శాక ప్రొటీన్
ప్రొటీన్ అనగానే మాంసాహారమే గుర్తుకొస్తుంది. కానీ శాకాహారమూ తక్కువదేమీ కాదు. శనగలు, కందులు, పెసర్ల వంటి పప్పులు.. బాదం, జీడిపప్పు వంటి గింజపప్పులు.. కొర్రలు, సామల వంటి చిరుధాన్యాల్లో ప్రొటీన్ దండిగా ఉంటుంది. ఉదాహరణకు- 100 గ్రాముల బాదంపప్పుతో 21 గ్రాముల ప్రొటీన్ లభిస్తుంది. పైగా విటమిన్ ఇ, మెగ్నీషియం, రైబోఫ్లావిన్, జింక్ వంటి 15 పోషకాలూ అదనం. బాదం పప్పు మంచి చిరుతిండిగానూ పనికొస్తుంది. గుప్పెడు బాదం పప్పులు నోట్లో వేసుకుంటే ఆకలి తీరుతుంది. చాలాసేపు కడుపు నిండిన భావన కలిగిస్తుంది. ఇలా బరువు తగ్గటానికీ ఉపయోగపడుతుంది. కణజాలాలు, కండరాలు, హార్మోన్లు, ఎంజైమ్‌ల తయారీకి ప్రొటీన్ అత్యవసరం. కణజాలాలు, కణాలు మరమ్మతు కావటానికీ తోడ్పడుతుంది. అలాగే ఎముకల పటుత్వానికి తోడ్పడే క్యాల్షియం కోసం ఎక్కువగా పాలు, పెరుగు, ఛీజ్ వంటి వాటి వైపే చూస్తుంటాం. నిజానికి బాదం పప్పుతో పాటు రాగులు, సోయాబీన్స్, ఆకు కూరల్లోనూ క్యాల్షియం ఉంటుంది. కాబట్టి శాకాహారం తినేవారు సమతులాహారం మీద దృష్టి పెడితే ప్రొటీన్, క్యాల్షియం తగినంత లభించేలా చూసుకోవచ్చు. అదే సమయంలో అధిక బరువు, ఊబకాయం గలవారు కొవ్వునూ తగ్గించుకోవచ్చు