ప్రేరణ
మన చుట్టూ ఉండే ఎంతోమంది ‘అనవసరంగా కష్టపడొద్దనీ.. ప్రయత్నాలను విరమించి ప్రశాంతంగా ఉండమనీ’ సలహాలు ఇస్తుంటారు. నిజానికి కష్టపడనిదే ఫలితం దక్కదు. అవరోధాలు ఎదురయ్యాయని ప్రయత్నాలను ఆపేయకూడదు. అది... పరీక్షల్లో ఫెయిల్ కావడం... ఇంటర్వ్యూలో విఫలం చెందడం.. ఎంతగా ప్రయత్నించినా ఉద్యోగం పొందకపోవడం... ఇలా ఏదైనా కావచ్చు. అయినా సరే మళ్లీ మళ్లీ ప్రయత్నించి విజయం సాధించాలి. ఈ ప్రయాణంలో ఎదుటివారు నిరుత్సాహపరిచినా వారి మాటలను పట్టించుకోకూడదు. అందుకు చక్కని ఉదాహరణే ఈ చిట్టి కథ.
ఒకరోజు అడవిలో కప్పల గుంపు ఒకటి ప్రయాణిస్తోంది. ఇంతలో రెండు కప్పలు జారి పెద్ద గుంతలో పడిపోయాయి. పైనున్న కప్పలు కిందకు తొంగి చూశాయి. గుంత చాలా లోతుగా ఉండటం వల్ల ఆ కప్పలు ఇక బయటకు రావడం అసాధ్యం అనుకున్నాయి. కానీ రెండు కప్పలూ బయటకు రావడానికి తీవ్రంగా ప్రయత్నించసాగాయి. సగం దూరం వరకూ వచ్చి మళ్లీ కింద పడిపోసాగాయి. ‘ఫలితం లేకుండా కష్టపడటంలో అర్థంలేదు.. కష్టపడటం ఆపేసి కాస్త విశ్రాంతి తీసుకోమ’ని పైనున్న కప్పలు హితవు పలికాయి. వాటి మాటలు విన్న ఒక కప్ప ప్రయత్నించడం మానేసి కిందపడి చనిపోయింది. మరోకప్ప మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా గుంత నుంచి బయటికి వచ్చేసింది. దాన్ని చూసి ఆశ్చర్యపోయిన కప్పలు.. ‘ఎలా రాగలిగావు?’ అని ప్రశ్నించాయి. ‘నాకు చెవులు వినిపించవు. మీరేం చెప్పారో కూడా అర్థంకాలేదు. నా శాయశక్తులా కష్టపడి ప్రయత్నించాను’ అని బదులిచ్చింది.