సలహాలు, సూచనలు
ఎంత చదువుతున్నామన్నది కాదు, సిలబస్‌లో ఉన్నది చదువుతున్నామా లేదా అన్నది చూసుకోవాలి.
చదివిన విషయాలు ఎంతవరకు గుర్తుంచుకుంటున్నారో మనల్ని మనం పరీక్షించుకోవాలి.
చాలా విషయాలను సులభమైన రీతిలో గుర్తుంచుకోవడానికి కోడ్‌లు సొంతంగా తయారు చేసుకోవాలి.
అర్థమెటిక్, రీజనింగ్ ప్రశ్నలను తక్కువ సమయంలో ఛేదించడానికి షార్ట్‌కట్ మెథడ్స్ బాగా సాధన చేయాలి.
పోలీస్ ఉద్యోగం కోసం నిర్వహించే పరీక్షల్లో ప్రతిసారీ ప్రశ్నల కఠినత్వాన్ని పెంచుతున్నారనే విషయాన్ని గమనించాలి.
గత ప్రశ్నపత్రాలను పరిశీలించి, ప్రశ్నల సరళిని గమనించి వాటికి అనుగుణంగా ప్రిపరేషన్ చెయ్యాలి.
సిలబస్ ప్రకారం ఏ అంశాలు ముందుగా చదవాలో, వేటికి ప్రాముఖ్యం ఉందో, గత పరీక్షల్లో ఏ అంశాల నుంచి ప్రశ్నలు అడిగారో తెలుసుకుని చదవాలి.
గత ప్రశ్నపత్రాల సరళిని పరిశీలిస్తే నిత్యజీవితానికి సంబంధించిన ప్రశ్నలు అడిగారు.
జీవశాస్త్రంలో వృక్ష స్వరూప శాస్త్రం, వృక్ష ఆవరణ శాస్త్రం, సూక్ష్మజీవులు, వ్యాధులు, మానవ శరీరధర్మశాస్త్రం, పోషణ, కణశాస్త్రం నుంచి ఎక్కువగా ప్రశ్నలు వస్తున్నాయని గమనించవచ్చు.
అంశాల వారీగా విశ్లేషణ
పోషణ: విటమిన్‌లు-వాటి రసాయన నామాలు, లోపిస్తే వచ్చే వ్యాధులు, స్థూల మూలకాలు, సూక్ష్మ మూలకాలు, కార్బోహైడ్రేట్స్, ప్రొటీన్స్, లిపిడ్స్, పోషకాహార లోప వ్యాధులు అనే అంశాలపై అవగాహన ఉండాలి.
మాదిరి ప్రశ్న
కృష్ణ అనే విద్యార్థి కంటి చూపునకు సంబంధించిన లోపంతో బాధపడుతున్నాడు. వైద్యుడిని సంప్రదించగా విటమిన్-ఎ ఎక్కువగా ఉన్న పదార్థాలు తీసుకోవాల్సిందిగా సలహా ఇచ్చాడు. కింది వాటిలో దేన్ని సూచిస్తావు?
1) జామ 2) బొప్పాయి
3) నారింజ 4) టమాట
సమాధానం: (2) బొప్పాయి