ఒక్కోసారి చదవాల్సినవి ఎన్నో ఉన్నా.. సమయం మాత్రం తక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు గబగబా చదివేస్తూ ముందుకు వెళ్లిపోతాం. ఆ తర్వాతే అసలు సమస్య మొదలవుతుంది. చదివినవేవీ సరిగా అర్థం కావు. అలా కాకుండా ఉండాలంటే...
‣ చదవడం అంటే.. పదాలను ఉచ్చరించడం కాదు. వాటి ద్వారా వెల్లడించిన ఆలోచనలను అర్థంచేసుకోవడం. కాబట్టి నిదానంగా చదవడానికే ప్రాధాన్యమివ్వాలి.
‣ తెలియని పదాలకు అప్పటికప్పుడే అర్థాన్ని తెలుసుకోవాలి. ఇలా చేయడం వల్ల పదసంపద పెరుగుతుంది. కొత్తగా నేర్చుకున్న పదాలను సందర్భానుసారం ఉపయోగించగలుగుతారు.
‣ వ్యాసం లేదా పాఠం ఏదైనాసరే.. దానికో ప్రధానోద్దేశం ఉంటుంది. ముందుగా అదేమిటనేది గ్రహించాలి. ఆ ఉద్దేశాన్ని తెలియజేసే విశ్లేషణా, ఉదాహరణలూ కూడా ఉంటాయి. వాటిని అర్థంచేసుకుంటే ముఖ్యోద్దేశాన్ని సులువుగా గ్రహించవచ్చు.
‣ చదివిన అంశాన్ని సంక్షిప్తీకరించుకుంటే బాగా గుర్తుంటుంది. లేకపోతే అవగాహన లోపంతో మళ్లీ మళ్లీ చదవాల్సి రావచ్చు.
‣ ఒక్కోసారి కొన్ని పదాలు తికమక పెడుతుంటాయి. సమయానికి డిక్షనరీ కూడా అందుబాటులో లేకపోవచ్చు. అలాంటప్పుడు ఆ తర్వాతి వాక్యాలను చదివితే సారాంశం అర్థమవుతుంది.
‣ విషయాన్ని గ్రహించే సామర్థ్యం పెరగాలంటే ఎక్కువగా చదవాలి. పాఠ్యపుస్తకాలే కాకుండా ఇతర పుస్తకాలనూ చదవడం అలవాటు చేసుకోవాలి. దీంతో మీ ఆలోచనా పరిధీ విస్తృతమవుతుంది.
********************************************************
మరింత సమాచారం ... మీ కోసం!