శతక నీతి – సుమతి
అధికశాతం మంది వారి వారి మనస్తత్వాల వల్లనే ఆనందం కోల్పోతున్నారు. ఒక చిన్న విషయాన్ని సైతం పదే పదే తలచుకోవడం వలన అది వారి ఆరోగ్య సమస్యపై తీవ్ర ప్రభావం చూపుతోందన్న విషయం వీరు గుర్తించటం లేదు. కొద్దిపాటి ‘చిరుగు’ను వేలితో పెద్దగా చేస్తే, అది పెద్ద చిరుగు అవుతుంది. అలాగే ఆలోచనలు కూడా.. చిన్నపాటి సమస్య గురించి ‘అతి’గా ఆలోచిస్తే ఎంత అనర్థమో వీరు ఆలోచించలేరు. దైనందిన జీవితంలో, జీవన విధానంలో, ఎవరో ఏదో అన్నారని, ఆ మాటలకు పెడర్థాలు తీస్తూ, అదే పనిగా ‘కుమిలి’ పోవడం ఎంత నష్టమో వీరు ఆలోచించలేరు. ఏ విషయాన్నైనా మనస్సులో పెట్టుకోవడం వలన, అది వారి వారి అంగరంగాలనే దహింపజేస్తుంది. లోకంలో ఉన్నవారు, వారి వారి మనస్తత్వాలు వేరువేరుగా ఉంటుంటాయి.మన ఐదు వేళ్ళే ‘సమంగా’ లేవు. కొంతమంది తమ ‘అసూయ’ను లోపల మింగలేక, ఏదో ఒక సూటి పోటి మాట విసిరి ‘స్వ ఆనందం’ పొందుతారు. అంతటితో ఆ మాట అన్నవారి మనస్సు ‘శాంతం’ పొందవచ్చు. ధానం జారితే తీసుకోవచ్చు.. మాట జారితే తీసుకోలేము. అనే జ్ఞానం లేకుండా ఉంటుంది అటువంటి వారి ప్రవర్తన.
ఇటువంటి, మనస్సు నొచ్చుకునేలా చేసే వారికి, ఎంత దూరం పాటించినా, వారే చొచ్చుకు వచ్చి, ఒక కుళ్ళు పదాన్ని విసిరి పోతుంటారు. అయితే ఆ మాట స్వీకరించి, దానిని తేలికగా తీసుకోకపోవడం అనర్థమే.. అది మానసిక సమస్యనే. అన్ని వ్యాధులకు మందు ఉంది. మానసిక వ్యాధికి మందు లేదు. సున్నిత మనస్కులు, అననుకూల దృక్పథం ఉన్న వారే ఇటువంటి సమస్యలు ఎదుర్కొంటుంటారు. అదీ అనుకూలం దృృక్పధం ఉన్నవారు అతి తేలికగా తీసుకుంటారు. మన సమాజంలో మాట పట్టింపులు ఎక్కువ. ఎవరో ఏదో అన్నారని, ఆ మాటల గురించి పదే పదే ఆలోచించే వారిని ‘నిద్రలేమి’ పట్టి పీడిస్తుంది. అనవసర వాక్కుల గురించి అతిగా ఆలోచిస్తూ, అదేపనిగా లోలోపల కుమిలిపోతూ మనస్సును ‘రొచ్చు’ చేసుకోవడం అవసరమా? ఇలా, అననుకూల దృక్పథం గల వ్యక్తులను ఏ ఆర్ట్ ఆఫ్ లివింగ్ క్లాసులు సైతం మార్చలేవేమో! అయితే ఇటువంటి సున్నిత మనస్తత్వం గల వారి వలన కుటుంబ వ్యవస్థ అతి తీవ్ర ప్రభావం ఎదుర్కొంటోంది. కుటుంబ వ్యక్తుల మనశ్శాంతులను సైతం దహించడానికి కారణం, ఇటువంటి సున్నిత మనస్కుల ‘అతి’ ఆలోచనలే!
ఏదైనా ఒక వ్యాపకం అలవరచుకోవాలి. అనుకూల దృక్పథం గల రచనలను అభ్యసించాలి. అయితే ఇక్కడ దురదృష్టకర విషయమేమిటంటే, నేడు సామాజిక మాధ్యమాలలో, ఆత్మ విశ్వాసాన్ని పెంపొందింపజేసే వ్యాఖ్యలు, వ్యాఖ్యానాలూ వింటున్నా, చూస్తున్నా అది అంతవరకే. అననుకూల దృక్ప«థం, అతి అననుకూల ఆలోచనలూ ఉన్నవారిని ఎటువంటి ఉపోద్ఘాతాలూ సంస్కరించలేవేమో! అన్పిస్తుంది. వాస్తవానికి సున్నిత మనస్కుల హృదయం ‘బోళా’ గా ఉంటుంది. వీరు ఆనందం వచ్చినా, దుఃఖం కలిగినా తట్టుకోలేరు. చాలామందికి, మానసిక చికిత్స చేయించవలసిన పరిస్థితి. అదేసనిగా, తీవ్ర ఆలోచనలు చేయడం వల్లనే ఇటువంటి విపత్కర సంఘటనలు ఎదుర్కొనవలసి వస్తోంది. ఆనందం ఆహ్లాదం మన చేతికందే సమీసంలోనున్నా, అందుకోలేరు ఆ వ్యక్తులు.
కుటుంబ వ్యవస్థలో, ఇటువంటి మనస్కులను అతి సున్నితంగా చూసుకోవాలి. కొన్ని పరిస్థితుల్లో ‘రక్తపోటు’ తీవ్రస్థాయికి చేరి, ఏదేదో మాట్లాడుతుంటారు. ఘర్షణ పూరిత వాతావరణంలోకి చేరుకునేలా... అటువంటి సమయంలో ఎదుటి వారు ‘మౌనంగా’ ఉండటం శ్రేయస్కరం.. కొద్దిసేపటి తర్వాత, సహజంగా ప్రశాంతత నెలకొంటుంది. పరుల గురించి ‘అతిగా ఆలోచించేవారు ఒక్క విషయం గుర్తు పెట్టుకోవాలి. తన గురించి ఆ ఇతరులు ఆలోచించటం లేదని! ప్రతి విషయానికి ప్రతిస్పందించటం మంచిది కాదు. కొద్దినిముషాలు కళ్ళు మూసుకుని, ధ్యానంలో నిమగ్నమైతే మనస్సుకు ప్రశాంతత చేకూరుతుంది. ఇటువంటి సుభాషితాలు అనంతంగా విన్నా, చదివినా షరామామూలే.. అన్నట్టు వారి ప్రవర్తన మార్చలేని విధంగా ఉంటుంది. ఆలోచనలను మంచి పనులకు వినియోగించాలి.
ఎదుటి వారి మాటలు అనుకూల దృక్పథంతో వున్నా కూడా, ఆ మాటల్లో రంధ్రాన్వేషణ చేస్తే మరీ ప్రమాదం. ‘నీ ఆరోగ్యం నీ చేతుల్లోనే’ అనే విషయం విస్మరిస్తేనే ఇటువంటి జాడ్యాలు పట్టి పీడిస్తుంటాయి. రాజకీయాల్లో, సినిమాల్లో.. ఇంకా ప్రజా జీవితంలో ఉండే వారి మీద ఎన్నో వ్యతిరేక, ఇంకా ‘చెడు’ వ్యాఖ్యానాలు వస్తుంటాయి. వాటన్నింటినీ వారు పట్టించుకుంటే అటువంటి వారు ‘సెలబ్రిటీ’లుగా కొనసాగలేరు. ఎవరైనా ఏదైనా సందర్భంలో ‘ప్రతిస్పందిస్తే’ మరింతగా ‘ఎదురుదాడు’లను నెటిజన్ల నుంచి ఎదుర్కొనవలసి ఉంటుంది.
అందుకే వ్యక్తిగత ఆనందాలను కోల్పోకుండా వుండాలంటే ‘లోకులు పలుకాకులు’ అనే సూక్తి ప్రకారం అతిగా ఆలోచనలు పెట్టుకోకుండా ఉండటం, వారి వారి ఆరోగ్యాలకే క్షేమదాయకం. ఆనందాలను దూరం చేసుకోకుండా తోటలో విరబూసిన పువ్వులను గుర్తు చేసుకోండి. అవి ఎలా ఎల్లవేళలా మందహాసం చేస్తుంటాయో! ఆ పువ్వునే మీకు ఎందుకు ఆదర్శం కాకూడదు! ఆలోచించండి!!
– పంతంగి శ్రీనివాసరావు