యూరిక్ యాసిడ్ సమస్య ఉంటే.. వర్షాకాలంలో ఇవి తినొద్దు
పేలవమైన జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ఈ రోజుల్లో ఆరోగ్య సమస్యలు ఎక్కువవుతున్నాయి. వీటి కారణంగా వచ్చే సమస్యల్లో శరీరంలో యూరిక్ యాసిడ్ పెరుగుదల ఒకటి. శరీరంలో యూరిక్ యాసిడ్ మోతాదు మించితే కడుపులో మంట, కిడ్నీలో రాళ్లు, మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు, చేతుల వేళ్లు వాపు సమస్యలు వచ్చే అవకాశం ఉంది. యూరిక్ యాసిడ్ సమస్యను సకాలంలో తగ్గించకపోతే.. కిడ్నీ, లివర్ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అంతే కాకుండా గుండె సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడే వ్యక్తులు తమ ఆహార విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అంటున్నారు. (uric acid)
మనం తీసుకునే ఆహార పదార్థాల్లోని ‘ప్యూరిన్’ అనే రసాయనం విచ్ఛిన్నం అయినప్పుడు.. యూరిక్ యాసిడ్ ఏర్పడుతుంది. ఇది ఎప్పటికప్పుడు యూరిన్ ద్వారా బయటకు వెళ్తుంది. ఒకవేళ విసర్జన సరిగా జరగకపోతే.. యూరిక్ యాసిడ్ రక్తంలోనే నిలిచిపోతుంది. క్రమంగా ఇవి స్ఫటికాలుగా మారి కీళ్లు, కీళ్ల చుట్టూ ఉండే కణజాలాల్లో పేరుకుపోతాయి. దీనినే ‘హైపర్ యూరిసిమియా’ అంటారు.
వర్షాకాలంలో కొన్ని కూరగాయలు డైట్‌లో తీసుకోవడం వల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరుగుతాయని ఫిట్‌నెస్ గురు, ఆరోగ్య నిపుణుడు మిక్కీ మెహతా అన్నారు. వర్షాకాలంలో యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడేవారు కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలని మిక్కీ మెహతా సూచిస్తున్నారు.
బీన్స్..
బీన్స్ తీసుకుంటే ఆరోగ్యానికి మేలు జరుగుతుందని చాలామందికి తెలుసు. కానీ, యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడేవారు బీన్స్ తినకూడదని మిక్కీ మెహతా సూచిస్తున్నారు. బీన్స్ శరీరంలో యూరిక్ యాసిడ్ సమస్యను పెంచుతాయి. కాబట్టి ఈ సమస్యతో బాధపడేవారు బీన్స్ తినకూడదు. బీన్స్ తినడం వల్ల యూరిక్ యాసిడ్ స్థాయి పెరగడమే కాకుండా శరీరంలో మంట కూడా ఏర్పడుతుంది.
బఠాణీ..
ఎండిన బఠాణీలలో ప్యూరిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిని పెంచుతాయి. మీకు యూరిక్ యాసిడ్ సమస్య ఇప్పటికే ఎక్కువగా ఉంటే.. బఠాణీలు తినవద్దు. ఇవి తింటే.. మీ సమస్య ఇంకా పెరుగుతుంది.
వంకాయ..
వంకాయలో ప్యూరిన్ పుష్కలంగా ఉంటుంది. వంకాయ తింటే.. శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయి మరింత పెరుగుతుంది. దీనివల్ల శరీరంలో మంట కూడా ఏర్పడుతుంది. దీనితో పాటు, ముఖం మీద దద్దుర్లు, దురద సమస్య కూడా రావచ్చు. యూరిక్ యాసిడ్‌తో బాధపడేవారు బెండకాయలకు దూరంగా ఉండాలి.
పాలకూర..
యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడేవారు పాలకూరకు దూరంగా ఉండాలి. పాలకూరలో ప్రోటిన్, ప్యూరిన్ ఎక్కువగా ఉంటుంది. వీటి వల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరుగుతాయి.
చామదుంప..
మీకు గౌట్ సమస్య ఉంటే.. చామదుంప తినకూడదు. చామదుంప తినడం వల్ల కీళ్ల నొప్పులు, శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయులు పెరుగుతాయి.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.