కోర్టు ఉత్తర్వులు గౌరవించలేని అధికారులపై మద్రాస్ హైకోర్టు(Madras High Court) ఘాటు వ్యాఖ్యలు చేసింది. అలాంటివారికి జైలు శిక్షే సరైనదని అభిప్రాయపడింది. వారిని సస్పెండ్ చేయాలని, సస్పెన్షన్ ఎత్తేసిన తర్వాత కూడా...
కోర్టు ఉత్తర్వులు గౌరవించలేని అధికారులపై మద్రాస్ హైకోర్టు(Madras High Court) ఘాటు వ్యాఖ్యలు చేసింది. అలాంటివారికి జైలు శిక్షే సరైనదని అభిప్రాయపడింది. వారిని సస్పెండ్ చేయాలని, సస్పెన్షన్ ఎత్తేసిన తర్వాత కూడా అప్రాధాన్య పోస్టులోనే నియమించాలని తెలిపింది. చెన్నై(Chennai) నగరంలో అక్రమ నిర్మాణాలు చేపట్టినట్లు గుర్తించినా.. చర్యలు తీసుకోని దైవశిఖామణి అనే అధికారికి చెన్నై కార్పొరేషన్(Corporation) మూడేళ్లపాటు వేతన పెంపును నిలిపివేసింది. ఈ మేరకు గతంలో ఉత్తర్వులిచ్చింది. దీన్ని ఆయన మద్రాస్ హైకోర్టులో సవాల్ చేశారు. విచారణ జరిపిన హైకోర్టు కార్పొరేషన్ ఉత్తర్వులను రద్దు చేసింది. దీనిపై కార్పొరేషన్ అప్పీలు చేసింది. గతేడాది అక్టోబరులో ఈ పిటిషన్‌ను విచారించిన కోర్టు పదోన్నతి జాబితాలో దైవశిఖామణి పేరునూ పరిశీలించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.
ఈ క్రమంలో శుక్రవారం మళ్లీ విచారణ జరిగింది. కోర్టు స్టే ఉత్తర్వులు ఇస్తే తప్ప అక్రమ నిర్మాణాల విషయంలో అధికారులు వెంటనే తమ నిర్ణయాలు వెల్లడించాలని స్పష్టం చేసింది. కోర్టు ఉత్తర్వులను గౌరవించని అధికారులకు జరిమానా వేయడం కంటే.. జైలుశిక్షే ప్రధానంగా విధించాలని వ్యాఖ్యానించింది. భవన యజమానుల అప్పీళ్లపై విచారించి చర్యలు తీసుకోవాల్సిన అధికారులు… వారి నుంచి లంచాలు తీసుకోవడం సిగ్గుపడాల్సిన విషయమని ఘాటుగా వ్యాఖ్యానించింది.