కొలువుల క్రమబద్ధీకరణలో ‘కలెక్షన్ కింగ్’లు!
కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ ప్రక్రియలో వసూళ్ల పర్వం
క్రమబద్ధీకరణ ఫైలుకు త్వరిత ఆమోదమంటూ చొరబడ్డ కేటుగాళ్లు
ఒక్కో ఉద్యోగి నుంచి రూ.50వేల నుంచి 1.5 లక్షల వసూళ్లు
ప్యాకేజీ ఇస్తేనే ఫైలుకు మోక్షమంటూ బుకాయింపు
తప్పని పరిస్థితుల్లో అడిగినంత చెల్లిస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు
పుష్పలత (పేరు మార్చాం) ఓ గురుకుల సొసైటీ పరిధిలో సీఆర్‌టీగా పనిచేస్తున్నారు. ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు అన్ని రకాల అర్హత కలిగిఉన్నారు. కానీ సొసైటీ అధికారుల నుంచి క్రమబద్ధీకరణపై ఎలాంటి సమాచారం అందడం లేదు. అయితే తన పేరు జాబితాలో లేదని, ఉద్యోగం క్రమబద్ధీకరించాలంటే రూ.లక్ష ఇస్తే మేనేజ్ చేయొచ్చంటూ ఓ వ్యక్తి పుష్పలతను సంప్రదించాడు.
ఇప్పటికే పదుల సంఖ్యలో ఇలాంటి పరిస్థితిలో ఉన్నారని, అడిగినంత ఇస్తే పనైపోతుందని చెప్పాడు. దీంతో ఆయా ఉద్యోగులు సదరు వ్యక్తి అడిగినంత చెల్లించుకున్నారు. వివిధ శాఖల్లో చాలామంది కాంట్రాక్టు ఉద్యోగుల నుంచి ఈ తరహాలో దండుకుంటున్నట్లు క్రమంగా బయటపడుతోంది.
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ శాఖల్లో దీర్ఘకాలంగా పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ ప్రక్రియలో కొందరు కేటుగాళ్లు చొరబడ్డారు. ఉద్యోగాన్ని క్రమబద్దీకరించేందుకు ఉన్నతాధికారులకు ముడుపులు ఇవ్వాలంటూ కాంట్రాక్టు ఉద్యోగుల నుంచి భారీ మొత్తాన్ని వసూలు చేస్తున్నారు. ఒక్కో ఉద్యోగి నుంచి సగటున రూ.50వేల నుంచి రూ.1.5 లక్షల వరకు దండుకుంటున్నారు.
ఈ విషయంలో నిజానిజాలను నిర్ధారించుకోకుండా తోటి కాంట్రాక్టు ఉద్యోగులు సైతం కేటుగాళ్లు అడిగినంత ముట్టజెప్తున్నారు. వివిధ శాఖల్లో దీర్ఘకాలంగా పనిచేస్తున్న 11,103 మంది ఉద్యోగాలను క్రమబద్ధీకరిస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదికగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈమేరకు క్రమబద్ధీకరణ ప్రక్రియ జోరుగా సాగుతోంది. రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ పరిధిలో 18 ఏళ్లుగా కాంట్రాక్టులో పనిచేస్తున్న 144 సూపర్‌వైజర్ ఉద్యోగాల క్రమబద్ధీకరణకు సీఎం ఆమోదం తెలిపిన విషయాన్ని స్వయంగా ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది.
ఈ అంశం కాంట్రాక్టు ఉద్యోగుల్లో దృఢ విశ్వాసాన్ని నింపింది. తాజాగా ఇతర విభాగాలకు సంబంధించిన క్రమబద్ధీకరణ ఫైళ్లు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఈ పరిస్థితిని సొమ్ము చేసుకునేందుకు కొందరు కేటుగాళ్లు రంగంలోకి దిగారు. క్రమబద్ధీకరణను త్వరితంగా పూర్తి చేయిస్తామని, కొందరి పేర్లు జాబితాలో లేవంటూ బుకాయించి అలాంటి వారికి సైతం క్రమబద్ధీకరణ అయ్యేలా చేస్తామని నమ్మిస్తున్నారు. పై అధికారుల చెయ్యి తడిపితేనే త్వరితంగా పని పూర్తవుతుందని, ప్రభుత్వం వద్దకు ఫైలు వేగంగా చేరుతుందని ఆశలు పుట్టించి వసూళ్లకు తెగబడుతున్నారు.
సంక్షేమ, గురుకులాల్లో...
►మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ నుంచి క్రమబద్ధీకరణ ఫైలు సీఎం కార్యాలయానికి చేరుకున్న విషయాన్ని తెలుసుకున్న కొందరు కేటుగాళ్లు ఆయా ఉద్యోగుల నుంచి వసూళ్లకు పాల్పడినట్లు తెలిసింది.
►తెలంగాణ మైనార్టీ గురుకుల విద్యాసంస్థల సొసైటీ పరిధిలో దాదాపు 250 మంది కాంట్రాక్టు టీచర్లు పనిచేస్తున్నారు. వీరి క్రమబద్ధీకరణ అంశాన్ని సొసైటీ సైతం అత్యంత గోప్యంగా ఉంచింది. క్రమబద్ధీకరణ ఫైలు ప్రభుత్వానికి పంపిందో లేదో అనే సందిగ్ధంలో ఆయా ఉద్యోగులు ఉండగా... రంగంలోకి దిగిన కేటుగాళ్లు ఒక్కో ఉద్యోగి నుంచి రూ.లక్ష చొప్పున డిమాండ్ చేసినట్లు తెలిసింది. ఇప్పటికే పలువురు టీచర్లు అడిగినంత ఇచ్చుకున్నట్లు సమాచారం.
►ప్రస్తుతం క్రమబద్ధీకరణకు అర్హత ఉన్న కాంట్రాక్టు ఉద్యోగుల్లో అత్యధికులు విద్యాశాఖ, గురుకుల సొసైటీల పరిధిలోనే ఉన్నారు. దీన్ని అదనుగా చేసుకున్న కేటుగాళ్లు విద్యాశాఖ, గురుకుల సొసైటీల పరిధిలోని కాంట్రాక్టు ఉద్యోగులపై కన్నేశారు. వారికి మాయమాటలు చెప్పి అందినకాడికి దండుకునేందుకు
తెగబడ్డారు.
►తెలంగాణ సాంఘిక, సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ పరిధిలో ఐదొందలకు పైగా కాంట్రాక్టు ఉద్యోగులు క్రమబద్ధీకరణ కానున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను సొసైటీ ప్రభుత్వానికి నివేదించింది. కొందరు మధ్యవర్తులు ఈ ఉద్యోగులను సంప్రదించి క్రమబద్ధీకరణ కోసం పెద్దమొత్తంలో డిమాండ్ చేసినట్లు తెలిసింది. ఒక్కో ఉద్యోగి నుంచి రూ.లక్ష చొప్పున ఇవ్వాలని వారికి సూచించగా... ఇప్పటికే పలువురు ఆ మొత్తాన్ని ముట్టజెప్పినట్లు విశ్వసనీయంగా తెలిసింది. మధ్యవర్తులను నమ్మొద్దని ఉద్యోగ సంఘ నేతలు గట్టిగా సూచిస్తున్నారు.