‘పఠనం..’ ఓ ఔషధం...
పుస్తకాలు చదవడంతో మనోవ్యాధులకు చికిత్స
ఒంటరితనం దూరమవుతుంది
నిపుణులు, సర్వేల మూకుమ్మడి మాట ఇదే..
పుస్తక పఠనంతో వైద్యం చేయడం అసాధారణం కాదు. విదేశాల్లో అమలులో ఉన్న ఈ పద్ధతిని ‘బిబ్లియోథెరపీ (గ్రంథ చికిత్స)’ అంటారు. మానసిక వైద్యంలో ఇది కూడా ఒక భాగం. ఆందోళన, నిరాశ, దుఃఖంతో బాధపడడం వల్ల శరీరంలో పలురకాల హానికారక క్రియలు జరిగి అనారోగ్యాలకు దారితీస్తాయి. వీటికి విరుగుడుగా.. పుస్తకాలు చదివితే.. వాటిలోని సారాంశం ద్వారా సమాచారం, మద్దతు, మార్గదర్శకత్వం లభించి జీవనశైలి మెరుగుపడుతుంది. ఆయా ఇతివృత్తాల్లో పాఠకులు తమను తాము ఊహించుకోవడం ద్వారా ఉపశమనం పొందుతారు. కొన్ని విషయాలను వారి వ్యక్తిగత జీవితాలకూ అన్వయించుకుని మనోనిబ్బరం సాధించేందుకు వీలుంటుంది.
దివ్య ఔషధం
గతంలో యువకుల నుంచి వృద్ధుల వరకూ చదువొచ్చిన వారి చేతుల్లో పుస్తకాలు కనిపించేవి. ప్రయాణాల్లో, తీరిక సమయాల్లో ప్రశాంతంగా పుస్తకాలు చదువుకునేవారు. ఈ అలవాటుకు టీవీలు బ్రేకులు వేస్తే.. తర్వాత వచ్చిన సెల్‌ఫోన్లు ఏకంగా అడ్డుకట్టలే కట్టేశాయి. ఈ పరిస్థితులే అనేక ఒత్తిడులకు కారణమవుతున్నాయని, వాటికి మంచి పుస్తక పఠనం దివ్య ఔషధం అని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు.
6 నిమిషాల పఠనంతో 60 శాతం ఒత్తిడి మాయం
ప్రతిరోజు కనీసం ఆరు నిమిషాలు పుస్తకం చదివితే హృదయ స్పందనతో పాటు కండరాలపై ఒత్తిడిని 60 శాతం వరకు తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు. సంగీతం, టీ తాగడం, నడక, వీడియోగేమ్‌లు ఆడడం వంటి వాటి కంటే.. ఒత్తిడిని ఎదుర్కోవడానికి పుస్తకపఠనం మంచిదని యూకేలోని ‘ససెక్స్’ విశ్వవిద్యాలయం గతంలో నిర్వహించిన పరిశోధనలో తేలింది. రక్తపోటు, హృదయ స్పందనరేటు, మనోవేదన.. పుస్తక పఠనం ద్వారా వేగంగా తగ్గుతాయని అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ నిర్వహించిన పరిశోధన వెల్లడించింది. ప్రపంచ చరిత్ర, క్లాసిక్ నవలలు, లేదా థ్రిల్లర్.. ఏదైనా కావచ్చు. ప్రతి పఠనం మెదడుకు ఔషధం అని నిపుణులు సూచిస్తున్నారు.
మనోమాలిన్యాలను తొలగిస్తుంది..
- డా.బి.ఆర్.అంబేడ్కర్
ఎవరి పని ఒత్తిడిలో వారున్న సమయంలో మాట్లాడేవారే కరవైపోయారని కుంగిపోకుండా.. పుస్తకం అమ్మలా లాలిస్తుంది. నాన్నలా ధైర్యాన్నిస్తుంది. గురువులా బోధిస్తుంది. మార్గదర్శి అవుతుంది. ముఖ్యంగా ఒంటరితనంలో స్నేహితుడై ఓదార్పునిస్తుంది. పుస్తకం దీపంలా వెలుతురునిచ్చి మనోమాలిన్యమనే చీకటిని తొలగిస్తుంది.
కాలక్షేపం కాదు.. మార్గదర్శనం
* పుస్తకాలు చదవడం కాలక్షేపం కాదు. పఠనంతో మానసిక పరిధి విస్తరిస్తుందని రకరకాల పరిశోధనలు తేల్చి చెప్పాయి. లక్ష్యాన్ని నిర్దేశించుకునే స్పృహతో పాటు సాధించాలనే పట్టుదల పెరుగుతుంది. బాల్యం నుంచే పుస్తక పఠనం అలవాటు చేయాలి.
* పుస్తకాలు చదవని వారితో పోలిస్తే.. చదివే వారు లోకజ్ఞానంలోనే కాదు.. రకరకాల సామర్థ్యాలలోనూ మెరుగైన ప్రతిభ కలిగి ఉన్నారని బ్రిటన్‌లోని నేషనల్ లిటరసీ ట్రస్ట్ సర్వేలో తేలింది.
* పుస్తకాలు చదవడం వల్ల విజ్ఞానంతోపాటు మంచి నడవడిక అలవడుతుంది. క్రమం తప్పకుండా పుస్తకం చదివే వ్యక్తి మానసిక ఆరోగ్య సమస్యలకు దూరంగా ఉంటారు. పదిమందిలో ఆకర్షించేలా మాట్లాడే నైపుణ్యంతో పాటు.. విషయ పరిజ్ఞానంతో మాట్లాడతారు. చర్చలలో వాదన నైపుణ్యం పెరుగుతుంది. క్లిష్టమైన సమస్యలకు సులువైన పరిష్కారాలను గుర్తించగలుగుతారు.
సర్జన్‌గా సుదీర్ఘ అనుభవం ఉన్న ఓ వైద్యుడు.. ఆరోగ్య సమస్యల కారణంగా మానసిక బలహీనతకు లోనయ్యారు. ఆయనలో ఎన్నడూ చూడని కోపం, విసుగు, చిరాకు మొదలైంది. నిద్రపోవడం, ఉదయం లేవడమూ కష్టంగా మారింది. దీంతో ఆసుపత్రికి వెళ్లడం, ఆపరేషన్లు చేయడం కూడా క్లిష్టంగా అనిపించేవి. మిత్రులు, కుటుంబ సభ్యులు మాట్లాడినా పెద్దగా ఫలితం కనిపించలేదు. ఆ తర్వాత నిర్దిష్ట దినచర్య, పుస్తక పఠనం.. ఆయన్ను మళ్లీ మామూలు మనిషిని చేసింది.
నగరానికి చెందిన ఒక ఉద్యోగిని.. భర్త వేధింపులు భరించలేక విడాకులు తీసుకున్నారు. తర్వాత ఒంటరిగా, ప్రశాంతంగా జీవించాలని నిర్ణయించుకున్నారు. కానీ ఆమె కుటుంబం అందుకు ఒప్పుకోలేదు. భర్త వల్ల మానసికంగా, శారీరకంగా, హింసకు గురైన ఆమె.. కుటుంబసభ్యుల సహకారం కూడా లేక మరింత వేదనకు గురయ్యారు. ఉపశమనం కోసం మానసిక వైద్యురాలిని ఆశ్రయించారు. చికిత్స ప్రారంభించిన డాక్టర్.. అందులో భాగంగా బాధితురాలికి ఒక పుస్తకం ఇచ్చి చదవమని సూచించారు. క్రమేణా రోజూ ఎక్కువ సమయం పుస్తక పఠనంలో గడిపేలా చేశారు. దీనివల్ల క్రమంగా ఆమె మనోవేదనను మరిచిపోయి.. పఠనంలోని ఆనందాన్ని ఆస్వాదించే స్థాయికి చేరుకున్నారు. ఈ ప్రక్రియ వల్ల ఆమె దృక్పథంలో చాలా మార్పు వచ్చింది. మానసిక బలహీనతస్థాయి నుంచి దృఢవైఖరి, గుండెనిబ్బరం అలవరచుకోగలిగారు.
అన్నింటి నుంచీ విరామం
మీరు చదువుతున్నప్పుడు మీ దృష్టి అంతా పుస్తకంపైనే ఉంటుంది. బాహ్య, అంతర్గత ఆలోచనలు ఆగిపోతాయి. ఒకే ఎజెండాను కలిగి ఉన్నప్పుడు మెదడులోని అన్ని ఇతర భాగాలు పునరుజ్జీవం పొందే అవకాశం కలుగుతుంది. అన్ని ప్రతికూల ఆలోచనల వడపోత జరుగుతుంది. అందుకే ధ్యానానికి మించిన ప్రత్యామ్నాయంగా కొంతమంది పుస్తకాలు చదివి ఒత్తిడి నుంచి బయట పడతారు.
- డా. కృష్ణసాహితి, మానసిక వైద్యురాలు
పుస్తక పఠనంతో ఏకాగ్రత
- డా.ఎన్.ఎన్.రాజు, భారత మానసిక వైద్య సంఘం జాతీయ అధ్యక్షుడు
పుస్తక పఠనంతో ఏకాగ్రత సాధ్యమవుతుంది. అనుభూతి పొందడం అలవడుతుంది. ఏకాగ్రత పెరిగితే అధిక విషయాలను ఆకళింపు చేసుకోవడం సాధ్యమవుతుంది. సంభాషణ నైపుణ్యాలు పెరుగుతాయి. దీంతో సమాజంలో గుర్తింపు లభిస్తుంది. ఆందోళన, దిగులు వంటి మానసిక రుగ్మతలకు, వయసు ప్రభావం, ఇతర కారణాలతో వచ్చే జ్ఞాపకశక్తి క్షీణతకు పుస్తక పఠనంతో అడ్డుకట్ట వేయవచ్చు. ప్రశాంతంగా పుస్తకం చదివితే నరాలన్నీ విశ్రాంతి పొందుతాయి.