కరోనా వల్ల పిల్లలు ఇంటిపట్టునే ఉండి మొబైల్‌కు అలవాటు పడిపోయారు. క్రమశిక్షణ తప్పిపోయింది. పాఠశాలలు మొదలైనా, పరీక్షలు ముంచుకొస్తున్నా చదువు మీద ధ్యాస లేదు. ఇప్పుడు పిల్లల్ని ఎలా చదివించాలా అని అమ్మలంతా తలలు పట్టుకుంటున్నారు. దీనికి బెంగటిల్లొద్దంటూ విద్యా నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు.
* ముందుగా మీరు ఏదో ఘోరం జరిగిపోతోంది, చిన్నారి భవిష్యత్తు ఏమైపోతుంది- అని భయపడటం మానేయండి. పిల్లలు కొంచెం గాడి తప్పిన మాట వాస్తవం. కానీ గుర్తించాల్సింది ఏమంటే మీ ఒక్కరి చిన్నారి మాత్రమే కాదు.. అందరూ ఇలాగే ఉన్నారు కనుక పరిస్థితి తప్పకుండా సర్దుకుంటుంది. చక్కబడుతుంది. మీరు చేయాల్సిందల్లా కాస్త ఓపిక పట్టి స్థిమితంగా ఉండటం
* మునుపు మంచి మార్కులు తెచ్చుకున్న వాళ్లు కూడా ఇప్పుడు వెనకబడ్డారు. వేసవి సెలవలు ముగిసి స్కూళ్లు తెరిచాక కొన్నాళ్లు పిల్లలకు ఆటల మీదే ధ్యాస ఉన్నా క్రమంగా మళ్లీ మామూలు స్థితికి వస్తారు. ఇప్పుడు మరింత కాలం ఇంట్లోనే ఉన్నారు కనుక ఇంకాస్త ఎక్కువ సమయం పట్టచ్చు. అంతే!
* చేతిలోంచి ఫోన్ దురుసుగా లాగేసుకోవడం కంటే రాబోయే అనర్థాలను వివరించి చెప్పండి. బంగారు భవిష్యత్తుకు చదువు ఎంత అవసరమో తెలియజేయండి.
* పుస్తకాలు తెరవకుండా మొరాయించినా ఇదే సూత్రం.. పరీక్షల్లో ఉత్తీర్ణత ఎంత ముఖ్యమో చెప్పి, తర్వాత ఆటలూ, టీవీ మామూలే కనుక ఈ కొన్నిరోజులూ శ్రద్ధగా చదువుకోమని చెప్పండి.
* మధ్యలో ఆన్‌లైన్ తరగతులు జరిగి క్రమశిక్షణ తప్పింది కనుక ప్రస్తుతం పిల్లలకు చదువు కాస్త కష్టమైన వ్యవహారమే. ‘నీతో పాటు నేనూ నేర్చుకుంటా’ అని స్నేహంగా పక్కన కూర్చోండి. చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకుంటూ చదవడంలో సాయం చేయండి.
* డిస్టింక్షనూ, ర్యాంకుల్లాంటి పెద్దపెద్ద లక్ష్యాలు పెట్టి పిల్లల్ని గాబరాపెట్టకండి! ఇప్పుడున్న పరిస్థితిలో అంత పెద్ద లక్ష్యాలు సాధిస్తే మంచిదే.. లేకున్నా నష్టం లేదని శాంతంగా ఉండండి.
* ఎలాంటి నిరాశలూ నిస్పృహలూ లేకుండా ఆశావహ దృక్పథంతో ఉండండి! పరిస్థితి త్వరలోనే యథాస్థితికి వస్తుంది