Search This Blog

Sunday, March 27, 2022

విజయానికి సోపానాలు ఇవే !


వేలాది ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు వస్తున్నాయి. ఇప్పటిదాకా ఉన్న అనిశ్చితి దాదాపు తొలగిపోయింది. వయోపరిమితి సడలింపు జీవో వచ్చింది. త్వరలో ఒక్కో నోటిఫికేషన్‌ రానున్నది. ఈ నేపథ్యంలో లక్షలాది మంది అభ్యర్థులకు అనేక సందేహాలు ఉంటాయి. ఎలా చదవాలి? ఎక్కడి నుంచి ప్రారంభించాలి? ఏం పుస్తకాలు చదవాలి? ఇలా రకరకాల సందేహాలు కలుగుతాయి. వాటన్నింటికి ఎంత త్వరగా ఫుల్‌స్టాప్‌ పెడితే అంత మంచిది. వెంటనే కొలువుల సమరానికి సిద్ధం కావాలి. దీనికి మొదట ఏం చేయాలో ఆయా సందర్భాల్లో నిపుణులు, విజయం సాధించిన వారు ఇచ్చిన సలహాలు, సూచనలు మీ కోసం..
బలాలు బలహీనతలు
ఏ పరీక్షకు సిద్ధమయ్యే వారైనా మొదట వారి బలాలు, బలహీనతలను ఒక పేపర్‌ మీద రాసుకోవాలి. బలహీనమైన వాటిలో పట్టు సాధించడానికి తక్షణమే ప్లాన్‌ వేసుకోవాలి. భయం వీడాలి. అవసరమైతే సీనియర్లు/ఫ్యాకల్టీ సలహాలు తీసుకోవాలి. ఏ పరీక్షకు సిద్ధమవుతున్నారో దానికి సంబంధించిన సిలబస్‌ను క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఆ సిలబస్‌లో బలహీనంగా ఉన్నవాటి కోసం ఒక ప్రణాళిక వేసుకుని, ఆయా సబ్జెక్టులను కాన్సెప్ట్‌ ఓరియంటేషన్‌తో చదవాలి. ఇదే సమయంలో రాయబోయే పరీక్షకు ఉన్న కాలవ్యవధి ఒక అంచనా వేసుకుని దానికి తగ్గట్లు ప్రిపరేషన్‌ ప్లాన్‌/టైం టేబుల్‌ను రూపొందించుకోవాలి.

టైం మేనేజ్‌మెంట్‌..
ఏ కార్యంలోనైనా విజయం సాధించాలంటే తెలివిగా ఉన్న సమయాన్ని ఉపయోగించుకోవాలి. ఎవరైతే సరైన సమయాన్ని సరైన రీతిలో ఉపయోగించుకుంటారో వారే విజేతలుగా నిలుస్తారు. రోజువారీ టైం టేబుల్‌ను వేసుకుని దాన్ని పక్కాగా అమలు చేయాలి. ఈ టైం టేబుల్‌లో చదువు, రివిజన్‌, రిలాక్స్‌ కోసం తప్పనిసరిగా టైం కేటాయించుకోవాలి.

సబ్జెక్టులవారీగా..
రాయబోయే పరీక్ష లేదా పరీక్షల్లో సబ్జెక్టులవారీగా ప్రిపరేషన్‌ చేయాలి. ఉదయం కొంత కష్టమైన సబ్జెక్టు, మధ్యాహ్నం కొంత ఈజీ సబ్జెక్టును, రాత్రి రివిజన్‌/మధ్యస్థంగా ఉండే సబ్జెక్టులను చదువుకునేలా ప్లాన్‌ వేసుకోవాలి. అంతేకాకుండా ఒకటి కంటే ఎక్కువ పరీక్షలకు ప్రిపేరవుతుంటే ఆయా పరీక్షల్లో ఉండే కామన్‌ సబ్జెక్టులు/సిలబస్‌కు అనుగుణంగా ప్రిపరేషన్‌ స్ట్రాటజీని రూపొందించుకోవాలి.

రివిజన్‌ ప్లాన్‌..
ఏ పరీక్షకు ప్రిపేరయ్యే వారైనా పరీక్ష రోజు వరకు చదవద్దు. పరీక్షకు ముందే పూర్తి సిలబస్‌ చదవడం, కనీసం రెండుసార్లు రివిజన్‌ చేసుకోవడం చేస్తే విజయ అవకాశాలు పెరుగుతాయి. గ్రూప్‌-1, 2, 3, 4 ఇలా ఏ పరీక్ష అయినా ఒక నిర్దిష్ట సమయాన్ని పెట్టుకుని పూర్తిచేసిన తర్వాత ఎక్కువ సార్లు సిలబస్‌కు అనుగుణంగా రివిజన్‌ చేయడం, షార్ట్‌ నోట్స్‌ రాసుకోవడం తప్పనిసరిగా చేయాలి.

మాక్‌ పేపర్స్‌..
సిలబస్‌ పూర్తిచేయడం, రివిజన్‌ చేయడంతో విజయం రాదు. ఆ పరీక్ష మోడల్‌ పేపర్లు/మాక్‌ టెస్ట్‌లను ఎన్ని ఎక్కువ వీలైతే అన్ని రాయాలి. దీని వల్ల ఏ అంశాల్లో వీక్‌గా ఉన్నారు? ఏ అంశాల్లో రివిజన్‌ అవసరం? కవర్‌ చేయని అంశాలు ఏమైనా ఉన్నాయా? పరీక్ష కాలవ్యవధి సరిపోతుందా? ఇంకా తెలియని రకరకాల అంశాలను మాక్‌ టెస్ట్‌ల ద్వారా తెలుసుకోవచ్చు. ఈ టెస్టుల్లో వచ్చిన స్కోర్‌ ద్వారా అప్‌డేట్‌ అయితే విజయం సొంతం అవుతుంది.

పేరణ
పోటీ ప్రపంచంలో విజయానికి ప్రధానమైన వాటిలో ప్రేరణ (మోటివేషన్‌) చాలా కీలకం. ఉపాధ్యాయులు, సీనియర్లు, కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్‌ ద్వారా ప్రేరణ పొందండి. లక్ష్యాన్ని సాధించడంలో అనేక ఆటంకాలు వస్తాయి. వీటికి భయపడకుండా ఉండాలంటే ప్రేరణ తప్పనిసరి. బయటి నుంచి ప్రేరణ లేకుంటే మీకు మీరే స్వయం ప్రేరణ చేసుకోవాలి. గత పరీక్షల్లో టాపర్లుగా నిలిచిన వారి ఇంటర్వ్యూలను జాగ్రత్తగా అధ్యయనం చేసి వారి సలహాలు, సూచనలను పాటించండి. అంతేకాకుండా విజయానికి అతి చేరువగా వచ్చి ఓడిపోయిన పరాజితుల తప్పులను తెలుసుకోండి. అవి చేయకుండా జాగ్రత్త పడండి. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ధైర్యం కోల్పోవద్దు. వందల సార్లు ఫెయిల్‌ అయిన థామస్‌ ఆల్వా ఎడిసిన్‌ తన 999 తప్పులతో వెయ్యోసారి విజయం సాధించాడు. ఇలా ప్రపంచ విజేతలు ఒక్కరోజులో విజేతలుగా నిలబడలేదు. పాజిటివ్‌ ఆటిట్యూడ్‌ పెంచుకోండి. నమ్మకం, విశ్వాసంతో ముందుకుపోతే విజయం తథ్యం.

TSWREIS

TGARIEA ONLINE MEMBERSHIP

MATHS VIDEOS

EAMCET/IIT JEE /NEET CLASSES

Top