Be alert & careful Friends..
"బుట్టలో పడతారు... జాగ్రత్త..!"
ఇపుడు నడుస్తున్నది అతి తెలివైన వాళ్ల ప్రపంచం. ఎదుటి వాళ్లను బురిడీ కొట్టించడానికి కొత్తకొత్త ఎత్తులతో ముందుకొస్తున్న వాళ్ల ప్రపంచం. అమాయకంగా ఉంటే బుక్కయిపోవటం ఖాయం. అయితే... ‘నేను చాలా ఇంటలిజెంట్. ఎవరి ఆటలూ నా దగ్గర సాగవు’ అన్న అతి ధీమా కూడా పనికిరాదు. తెలివిగా ఉండటంతో పాటు... ప్రతిక్షణం జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండటం అవసరం. లేకుంటే మనకు తెలియకుండానే మోసగాళ్లు మనల్ని బుక్ చేసేస్తారు. నేరంలో పాత్రధారులను చేస్తారు. మన పేరిట నిధులు కొల్లగొడతారు.
ఇలా మోసపోయిన పలువురి వ్యవహారాలు అధ్యయనం చేసిన అనంతరం వాటిని ‘సాక్షి’కి వెల్లడించారు కోటక్ ఓల్డ్ మ్యూచువల్ లైఫ్ ఇన్సూరెన్స్‌లో సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్న గణేష్ అయ్యర్. ఇతరులు మోసపోకూడదన్న ఉద్దేశంతో ఆ కేస్ స్టడీల వివరాలు చెబుతూ... తగిన జాగ్రత్తలు కూడా సూచించారాయన. అదే ఈ వారం ప్రాఫిట్ ప్లస్ ప్రధాన కథనం...
కేవైసీ పత్రాలతో అజాగ్రత్త పనికిరాదు..
≈ ఎవరికిస్తున్నామో వాటిపై రాయటం అవసరం
≈ ఎందుకిస్తున్నామో కూడా రాసి సంతకం చేయాలి
≈ అజాగ్రత్తగా వ్యవహరిస్తే నేరాల్లో ఇరుక్కోవచ్చు
≈ ‘సాక్షి’తో కోటక్ లైఫ్ అధికారి గణేష్ అయ్యర్
నేరం చేయకపోయినా ఇరుక్కున్నాడు..
బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ కోసం రాజేష్ దరఖాస్తు చేసుకున్నాడు. నో యువర్ కస్టమర్ (కేవైసీ) పత్రాలుగా తన డ్రైవింగ్ లెసైన్స్, పాన్ కార్డు కాపీలను రిప్రజెంటేటివ్‌కు అందించాడు. అలాగే కొన్ని పాస్‌పోర్టు సైజు ఫొటోలను కూడా ఇచ్చాడు. సాధారణంగా ఎక్కువ మంది ఇదే విధంగా చేస్తుం టారు. కానీ, అవగాహనలేమి కారణంగా రాజీవ్ ఇక్కడే అడ్డంగా దొరికిపోయాడు. ఆ నక్కజిత్తుల రిప్రజెంటేటివ్ ఏం చేశాడంటే... ఒక ఫొటో కాపీని కంపెనీకి పంపించి మిగిఫొటో కాపీల ఆధారంగా ఓ సిమ్ కార్డు తీసుకున్నాడు. ఆ సిమ్ కార్డును సంఘ వ్యతిరేక చర్యలకు వినియోగించాడు. దర్యాప్తులో భాగంగా ఆ విషయాలను గుర్తించిన పోలీసులు... ఓ రోజు ఉన్నట్టుండి రాజీవ్‌ను అరెస్ట్ చేశారు.
సొమ్మొకడిది.. సోకొకడిది
మహమ్మద్ ఖాన్ వీసా కోసం ట్రావెల్ ఏజెంట్‌కు ఫోన్ బిల్లు, పాన్ కార్డు కాపీలను ఇచ్చాడు. ఆ తర్వాత కొన్ని నెలలకు ఖాన్‌కు డబ్బులతో పని పడింది. రుణం కోసం బ్యాంకుకు దరఖాస్తు చేసుకున్నాడు. కానీ, రుణం ఇవ్వలేమంటూ దరఖాస్తును బ్యాంకు తిరస్కరించింది. ఎందుకని ప్రశ్నిస్తే... ‘తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించడంలో మీరు విఫలమయ్యారు’ అని బ్యాంకు నుంచి సమాధానం వచ్చింది. అసలు తాను రూపాయి కూడా రుణమే తీసుకోనప్పుడు చెల్లించలేదన్న సమస్య ఎందుకొస్తుందని ప్రశ్నించాడు ఖాన్. అదంతా తమకు తెలియదని, సిబిల్ రికార్డుల్లో అలాగే ఉందని బ్యాంకు చెప్పటంతో నిర్ఘాంతపోయాడు. ఆ తర్వాత తెలిసిన విషయం ఏమిటంటే... వీసా కోసం ఇచ్చిన కాపీలు దుర్వినియోగమయ్యాయి. ఖాన్ పేరుతో వేరొకరు క్రెడిట్ కార్డు తీసుకుని లిమిట్ మేరకు అంతా డ్రా చేసుకున్నారు. ఆ భారం ఇప్పుడు ఖాన్‌పై పడింది.
ఊహకైనా అందుతుందా..?
రణవీర్‌సింగ్ ఓ రోజు డీమ్యాట్ ఖాతా తెరవటానికని ఏజెంటుకు పాన్ కార్డు, విద్యుత్ బిల్లుల కాపీలను ఇచ్చాడు. కొన్నాళ్ల తర్వాత రణవీర్‌సింగ్ ఇంటికి ఓ బ్యాంకు నుంచి కలెక్షన్ ఏజెంట్లు వచ్చారు. ‘రుణం తీరుస్తావా, లేదా?’ అంటూ ప్రశ్నించేసరికి అతడు తెల్లబోయాడు. ‘ఎవరని పొరబడుతున్నారు...? నా పేరు రణవీర్‌సింగ్’ అని చెప్పాడు. అవును... రణవీర్‌సింగ్ దగ్గరకే వచ్చాము. ఓ రుణాన్ని మరొకరితో కలసి (కో బారోవర్) తీసుకున్నారుగా? అంటూ ఏజెంట్లు చెప్పడంతో అతడిలో కంగారు మొదలైంది. వారి దగ్గరున్న పత్రాలను చూసి బ్యాంకుకు వెళ్లి వివరాలు తెలుసుకున్నాడు. నిజానికి అతడు ఎలాంటి రుణం తీసుకోలేదు. ఏజెంటుకు ఇచ్చిన పత్రాలను మోసగాళ్లు వాడేసుకున్నారు. రణవీర్‌సింగ్‌ను సహ దరఖాస్తుదారుడిగా పేర్కొంటూ బ్యాంకు నుంచి రుణం కాజేశారు.
ట్రావెల్ టికెట్ కొంటే... ఐటీ నోటీసొచ్చింది!
గౌరవ్‌షా ఓ రోజు ట్రావెల్ టికెట్ కోసం పాన్ కార్డు కాపీనిచ్చాడు. అందులో షా పాన్ నంబరుతో పాటు అతని పూర్తి వివరాలున్నాయి. అదే మోసగాళ్లకు వరమైంది. ఓ ఏడాదిన్నర తర్వాత ఆదాయపన్ను (ఐటీ) శాఖ నుంచి అతడికి నోటీసు వచ్చింది. ‘మీ ఆదాయం, ఆస్తుల వివరాలను పూర్తిగా అందజేయండి’ అన్నది అందులోని సారాంశం. ఎందుకయ్యా...? అంటే గౌరవ్‌షా పాన్ కార్డు కాపీని ఉపయోగించి పెద్ద ఎత్తున బంగారు ఆభరణాలు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను వేరొకరు నగదు రూపంలో కొనుగోలు చేశారు. పన్ను ఎగ్గొట్టేందుకు గౌరవ్ పాన్ కార్డు కాపీని వాడుకున్నారు. ‘నేను కాదు బాబోయ్’ అని గౌరవ్ మొరపెట్టుకున్నా... నగదు రూపంలో జరిగిన కొనుగోళ్లలో అసలు వ్యక్తిని కనిపెట్టడం కష్టమని తేల్చేశారు. చివరకు గౌరవ్ బాధితుడిగా మిగిలిపోయాడు.
ఇలా కూడా జరుగుతుందా!
రవి ఓ చిన్న కూరగాయల విక్రేత. కొన్నాళ్ల కిందట అతడు ఏదో పని నిమిత్తం రిప్రజెంటేటివ్‌కు ఆధార్ కార్డు కాపీని అందజేశాడు. దురదృష్టవశాత్తూ 11 నెలల తర్వాత ఓ రోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో రవి ప్రాణాలు కోల్పోయాడు. దర్యాప్తులో వెల్లడైన విషయాలతో పోలీసులే నోరెళ్లబెట్టాల్సి వచ్చింది. రవి షిండే ఇచ్చిన ఆధార్ కాపీతో అతడి పేరిట గుర్తు తెలియని వ్యక్తులు రూ.10 లక్షల జీవిత బీమా పాలసీ చొప్పున మొత్తం 14 కంపెనీల నుంచి రూ.1.40 కోట్ల మేర బీమా కవరేజీ తీసుకున్నారు. నామినీగా రవి భార్యను పేర్కొని ఆమె ఓటర్ ఐడీని ఫోర్జరీ చేసి వాడుకున్నారు. రూ.1.40 కోట్ల బీమాను కొట్టేయడానికి పథకం ప్రకారం రవిని ట్రక్‌తో ఢీకొట్టి చంపేశారు.
తెలియకుండానే బాధితులయ్యారు..!
పైన చెప్పిన వాళ్లెవరికీ తాము ఒక నేరంలో భాగస్వాములమవుతున్నామని తెలీదు. అంతా అవసరం కోసం ధ్రువపత్రాలను సమర్పించిన వారే. తెలియకుండా ఇరుక్కున్న వారే. వీటిని వినియోగించే విషయంలో కొంచెం అవగాహనతో, జాగ్రత్తతో వ్యవహరించి ఉంటే కొందరైనా తప్పించుకుని ఉండేవారు. మరి ఈ మోసగాళ్ల వలకు చిక్కకుండా ఉండాలంటే ఏం చేయాలి? కొన్ని సూచనలివిగో...
* అవసరం లేకుండా పాస్‌పోర్టు, డ్రైవింగ్ లెసైన్స్, పాన్ కార్డు, ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ కార్డు, విద్యుత్ బిల్లు, ఫోన్ బిల్లు, బ్యాంకు స్టేట్‌మెంట్ వంటి కేవైసీ పత్రాలను ఎవరికీ ఇవ్వకూడదు.
* తగిన అవసరం కోసం నిబంధనల మేరకు ఇవ్వాల్సి వస్తే... ఒరిజినల్స్ కాకుండా జిరాక్స్ కాపీ మాత్రమే ఇవ్వాలి. ఆ జిరాక్స్ కాపీపై ఎవరికిస్తున్నామో? ఎందుకిస్తున్నామో? సదరు ధ్రువపత్రంపై రాయాలి.
* ఇది ఈ ఒక్కసారి వినియోగానికి ఉద్దేశించినది మాత్రమే... అని సదరు జిరాక్స్ కాపీలపై స్పష్టంగా రాయాలి. ఎలా అంటే... ఉదాహరణకు బీమా పాలసీ కోసం కంపెనీకి ఆదాయ ధ్రువీకరణ పత్రాన్ని ఇస్తున్నారనుకోండి. జిరాక్స్ కాపీపై ‘ఈ కాపీని బీమా కోసం గాను ఏబీసీ ఇన్సూరెన్స్ కంపెనీకి ఇస్తున్నాను. ఇది ఈ ఒక్కసారి వినియోగానికి మాత్రమే’ అని రాయాలి. అక్కడే సంతకం కూడా చేయాలి.
* మీకు సంబంధం లేకపోయినా ఏదో ఒక విషయమై తరచుగా కాల్స్, ఎస్‌ఎంఎస్‌లు వస్తుంటే తేలిగ్గా తీసుకోవద్దు. ఎవరు పంపిస్తున్నారు..? ఎందుకు..? అన్నది తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీ పత్రాలను ఆధారంగా చేసుకుని వేరెవరైనా లావాదేవీలు నిర్వహించి ఉండవచ్చు.
* పాన్ నంబర్, క్రెడిట్ కార్డు నంబర్, బ్యాంకు ఖాతా నంబర్, బీమా పాలసీ నంబర్, పాస్‌వర్డ్‌లను ఎవరికీ చెప్పవద్దు. ఈ వివరాలు కోరుతూ వచ్చే మెయిల్స్, ఫోన్ కాల్స్, ఎస్‌ఎంఎస్‌లను నమ్మవద్దు.
* మీ బీమా పాలసీపై ఎన్నో ప్రయోజనాలు కల్పిస్తామంటూ వేసే వలలో చిక్కుకోవద్దు. ఈ విధమైన సమాచారంతో వచ్చే కాల్స్, మెయిల్స్, ఎస్‌ఎంఎస్‌లను పట్టించుకోవద్దు.