స్ట డీ టి ప్
ఎక్కువ గంటలు కూర్చుని చదువుకోవాలి అన్నప్పుడు ఎవరికైనా కొంచెం కష్టంగానే ఉంటుంది. అంతసేపు ఏకాగ్రత చూపలేక అలసిపోతూ ఉంటాం. కొంత సమయం గడిచాక చదువుతున్నా దానిపై మనసు లగ్నంకాదు. అలాంటి సమయంలో మెదడుకు ఎప్పటికప్పుడు తేలికగా అనిపించేందుకు ఆ మొత్తం సమయాన్ని చిన్న చిన్న టాస్క్‌లుగా విభజించుకోండి. అంటే ఒక జవాబు, ఒక పాఠం... ఇలా చేయాల్సిన పనులను, ఉన్న సమయాన్ని ముందే అనుకుని ఒకచోట రాసుకోండి. ప్రతి టాస్క్ పూర్తయ్యాక ఒక చిన్న విరామం తీసుకుని మళ్లీ మొదలుపెట్టండి. దీనివల్ల సమయం ఆదా కావడమే కాకుండా, పనులన్నీ ప్రణాళికాబద్ధంగా పూర్తవుతాయి. ఎక్కువసేపు కూర్చున్న అలసట కూడా అంతగా తెలీకుండా ఉంటుంది.
ఆలోచనలకు పదును
కొన్నిసార్లు ఎంతో కష్టపడి పనిచేసినా ఆశించిన ఫలితాన్ని సాధించలేం. మూస ధోరణికి అలవాటుపడి పనిచేయడం వల్లే ఇలా జరుగుతోందని ఊహించలేం కూడా. నిజానికి ఎప్పటికప్పుడు మన ఆలోచనలకు పదును పెడితే పనిలో సృజనాత్మకతా పెరుగుతుంది. దాంతో మెరుగైన ఫలితాలనూ సాధించగలుగుతాం. అందుకే మనం రంగయ్యలా ఉండకూడదు!
రంగయ్య.. కట్టెలు కొట్టి జీవించేవాడు. రోజూ అడవికి వెళ్లి కట్టెలు తెచ్చి వాటిని కలప దుకాణంలో అమ్మేవాడు. కొన్ని నెలలపాటు బండి నిండుగా కట్టెలు తెచ్చేవాడు. ఆ తర్వాత సగం బండి మాత్రమే నిండేది. మరికొన్ని నెలల తర్వాత బండిలో నాలుగోవంతు కట్టెలు మాత్రమే తెచ్చేవాడు. ఇదంతా గమనించిన యజమాని ఓరోజు రంగయ్యను నిలదీశాడు. అప్పడు రంగయ్య.. ‘ఎప్పటిలానే కష్టపడుతున్నా ఏమైందో తెలియడం లేదు. నా బలం తగ్గిందో, వయసు పెరిగిందో అర్థంకావడం లేదు’ అంటూ వాపోయాడు. అప్పుడు యజమాని ‘నీ గొడ్డలికి పదును పెట్టి ఎంత కాలమైంది?’ అని ప్రశ్నించాడు. నిజానికి రంగయ్య కొన్ని నెలలపాటు గొడ్డలికి పదునుపెట్టనే లేదు. తన తప్పు గ్రహించిన రంగయ్య.. వెంటనే గొడ్డలికి పదును పెట్టించి ఎప్పటిలా ఎక్కువ కట్టెలు కొట్టసాగాడు.