నిత్యజీవితంలో మనకు అపజయాలూ, అవమానాలూ ఎదురవుతుంటాయి. అప్పుడప్పుడూ వార్షిక పరీక్షల్లో, పోటీ పరీక్షల్లో విఫలమై నిరాశపడుతుంటాం. ఒక్కోసారి ఎదుటివాళ్లు మనల్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదనీ, హేళన చేస్తున్నారనీ బాధపడుతుంటాం. నిజానికి ఇవేమీ మన విలువను తగ్గించలేవు. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ముందుకు సాగిపోవాలి. తాత్కాలికంగా ఎదురయ్యే అవరోధాల వల్ల మన విలువ ఏమాత్రం తగ్గదు.
ఒకసారి వ్యక్తిత్వ వికాస నిపుణుడు ఒకరు ప్రసంగిస్తూ... రూ. రెండువేల నోటును అందరికీ చూపించి..‘ఇది ఎవరికి కావాలి’ అని అడిగారు. అక్కడున్న వారందరూ తమకు కావాలంటూ చేతులు పైకెత్తారు. ఆయన దాన్ని నలిపేసి ‘ఎవరికి కావాలి?’ అని ప్రశ్నించారు. అందరూ తమకు కావాలని చేతులెత్తారు. ఈసారి ఆయన ఆ నోటును నేల మీదకు విసిరేశారు. దుమ్ము అంటిన ఆ నోటును చూపిస్తూ ‘ఇప్పుడు ఎవరికి కావాలి?’ అని అడిగారు. అప్పుడు కూడా అందరూ తమకా నోటు కావాలన్నారు.
వెంటనే ఆయన ‘మీరంతా ఆ నోటును ఎందుకు కావాలనుకుంటున్నారంటే... నేనేం చేసినా దాని విలువ తగ్గలేదు కాబట్టే. అలాగే కష్టాలూ, బాధలూ, అవమానాలూ... ఇవేమీ మీ విలువను తగ్గించలేవు’ అన్నారు. దాంతో హాలంతా చప్పట్లతో మారుమోగిపోయింది!
Posted Date : 15-07-2022 .