అమరావతి: కోర్టు ఆర్డర్లను అమలు చేయాల్సిన బాధ్యత ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ మీద ఉందని, లేదంటే సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ అన్నారు. ఐఏఎస్ అధికారులకు కోర్టు శిక్ష విధించడంపై ఆయన స్పందించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ వ్యవస్థలు.. రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాలన్నారు. ఫుట్‌బాల్ మ్యాచ్‌లో ఆటగాళ్లు సరిగ్గా ఆడని సమయంలో ఎలాగైతే రెఫరీ.. రెడ్ కార్డు చూపించి వార్నింగ్ ఇస్తాడో.. జ్యుడీషరీ కూడా అలాగే వ్యవహరిస్తుందని చెప్పారు. అధికారాలు ఉన్నాయి కదా అని లెజిస్లేచర్ ఇష్టానుసారం చట్టాలు చేయడానికి వీల్లేదని, అలాగే ఇష్టం వచ్చినట్లు చేయడానికి ఎగ్జిక్యూటివ్ వ్యవస్థకు కూడా అధికారం లేదన్నారు. కోర్టు ఇచ్చిన ఆర్డర్‌ను అమలు చేయలేమని చెప్పడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. కోర్టు ఆర్డర్ నచ్చని పక్షంలో ఉన్నత న్యాయాస్థానాలను ఆశ్రయించే అధికారం ఉంది గానీ.. ఆర్డర్‌ను వ్యతిరేకించే హక్కు ఎవరికీ లేదని తెలిపారు.
కోర్టు ఆర్డర్ ఇవ్వగానే.. దాన్ని సంబంధిత మంత్రి వద్దకు పంపాల్సి ఉంటుందని తెలిపారు. చాలా మంది మంత్రులు మౌఖికంగా ఆర్డర్లు ఇస్తూ ఉంటారని, ఇలాంటి సందర్భాల్లోనే సమస్యలు తలెత్తుతుంటాయన్నారు. మంత్రులు, అధికారుల మధ్య ఎలాంటి చర్చ జరిగినా.. అది ఫైళ్ల రూపంలో ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉండదని పేర్కొన్నారు. అలా కానీ పక్షంలో సమస్య తలెత్తినప్పుడు అధికారులే ఇబ్బందిపడతారని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన నెల్లూరులో జరిగిన ఓ ఘటనను గుర్తు చేశారు. ఓ మహిళకు చెందిన భూమిని ప్రభుత్వం 2015లో తీసుకుని, అందుకు పరిహారాన్ని అందజేయలేదన్నారు. దీనిపై ఆమె కోర్టుకు వెళ్లిందని చెప్పారు. విచారించిన కోర్టు ఆమెకు పరిహారం అందజేయాలని 2017లో తీర్పు ఇచ్చిందన్నారు. అయితే 2021వరకు పరిహారం అందలేదని, దీంతో ఆ మహిళ హైకోర్టును ఆశ్రయించగా.. కంటెమ్ట్ ఆఫ్ కోర్టు కింద అప్పుడు పని చేసిన అధికారులందరికీ శిక్ష విధించిందని గుర్తు చేశారు. జడ్జి గురించి మాట్లాడిన కేసులో గతంలో ఏకంగా మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ కూడా కంటెమ్ట్ ఆఫ్ కోర్టు కేసును ఎదుర్కొనే పరిస్థితి వచ్చిందన్నారు. జడ్జిలు, వారి ప్రవర్తన గురించి మాట్లాడితే క్రిమినల్ కంటెమ్ట్ కిందకు వస్తుందని, అలాగే కోర్టులు ఇచ్చిన ఆర్డర్లను ఫాలో అవని పక్షంలో అది సివిల్ కంటెమ్ట్ కిందకు వస్తుందని ఆయన పేర్కొన్నారు.