ఈ రోజుల్లో చాలామంది తల్లిదండ్రులు ‘మా పాప ఫోన్ పట్టిందంటే వదలదు, దానివల్ల సరిగ్గా చదవడం లేదు’, ‘మా బాబు పొద్దున్నే లేవమంటే అస్సలు లేవడు’, ‘మా పిల్లలను వ్యాయామం చేయమంటే బద్ధకిస్తుంటారు..’ అంటూ సైకాలజిస్టులను కలిసి తమ బాధలు చెప్పుకుంటున్నారు. అయితే ఇలాంటివి జరగడానికి ఎక్కువ శాతం తల్లిదండ్రుల ప్రవర్తనే కారణమంటున్నారు నిపుణులు. వారు పిల్లల ముందే చేసే కొన్ని పనుల వల్ల ఇలాంటి సమస్యలు వస్తున్నాయని చెబుతున్నారు. ఈ క్రమంలో తల్లిదండ్రులు పిల్లల ముందు ఎలాంటి పనులు చేయకూడదో తెలుసుకుందాం రండి..
ఫోన్ వాడకం...
ఈ రోజుల్లో చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరూ ఫోన్లను విపరీతంగా ఉపయోగిస్తున్నారు. అయితే చాలామంది తల్లిదండ్రులు.. ‘మా పిల్లలు నిత్యం మొబైల్ వాడుతున్నారు. దానివల్ల సరిగా తినడం లేదు, చదువుకోవడం లేద’ని, తగిన పరిష్కారం చూపమని సైకాలజిస్టులను ఆశ్రయిస్తున్నారు. అయితే యథా రాజా తథా ప్రజా అన్నట్టు.. మీరు అదేపనిగా మొబైల్ ఉపయోగిస్తే మీ పిల్లలు కూడా అలాగే చేస్తారు. కాబట్టి పిల్లల ముందు సెల్‌ఫోన్‌ని ఎక్కువగా ఉపయోగించకపోవడమే మంచిది. తల్లిదండ్రులు మొబైల్ ఫోన్లను ఎక్కువగా ఉపయోగించడం వల్ల పిల్లలపై పెట్టే శ్రద్ధ కూడా తగ్గిపోతుందని పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి. కాబట్టి పిల్లల సమక్షంలో సాధ్యమైనంత వరకు మొబైల్‌ని పక్కన పెట్టండి. ఇలా మీరు పాటిస్తూనే.. వాళ్లకూ ఈ ‘నో స్క్రీన్’ అలవాటును పాటింపజేయండి. ఒకవేళ ఆన్‌లైన్ క్లాసులు, స్కూల్ ప్రాజెక్టుల కోసం ఉపయోగించాల్సి వస్తే దాని కోసం నిర్ణీత సమయాన్ని కేటాయించండి.
ఆ ఆహారం వద్దు..
చిన్న వయసులోనే చాలామంది పిల్లలు ఊబకాయం సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. మనదేశంలో సుమారు 1.44 కోట్ల మంది పిల్లలు ఈ సమస్యతో బాధపడుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. ఈ విషయంలో మన దేశం ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉంది. దీనికి ప్రధాన కారణాలు.. జంక్ ఫుడ్ తినడం, వ్యాయామం చేయకపోవడం. పిల్లలకు ఆకలైందంటే కొంతమంది తల్లులు రెండు నిమిషాల్లో అయిపోతుందిగా అని నూడుల్స్ చేసి పెడుతుంటారు. మరికొంతమంది పిల్లలు వ్యాయామం చేయడానికి బద్ధకిస్తుంటారు. అయితే పిల్లలను వ్యాయామం చేయమని మీరు లేటుగా నిద్ర లేస్తే ఎలాంటి లాభం ఉండదు. కాబట్టి ఆహారం, వ్యాయామం విషయాల్లో పిల్లలకు చెప్పే మంచి అలవాట్లు ముందు మీరు ఆచరించి చూపించండి. ఇలా చేయడం వల్ల మిమ్మల్ని చూసి వారే నెమ్మదిగా మారతారు.
ఈ అలవాట్లకు దూరంగా...
పిల్లలకు గ్రాహ్య శక్తి ఎక్కువ. కాబట్టి మీరు మంచి చేసినా, చెడు చేసినా.. వాటిని ఇట్టే ఒంటబట్టించుకుంటారు. ఇది దృష్టిలో పెట్టుకొని..
* పిల్లల ముందు ఇతరులను కించపరచడం, తక్కువ చేసి మాట్లాడడం, తిట్టడం.. వంటివి చేయకూడదు.
* కొంతమంది తల్లిదండ్రులు పిల్లల ముందే మద్యపానం, ధూమపానం.. వంటివి చేస్తుంటారు. దీనివల్ల పిల్లలు కూడా ఆ అలవాట్లకు ప్రేరేపితమయ్యే ప్రమాదం ఉంది.
* కొంతమంది తల్లిదండ్రులు పిల్లల ముందే తమ భాగస్వామిని, ఇతర కుటుంబ సభ్యులను తక్కువ చేసి మాట్లాడుతుంటారు.. ప్రవర్తిస్తుంటారు. ఇలా మీ ప్రవర్తన చూసి కొన్నాళ్లకు వాళ్లు కూడా మీలాగే తయారైనా ఆశ్చర్యపోనవసరం లేదు.
* ఈ వయసులో వారికి ఏం తెలియదులే అనే భావనతో కొంతమంది తల్లిదండ్రులు వారిముందే రొమాన్స్ చేస్తుంటారు. దీనివల్ల వాళ్ల మెదడుపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అనవసర విషయాలకు ప్రేరేపితమై తప్పటడుగులు వేసినా నష్టపోయేది అటు వాళ్లు, ఇటు మీరు అని గుర్తుపెట్టుకోండి!