అందుకే రోజూ నడవాల్సిందే..
వ్యాయామాల్లో చాలా సులభమైంది, ఎక్కువమంది ఎంచుకునేది ఏది? అని అడిగితే.. చాలామంది తడబడకుండా చెప్పే సమాధానం 'నడక' అని. అయితే 'ఇది శ్రమ లేకుండా సాగిపోయే వ్యాయామం.. అందుకే చాలామంది దీన్ని ఎంచుకుంటారు..' అని అనుకుంటే మాత్రం పొరబడ్డట్లే. ఎందుకంటే ఈ వ్యాయామం ప్రతిఒక్కరికీ సౌకర్యవంతంగా ఉండడంతో పాటు దీనివల్ల ఫిట్‌నెస్ పరంగా కలిగే లాభాలు చాలానే ఉన్నాయి. కాబట్టే ఎక్కువమంది వ్యాయామం అనగానే నడకతో ప్రారంభిస్తుంటారు. ఈ క్రమంలో నడకను ఎంచుకోవడం వల్ల శరీరానికి ఎలాంటి ప్రయోజనాలున్నాయో ఓసారి చూద్దాం రండి..
సమయం లేకపోతే..
ఉద్యోగ రీత్యా బిజీ షెడ్యూల్ వల్ల ప్రత్యేకంగా వ్యాయామం చేయడానికి సమయం సరిపోవడం లేదా? అయితే ఉదయం ఆఫీసుకు వెళ్లేటప్పుడు, సాయంత్రం ఆఫీసు నుంచి ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు ఇంటి నుంచి బస్‌స్టాప్ వరకు నడుచుకుంటూ వెళ్లడం, రావడం చేయండి. అలాగే ఆఫీసులో కూడా బ్రేక్ సమయాల్లో అటూ ఇటూ కాసేపు నడవడం, లిఫ్ట్ ఉపయోగించకుండా మెట్ల మార్గాన్ని ఎంచుకోవడం.. మొదలైనవన్నీ చేయడం వల్ల వ్యాయామం చేసినంత ఫలితం దక్కుతుంది. శరీరంలోని కండరాలకు మంచి వ్యాయామం అందుతుంది.
ఒత్తిడి నుంచి విముక్తికి..
నడక మానసిక ఆరోగ్యానికి కూడా చాలా అవసరం. ఆఫీసులో నిరంతరాయంగా పని చేయడం వల్ల మానసికంగా ఒత్తిడి కలుగుతుంది. అలాగే ఎక్కువసేపు కంప్యూటర్ చూడడం వల్ల కంటి సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి సమస్యల్ని అధిగమించడానికి అప్పుడప్పుడూ లేచి కాసేపు అటూ ఇటూ నడవడం చాలా ముఖ్యం. నడక వల్ల నడుంనొప్పి వంటి సమస్యల నుంచి కూడా విముక్తి కలుగుతుంది.
ఆరోగ్యానికీ..
నడక కేవలం ఫిట్‌నెస్‌కు మాత్రమే కాదు.. పలు ఆరోగ్య సమస్యల్ని దూరం చేయడంలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో భాగంగా రోజూ కనీసం పదిహేను నిమిషాల పాటు నడవడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడడంతో పాటు రక్తంలో చక్కెర స్థాయులు కూడా అదుపులో ఉంటాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.
మరిన్ని..
❖ చాలామంది నడుస్తూ ఆలోచించడం మనం గమనిస్తూనే ఉంటాం. ఎందుకంటే ఇలా చేయడం వల్ల కొత్త కొత్త ఆలోచనలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే మీటింగుల్లో కూడా చాలామంది అటూ ఇటూ తిరుగుతూ చెబుతుంటారు.
❖ నడక వల్ల శరీరంలోని ప్రతి అవయవానికీ ఎక్కువ మొత్తంలో ఆక్సిజన్ సరఫరా అయ్యి శక్తి ఉత్పత్తవుతుంది.
❖ రోజూ కాసేపు నడవడం వల్ల శరీరంలోని జీవక్రియల పనితీరు మెరుగుపడటంతో పాటు బరువు కూడా అదుపులో ఉంటుంది.
❖ ఎముకల దృఢత్వానికి, గుండె ఆరోగ్యానికి నడక ఎంతో అవసరం.
❖ ఉదయం పూట బయట వాకింగ్ చేసే క్రమంలో లేలేత సూర్యకిరణాలు శరీరంపై పడటం వల్ల విటమిన్ 'డి' కూడా శరీరానికి అందుతుంది.
❖ రోజూ క్రమం తప్పకుండా వాకింగ్ చేయడం వల్ల తొడ, పొట్ట భాగాల్లోని అనవసర కొవ్వులు కరిగిపోయే అవకాశం ఉంటుంది.