల దూరాన్ని అందుకుని.. వచ్చే ఒలింపిక్స్‌లో పసిడి నిలబెట్టుకోవాలనే ధ్యేయంతో ఉన్నాడు. వచ్చే ఏడాది బుడాపెస్ట్‌లో జరిగే ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో పతకం రంగు మారుస్తాననే ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. చూద్దాం.. అతను ఇంకెన్ని అద్భుతాలు ఆవిష్కరిస్తాడో!
ఫైనల్లో వాతావరణం సవాలుగా నిలిచింది. ముందు వైపు నుంచి గాలి బలంగా వీచింది. దీనికి తోడు తీవ్రమైన పోటీ. ఇంతటి ఒత్తిడి ఎప్పుడూ ఎదుర్కోలేదు. అయినా సరే ఓ మంచి త్రో కచ్చితంగా వేయగలననే నమ్మకంతో ఉన్నా. తొలి మూడు ప్రయత్నాల్లో అనుకున్నట్లు ఈటెను విసరలేకపోయా. కానీ నాలుగో త్రో ఊహించినట్లుగా పడింది. ఈ త్రో వేసిన తర్వాత తొడ భాగంలో ఏదో ఇబ్బందిగా అనిపించి చివరి రెండు ప్రయత్నాల్లో ఫౌల్ చేశా. రజతం చాలా సంతోషాన్నిచింది. ఏ అథ్లెటైనా ప్రతిసారీ స్వర్ణం గెలవలేడు. 2023 బుడాపెస్ట్ క్రీడల్లో మరింత మెరుగైన ప్రదర్శన చేసి పతకం రంగు మార్చడానికి ప్రయత్నిస్తా.- నీరజ్ చోప్రా
అప్పుడు అంజు..
ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో దేశానికి తొలి పతకం అంజు బాబి జార్జ్ అందించింది. 2003 పారిస్ ఛాంపియన్‌షిప్స్‌లో ఆమె మహిళల లాంగ్‌జంప్‌లో కాంస్యం సాధించింది. 6.70 మీటర్ల దూరం దూకి మూడో స్థానంలో నిలిచింది. మళ్లీ ఇన్నేళ్లకు ఈ ఛాంపియన్‌షిప్స్‌లో నీరజ్ దేశానికి పతకం సాధించి పెట్టాడు.
ప్రపంచ అథ్లెటిక్స్‌లో రజతం గెలిచిన నీరజ్ చోప్రాకు అభినందనలు. దేశ క్రీడల్లో ఇదో ప్రత్యేక ఘట్టం. భవిష్యత్‌లో నీరజ్ మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నా. - ప్రధాని మోదీ
నీరజ్ ప్రదర్శన చూసి పులకరించిపోయా. అతను ఏ స్థితి నుంచి పతకం గెలిచాడో 2003 పారిస్ క్రీడల్లో నాదీ అదే పరిస్థితి. మూడు రౌండ్ల తర్వాత నాలుగో స్థానం ఉన్నా. చోప్రా కూడా నాలాగే పతకం గెలవాలనే దృఢ సంకల్పంతో పుంజుకుని పోడియంపై నిలిచాడు. సులభంగా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతే ఛాంపియన్ అథ్లెట్ కాలేరు. - అంజు బాబి జార్జి