మనస్సు చంచలమైనది. అది నిరంతరం ఏదో ఒక దానిని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అలాంటి మనస్సును స్వేచ్ఛగా వదిలేస్తే ఇంద్రియాలకు అధీనమైపోతుంది. కామక్రోధాదులను బలపరుస్తుంది. అహంకార మమకారాలను వృద్ధి చేస్తుంది. ఈ క్రమంలో ఇంద్రియాలకు లాలసుడైన మనిషి విచక్షణను కోల్పోయి క్షణిక సుఖాలకు దగ్గర అవుతాడు.
దీంతో అతని అభివృద్ధి నిలిచిపోయి అథః పాతాళంలోకి పడిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే మనస్సును ఎప్పటికప్పుడు విమర్శ చేసుకొంటూ ఇంద్రియ వశం కాకుండా మంచి పనులు మాత్రమే చేయాలనే నిబద్ధతతో సత్సాంగత్యం తో మనసును అదుపులో పెట్టుకోవాలి. అలా మనస్సును అధీనంలో ఉంచుకోవడమే మనో నిగ్రహం. మనోస్థైర్యం దానికి ఆలంబన.
చంచలమైన మనస్సును నిశ్చలంగా చేయడం సాధారణమైన విషయం కాదు. సామాన్యులకే కాదు, అత్యంత శూరుడైన అర్జునికి కూడా మనస్సును నిగ్రహించుకోవడం సాధ్యం కాలేదు. యుద్ధంలో ప్రతిపక్షం మీద దృష్టి సారించి తన తాత భీష్ముడు, గురువు ద్రోణాచార్యుడు, గురుపుత్రుడు అశ్వత్థామ, దాయాదులైన కౌరవ సోదరులను చూసి విషాదంలో పడిపోయాడు. వారంతా తన స్వజనం కావడంతో యుద్ధం చేయడానికి అతనికి మనస్కరించలేదు. దాంతో అతని మనస్సు నిగ్రహాన్ని కోల్పోయింది. ధనుర్బాణాలు పక్కన పడేసి, నైరాశ్యంలో కూరుకుపోయాడు.
ఇది గమనించిన శ్రీ కృష్ణుడు అర్జునుణ్ణి యుద్ధానికి సన్నద్ధం చేయడానికి ఎంతో శ్రమ పడాల్సి వచ్చింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 18 అధ్యాయాలుగా ఉండే భగవద్గీతను బోధించాడు. భౌతికమైనవి, తాత్వికమైనవి అనేకానేక విషయాలు తాను గురువుగా మారి అర్జునునికి బోధించాడు. దాంతో అర్జునుడు శత్రువులను సంహరించడానికి సిద్ధపడ్డాడు. అర్జునుడు మనోనిగ్రహాన్ని తిరిగి పొందడం వల్లనే తిరిగి తన ధర్మాన్ని తాను నిర్వర్తించాడు.
దీనినే మనం నిత్య జీవిత పోరాటంలో పాఠంగా మలచుకోవాలి. ఆ పాఠం మనల్ని సత్య సంధులుగా, న్యాయపరులుగా, నీతివేత్తలుగా తీర్చిదిద్దుతుంది. అందుకే భగవద్గీతను కంఠోపాఠంగా కాకుండా జీవన వెలుగు దివిటీగా చేసుకోమంటారు పెద్దలు.
ప్రవరాఖ్యుడికున్నంత మనోనిగ్రహం అందరికీ ఉండాలన్నది శాస్త్ర వచనం. ప్రవరాఖ్యుడు ఒకసారి హిమాలయాలు చూడడానికి వెళ్ళాడు. సిద్ధుడిచ్చిన లేపనం అక్కడ కరిగి పోయింది. కష్టకాలం వచ్చింది. అక్కడ అమిత సౌందర్యవతి అయిన గంధర్వ కాంత కనిపించింది. ఆమెను దారి చెప్పమని ప్రవరాఖ్యుడు అడిగాడు. కానీ ఆమె అతనిని తనను వివాహమాడమని తియ్యని మాటలెన్నో చెప్పింది. ప్రవరాఖ్యుడు ఆమె మాటలకు చలించలేదు. అందాలు ఆరబోసి అతనిని రెచ్చగొట్టినప్పటికీ అతడు నిగ్రహాన్ని విడిచిపెట్టకుండా తన భార్యను, బంధువులను గుర్తు పెట్టుకున్నాడు. ప్రవరాఖ్యుడి వలెనే అందరూ మనో నిగ్రహంతో ముందుకు వెళ్ళాలంటోంది సనాతన ధర్మం.
అయితే దీనిని భక్తిమార్గంలో నడవడం వల్లనే సులువుగా సాధించవచ్చు. మనో నిగ్రహం అలవడితే దివ్యశక్తి ఆవహిస్తుంది. సద్గుణ సంపన్నులు అవుతారు. భక్తి, జ్ఞాన, వైరాగ్య భావనలు కలిగి, సమదృష్టి అలవడుతుంది. ఆత్మజ్ఞానాన్ని అవగతం చేస్తుంది.
మనోనిగ్రహం ఆధ్యాత్మిక సాధనకు అత్యవసరం. లౌకిక విషయాల సాధనకు కూడా మనో నిగ్రహం అవసరం. అలాంటపుడే మనిషి సజ్జనుడిగా నలుగురిలో కీర్తింపబడతాడు. చంచల చిత్తమైన మనస్సును, విషయ లోలత్వం నుంచి మరల్చి ఆత్మయందే స్థాపితం చేసి ఆత్మకు సర్వదా అధీనమై ఉండేటట్లు చేయాలని భగవద్గీతతో సహా ఇంచుమించు ఇతర మతగ్రంథాలన్నీ ప్రబోధించాయి. మనస్సును జయిస్తే చాలు. ముల్లోకాలను జయిస్తారు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనేవి అదుపులో ఉంటాయి. దుర్గుణాలు సద్గుణాలుగా మారి శాంతి సౌఖ్యాలనిస్తాయి.
అయితే ఆత్మనిగ్రహానికి ఆత్మ స్థైర్యానికి అవినాభావ సంబంధం ఉంది. ఆత్మస్థైర్యం ఉన్న మనిషికి ఆత్మ నిగ్రహం ఏర్పడుతుంది. ఆత్మ పట్ల నమ్మకం, విశ్వాసం ప్రోది చేసుకున్న వ్యక్తి ఆత్మ స్థైర్యాన్ని సంపూర్ణంగా కైవసం చేసుకోవచ్చు. స్వార్థరహితమైన మనసు, ప్రవృత్తి, వ్యాపకం వంటివి మనిషి ధీరోదాత్తతకు ఉపకరణాలు. ఏ ప్రలోభాలకూ లొంగని స్వభావం వల్ల మనిషి ఆత్మస్థైర్యాన్ని సంతరించుకుంటాడు. దైవం పట్ల ప్రత్యేక శ్రద్ధ లేకపోయినప్పటికీ తన పట్ల గురి, నమ్మకం ఉన్న వ్యక్తి ఆత్మస్థైర్య సంభూతుడే అవుతాడు. ప్రతిభ ఉండీ పిరికితనం వల్ల మనిషి చాలా పోగొట్టుకుంటాడు. ఆత్మస్థైర్యం మనిషి శక్తి సామర్థ్యాలను ద్విగుణీకృతం చేస్తుంది.
ఆత్మ స్థైర్యం ఓ బలవర్ధక పానీయం వంటిది. అది పిరికితనాన్ని పారదోలుతుంది. విద్యార్జనకు, ఆరోగ్యసాధనకు తోడ్పడుతుంది. భిన్నత్వం గల సమాజంలో ఏకతా భావన సాధించేందుకు తగిన బలాన్ని ఇస్తుంది. ఆధ్యాత్మిక సాధన లో సైతం ముందుకు సాగేందుకు తోడ్పడుతుంది. అందువల్ల జీవితంలో ఉన్నత సోపానాలను అధిరోహించాలనుకునే ప్రతి వ్యక్తి ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకుంటే ఆత్మనిగ్రహం దానికదే సొంతమవుతుంది.
ఆత్మనిగ్రహానికి ఆత్మ స్థైర్యానికి అవినాభావ సంబంధం ఉంది. ఆత్మస్థైర్యం ఉన్న మనిషికి ఆత్మ నిగ్రహం ఏర్పడుతుంది. ఆత్మ పట్ల నమ్మకం, విశ్వాసం ప్రోది చేసుకున్న వ్యక్తి ఆత్మ స్థైర్యాన్ని సంపూర్ణంగా కైవసం చేసుకోవచ్చు. స్వార్థరహితమైన మనసు, ప్రవృత్తి, వ్యాపకం వంటివి మనిషి ధీరోదాత్తతకు ఉపకరణాలు. ఏ ప్రలోభాలకూ లొంగని స్వభావం వల్ల మనిషి ఆత్మస్థైర్యాన్ని సంతరించుకుంటాడు.
– దాసరి దుర్గాప్రసాద్