Search This Blog

Friday, April 1, 2022

కోర్టు ఉత్తర్వుల బట్వాడాకు ‘ఫాస్టర్‌’

న్యూఢిల్లీ, మార్చి31: నిందితుల విడుదలకు కోర్టులు బెయిల్‌ మంజూరు  చేసినా, ఆ ఉత్తర్వులు సకాలంలో అందక వారు జైలులోనే ఉండిపోవాల్సిన సందర్భాలు ఎన్నో. ఆదేశాల హార్డ్‌ కాపీలు అందక విడుదల కాని వారూ ఉన్నారు. మధ్యలో సెలవులు వస్తే మరింత జాప్యం జరిగిన పరిస్థితులు ఇంకెన్నో. ఈ ఇబ్బందులు అన్నింటికీ శాశ్వతంగా ముగింపు పలికేలా న్యాయస్థానాల ఉత్తర్వులను ఎలక్ర్టానిక్‌ విధానంలో త్వరగా, సురక్షితంగా పంపించేలా ఏర్పాట్లు చేస్తూ సుప్రీంకోర్టు చరిత్రాత్మక నిర్ణయం తీసుకొంది. ఇందుకోసం ఉద్దేశించిన ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను గురువారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ ఫాస్ట్‌ అండ్‌ సెక్యూర్డ్‌ ట్రాన్స్‌మిషన్‌ ఆఫ్‌ ఎలక్ర్టానిక్స్‌ రికార్డ్స్‌ (ఫాస్టర్‌) పేరుతో ఎన్‌ఐసీ సహకారంతో సుప్రీంకోర్టు రిజిస్ట్రీ యుద్ధ ప్రాతిపదికన ఈ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించిందని తెలిపారు. దీని ద్వారా కోర్టు ఉత్తర్వులను దేశంలోని అన్ని జిల్లాలకు చేరవేయడానికి వీలవుతుందని, ఇందుకోసం సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో 73 మంది నోడల్‌ అధికారులను నియమించారని చెప్పారు. 


ఉత్తర్వులన్నింటినీ సురక్షితంగా పంపించడం కోసం నోడల్‌ అధికారులందర్నీ ప్రత్యేక జ్యుడీషియల్‌ కమ్యూనికేషన్‌ నెట్‌వర్క్‌(జేసీఎన్‌) ద్వారా అనుసంధానం చేసినట్టు తెలిపారు. దేశవ్యాప్తంగా వివిధ స్థాయిలకు చెందిన 1,887 మంది అధికారుల ఈ-మెయిల్‌ ఐడీలను పొందుపరిచినట్టు చెప్పారు. వీటన్నింటినీ పర్యవేక్షించడానికి సుప్రీంకోర్టు రిజిస్ట్రీలో ప్రత్యేకంగా ‘ఫాస్టర్‌ సెల్‌’ ఏర్పాటు చేసినట్టు వివరించారు. కోర్టు ఆదేశాలను నోడల్‌ అధికారులకు పంపించే ఏర్పాట్లను ఇది చూసుకుంటుందని చెప్పారు. ఈ ఉత్తర్వుల ప్రామాణికతను నిర్ధరించడానికి సుప్రీంకోర్టుకు చెందిన సంబంధిత నోడల్‌ అధికారులు, సంస్థకు చెందిన డిజిటల్‌ సిగ్నేచర్లు వాటిపై ఉంటాయని పేర్కొన్నారు. అందువల్ల సమయాన్ని వృథా చేయకుండా కింది స్థాయి వర కు ఉత్తర్వులు పంపించే వీలు కలిగిందన్నారు. 


ప్రస్తుతం బెయిల్‌ మంజూరు, ఖైదీల విడుదల, కోర్టు కార్యకలాపాలకు చెందిన ఆర్డర్లు, రికార్డ్‌ ఆఫ్‌ ప్రొసీడింగ్స్‌ను ఎలాంటి జాప్యం లేకుండా పంపించేందుకు ఈ ఏర్పాటు చేసినట్టు చెప్పారు. రెండో దశలో మొత్తం కోర్టు ఉత్తర్వులు అన్నింటినీ పంపిస్తామని, అది కూడా సమీప భవిష్యత్తులోనే ఆచరణకు వస్తుందని తెలిపారు. అప్పుడు హార్డ్‌ కాపీలు పంపాల్సిన అవసరం ఉండదని చెప్పారు.  తక్కువ సమయంలోనే దీన్ని అందుబాటులోకి తెచ్చిన సెక్రటరీ జనరల్‌, రిజిస్ర్టీ, ఎన్‌ఐసీ అధికారులను, సహకరించిన హైకోర్టులను ఆయన అభినందించారు. ఆన్‌లైన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో జస్టిస్‌ ఎ.ఎం.ఖాన్విల్కర్‌, జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ హేమంత్‌ గుప్తా, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు, జడ్జీలు పాల్గొన్నారు. ఓ కేసులో ముద్దాయిలను విడుదల చేయాలని ఆదేశించినా ‘ఉత్తర్వులు అందలేదు, వెరిఫికేషన్‌ పూర్తి కాలేద’న్న కారణాలతో వాటిని అమలు చేయయకపోవడంపై జస్టిస్‌ రమణ ఆధ్వర్యంలోని బెంచ్‌ సుమోటోగా విచారణ జరిపింది. ఆ సమయంలోనే ‘ఫాస్టర్‌’ ఆలోచనకు రూపకల్పన జరిగింది.  

TSWREIS

TGARIEA ONLINE MEMBERSHIP

MATHS VIDEOS

EAMCET/IIT JEE /NEET CLASSES

Top