నీట్ ర్యాంకుల కటాఫ్ ఎంత?
‣ ఏటా పెరుగుతున్న పోటీ
నీట్ యూజీ ప్రశ్నపత్రం తేలికగా ఉన్నా, కఠినంగా ఉన్నా దాన్ని సాపేక్షంగానే భావించాల్సి ఉంటుంది. గతంలో జాతీయ స్థాయిలో మొదటి 10 ర్యాంకులు సాధించాలంటే 720 గరిష్ఠ మార్కులకుగాను 690-710 మార్కులు పొందితే సాధ్యమయ్యేది. కానీ నీట్- 2021లో అభ్యర్థులు సాధించిన మార్కులు, దానికి అనుగుణంగా వారు పొందిన జాతీయ ర్యాంకులు గమనిస్తే పోటీ పెరుగుతున్నట్లు తెలుస్తోంది. నీట్- 2021 పరీక్ష రాసిన వారిలో ముగ్గురు అభ్యర్థులు 720 మార్కులు సాధించి 1వ ర్యాంకు పొందారు. 716 మార్కులు సాధించిన అభ్యర్థి 4వ ర్యాంకు, 715 మార్కులు సాధించిన 12 మంది 5వ ర్యాంకు పొందారు. అదే 715 మార్కులతో ఇద్దరు 17వ ర్యాంకు, ఇద్దరు 19వ ర్యాంకు పొందారు.
ఒకేరకమైన మార్కులు ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువమంది సాధిస్తే ప్రాధాన్యపరంగా ఈవిధంగా ర్యాంకును నిర్ణయిస్తారు. బయాలజీలో ఎక్కువ మార్కులు సాధిస్తే మొదటి ప్రాధాన్యం, తర్వాత కెమిస్ట్రీలో ఎక్కువ మార్కులు సాధిస్తే ప్రాధాన్యం, ఆ తర్వాత ఫిజిక్స్‌లో మార్కులకు ప్రాధాన్యం ఉంటుంది. వీటన్నింటిలో ఒకే రకంగా మార్కులు సాధిస్తే తక్కువ తప్పులు గుర్తించిన అభ్యర్థికి ప్రాధాన్యమిస్తారు. దీనివల్లనే ఒకే మార్కులు పొందినా విభిన్న ర్యాంకులు కేటాయిస్తుంటారు.
ఎంబీబీఎస్ సీట్లు ఎన్ని?
గడచిన 5 సంవత్సరాల్లో నీట్ యూజీ రాసే అభ్యర్థుల సంఖ్య దాదాపు 41 శాతం పెరిగితే ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య మాత్రం 33 శాతం మాత్రమే పెరిగింది. నీట్ 2022 పరీక్షకు అభ్యర్థుల సంఖ్య గత ఏడాది కంటే పెరగొచ్చు. ఎన్‌టీఏ ఈ పరీక్షను ఇంగ్లిష్‌తోసహా మొత్తం 13 భాషల్లో నిర్వహిస్తోంది. ఈ పరీక్ష ద్వారా 89,900 పైగా ఎంబీబీఎస్, 27,000పైగా బీడీఎస్, 52,000 ఆయుష్ సీట్ల భర్తీ జరుగుతుంది.
గత ఏడాది రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 1.3 లక్షల మంది నీట్ రాశారు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య కిందివిధంగా ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లో
13 ప్రభుత్వ కళాశాలల్లో 2,410 సీట్లు
18 ప్రైవేటు కళాశాలల్లో 2,800 సీట్లు
మొత్తం 5,210 సీట్లు
తెలంగాణలో
11 ప్రభుత్వ కళాశాలల్లో 1,790 సీట్లు
23 ప్రైవేటు కళాశాలల్లో 3,550 సీట్లు
మొత్తం 5,340 సీట్లు
నీట్ యూజీ మార్కుల ఆధారంగా ఎన్‌టీఏ జాతీయ ర్యాంకు, కేటగిరి ర్యాంకును ఇస్తుంది. మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ) ద్వారా ఏఐక్యూ సీట్లను భర్తీ చేస్తారు. రాష్ట్ర స్థాయిలో స్థానిక ర్యాంకు ఆధారంగా ఆయా రాష్ట్రాలు మిగిలిన 85 శాతం సీట్లను భర్తీ చేస్తాయి.