ఎంతటి పండితులు, జ్ఞానులు అయినా తమకు అంతా తెలుసని చెప్పరు. ఆ అహంకారం.. లేదా భ్రమ.. భ్రాంతి వారి మాటల్లో ధ్వనించదు. చేతల్లో కూడా స్ఫురించదు. తాము తెలుసుకున్నది స్వల్పమని.. తెలుసుకోవాల్సింది అనంతమని వారికి తెలుసు.
కనుకే వారిలో ఒదుగుదల.. వినయం.. సంయమనం. ఇదే వారిని అనుక్షణం అప్రమత్తుల్ని చేసి వారు జ్ఞానాన్వేషణ మీదే దృష్టి పెట్టేలా చేస్తుంది.
మూర్ఖుడు అందుకు భిన్నం. తన మూర్ఖత్వం వల్ల పరిహాసాల పాలవుతుంటాడు. తనకంతా తెలుసనుకోవటమే అజ్ఞానం. అంతే కాదు. తనకు తెలిసిందే జ్ఞానమనుకునే అవివేకమే మూర్ఖత్వం.
మూర్ఖత్వమంటే వెర్రి పట్టుదల, దుస్సాహసం, అసంబద్ధత, అహేతుకత. బాధ్యాతారాహిత్యం, దురహంకారం, అజ్ఞానం, కుసంస్కారం. వీటి మూర్తీభవత్వమే .. మూర్ఖుడు. తనకు అంతా తెలుసని.. తనకు తెలిసిందే సరైనదన్న ఆలోచన చేస్తాడు. వాస్తవాన్ని చూసే శక్తి లేకపోవటం, ఒకవేళ చూడగలిగినా పాక్షికంగానే చూడటం, పెద్దలను గౌరవించకపోవటం, అవాకులు.. చవాకులు పేలటం, ఇతరులను అకారణంగా నిందించటం.. ఈ గుణాల కలబోతే మూర్ఖుడు.
మూర్ఖుడు తానే సర్వజ్ఞుడనని అనుకుంటాడు. ప్రతిదీ తనకే తెలుసని ఇతరులకేమీ తెలియదన్నట్టుగా ప్రవర్తిస్తాడు. నిజానికి ఇదే అజ్ఞానం కదా! దీనివల్ల ఇతరులు చెప్పేదేది తను విననవసరం లేదని భావిస్తాడు. వారికి ఆ శక్తే లేదని అతడి ప్రగాఢ విశ్వాసం. జ్ఞానమనే అనంత ప్రవాహంలో కొత్త జ్ఞాన పాయలు వచ్చి చేరుతుంటాయి.
దానిలో తను ఒడిసి పట్టుకున్నదెంత.. దాన్ని అర్థం చేసుకున్నదెంతన్న ఎరుక ఆవగింజంతైనా లేనివాడే మూర్ఖుడు. ఒకరకంగా కూపస్థ మండూకమే! ఈ అజ్ఞానంతో పెద్దల.. జ్ఞానుల మాటలను ఆలకించడు. ఆలోచించడు. ఈ అజ్ఞానం అతడి కళ్లను ఎప్పుడూ మూసే ఉంచుతుంది. మూర్ఖత్వం ఉన్నచోట విచక్షణ, వివేచన ఉండదని, వాగ్వివాదం, అర్థరహితమైన ఆవేశం ఉంటుందన్న విషయాన్ని కొన్ని పౌరాణిక ఉదంతాలు స్పష్ట చేస్తాయి.
మూర్ఖుడికి రెండు అవలక్షణాలు. ఒకటి తనకు తెలియకపోవటం.. రెండోది ఇతరులు చెప్పే మంచిని చూడలేకపోవటం. పైగా, వారిని సంస్కరించే క్రమంలో వివేచనాపరులకు నిందలు.. అవమానం... చీదరింపు.. చీత్కారం.. ఎదురవుతాయి. మనసుకు బాధ కలుగుతుంది. అందుకే భర్తృహరి.. సృష్టిలో లేనివి... అసాధ్యమైనవి ప్రయత్నించి సాధించవచ్చేమో కాని, ఎటువంటి ప్రయత్నం చేసినా మూర్ఖుడి మనసు మెప్పించలేమని.. మార్చలేమని... ఏనాడో సిద్ధాంతీకరిస్తూ హెచ్చరించాడు.
విలువైన సమయం వృథా అవుతుంది. ఈ శుష్కప్రయత్నం కన్నా అనేకమంది పామరులను పండితుల్ని చేయవచ్చు. అలాగే కొంచం తెలివితేటలు ఉన్నవాళ్ళకు .. ఎదుటివారు చెప్పేది వినే సంస్కారం ఉండి, ఆలోచించ గలిగే వారికి చెప్పినా ఉపయోగముంటుంది. మన మాటలోని అంతరార్థాన్ని గ్రహించి తమను సరిదిద్దుకోగలరు. మన పట్ల కృతజ్ఞతా భావం ఉంటుంది.
మూర్ఖుడికి తన జ్ఞానం మీద అతివిశ్వాసం. దానివల్ల ఒక సమస్యను అన్ని కోణాలలో చూడలేడు. కొంతవరకే అర్థం చేసుకుని ప్రయత్నం చేసి అద్భుతమైన పరిష్కారం కనుగొన్నానని సంతోషంతో గెంతులేస్తాడు. తాను గొప్ప మేధావినని మురిసిపోతాడు. దాని పర్యవసనాలు ఎలా ఉంటాయో ఊహించలేడు.
పిడివాదం మూర్ఖుడి జీవలక్షణం. తన ఆలోచన.. తెలివిడితనం/ తెలివి... మార్గం... అందరికన్నా మెరుగైనవన్న వైఖరి. దాన్నే తన మాటల్లో.. వాదనలో.. చేతల్లో చూపించే తత్వం. అందుకే వివేకవంతుడు అతడితో వాదనకే దిగడు. అసలు సాధ్యమైనంతవరకు మాట్లాడే యత్నమే చెయ్యడు.
మూర్ఖుడికి మంచి భావనలే రావు. సమయోచిత బుద్ధి.. ప్రవర్తన ఉండదు. అతడి ప్రవర్తన వింతగా. హాస్యాస్పదంగా ఉంటూ కొన్ని సందర్భాలలో నిర్ఘాంతులను చేస్తుంది. మరికొన్ని సమయాలలో అది ఊహించని విధంగా పరిణమించి ఎంతో విపత్తును.. నాశనాన్ని కలిగిస్తుంది. ఇంగిత జ్ఞానం మూర్ఖుడి దరిదాపుల్లో నివాసమే చేయదు.
అతనికి మాటలకు ఒక స్థిరత్వం.. పరిస్థితులను ఆకళింపు చేసుకునే శక్తి సామర్థ్యాలు ఉండనే ఉండవు. సహేతుక నిర్ణయాధికార శక్తి ఉండదు. కువిమర్శలు చేయటం అతని నైజం. స్వార్థం.. సంకుచిత బుద్ధి.. అధర్మ పద్ధతులలోనైనా తననుకున్నది సాధించాలనుకునే మొండి పట్టుదల అతడి కార్యసాధనకు సాధనాలు.
మూర్ఖత్వం వ్యక్తి వికాసానికి పెద్ద అవరోధం. అది నాయకులకుంటే సమాజానికి చేటు. జాతినేతకు ఉంటే జాతికి ముప్పు. హిట్లర్.. ముస్సోలినీల మూర్ఖత్వానికి కొన్ని వర్గాలవారు ధన.. మాన.. ప్రాణాలు గడ్డిపరకల కన్నా ఎలా హీనమయ్యాయో చరిత్ర చెప్పనే చెప్పింది. మూర్ఖత్వాన్ని తప్పకుండా వీడాలి.
అదెలా సాధ్యమవుతుందంటే..?
తోటకూర నాడే అన్నట్టుగా పిల్లల్లో ఈ విపరీత లక్షణం గమనించిన పెద్దలు వెంటనే వారిని సంస్కరించే ప్రయత్నం చేయాలి. మంచి పుస్తకాలను చదివించాలి. మంచివారితో స్నేహం గరిపేటట్టు చూడాలి. అవసరమైతే గురువుల సహాయం తీసుకోవాలి. అప్పుడు అభిలషణీయమైన మార్పు చూస్తాం.
అపుడే వ్యక్తికి.. కుటుంబానికి.. సమాజానికి.. జాతికి శ్రేయస్సు.
మూర్ఖుడికి ఉచితానుచితాలు తెలియనే తెలియవు. సభామర్యాద తెలియదు. సంభాషణ తీరు ఉండదు. మాట్లాడే మాటలకు సందర్భశుద్ధి ఉండదు. తమ తప్పుల్ని.. పొరబాట్లను.. అనుచిత ప్రవర్తనను గుర్తెరగరు. ఒకవేళ తెలుసుకున్నా సరిదిద్దుకోరు. తమ పద్ధతిలోనే పయనిస్తారు. వివేకవంతులు తమ లోపాలను తెలుసుకున్న వెంటనే సరిదిద్దుంటారు. మార్పు వారి వ్యక్తిత్వంలో ఒక గొప్ప లక్షణం. ఇది వారిని మరింత వివేచనపరులుగా చేసే మార్గం.
మూర్ఖత్వమంటే అసలు తెలియదని కాదు. తెలిసింది చాలా తక్కువ. అది కూడ అరకొరగానే. అదే గొప్పదన్న ఆలోచన. దానికే కన్ను, మిన్ను కానక ప్రవర్తిస్తుంటారు. వయోభేదం లేకుండా ఎవరినైనా ఏ మాటైనా అనగలరు. సంకోచం గాని.. వెరపు గాని ఉండదు. తన మాటల, వర్తన వల్ల ఎవరికైనా మనస్తాపం కలుగుతుందేమోనని యోచనే ఉండదు. తమకున్న మిడి మిడి జ్ఞానంతో, వివేచనపరులు ఈ పని చేయచ్చా... ఇలా మాట్లాడవచ్చో లేదో అని మీమాంసకు లోనైన సందర్భాలలో చొరవగా అన్నిచోట్లకు వెళ్ళగలరు .. ఏదైనా మాట్లాడగలరు.
– బొడ్డపాటి చంద్రశేఖర్, ఆంగ్లోపన్యాసకులు